Home ఎడిటోరియల్ భారత ప్రజాస్వామ్యానికి నెహ్రూ దిశా నిర్దేశన

భారత ప్రజాస్వామ్యానికి నెహ్రూ దిశా నిర్దేశన

nehruస్వతంత్ర భారత పార్లమెంటరీ వ్యవస్థ నిర్మాత గా, నవ భారత రూపశిల్పిగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య వాదానికి గట్టి పునాదులు వేశారు. రెండు ప్రపంచ యుద్ధాల పరిణామాలను చవిచూసిన తరువాత ప్రజాస్వామ్య వాదాన్ని బల మైన వాదంగా పరిగణించి గాంధీజీ అడుగుజాడల లో ఆంగ్లేయుల పరిపాలన నుంచి అనుభవంతో పటిష్టమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి పండిట్ నెహ్రూ నిజమైన మార్గదర్శి అయినాడని చెప్పవచ్చు.
ప్రపంచ అంతర్జాతీయ సమతౌల్యాన్ని, అంతర్జా తీయతను సాధించడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. శ్రేయోవాదిగా, స్వాతంత్య్ర యోధుని గా, అంతర్జా తీయవాదిగా, స్వాతంత్య్రానంతర నవ భారత పునర్నిర్మాణంలో తిరుగులేని నాయకునిగా తన రాజకీయ జీవితంలో నెహ్రూ తన రాజనీతి భావాలను రూపొందించుకున్నారు. అలీనోద్యమం ద్వారా తృతీయ ప్రపంచదేశాల నాయకుడుగా వివిధ జాతుల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. మూడవ ప్రపంచ దేశాల ఐక్యత, అలీన విధానం వంటి అంతర్జాతీయ భావాలతో వలస పాలన నుంచి విముక్తి చెందిన దేశాలకు మార్గాన్ని నిర్దేశించారు.
పండిట్ నెహ్రూ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో విద్య నభ్యసించారు. ఇంగ్లండులో విద్యాభ్యాసాన్ని కొనసా గిస్తూ ఉదారవాదిగా, ప్రజాస్వామ్యవాదిగా తన జీవిత విధానాలను రూపొందించుకున్నారు. స్వదేశంలోని జాతీయ నాయకులైన గాంధీజీ, అరవిందుడు, గోఖలే, తిలక్ వంటి వారి రచనలతో పాటు బెర్నాడ్ షా, జెఎస్.మిల్, గ్లాడ్ స్టస్, లాస్కి, రస్సెల్‌ల ప్రభావం ఎంతగానో పడింది.
భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతం త్య్ర పోరాటంలో నెహ్రూ నిర్మాణాత్మకమైన పాత్రను నిర్వహించారు. గాంధీజీ అనుచరుడుగా ఆయన ఆశయాలను ప్రజాస్వామ్యవ్యవస్థలో పురి కొల్పారు.
నెహ్రూ మహామేథావి, ఆయన గ్రంథాలలో ‘గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’, ‘డిస్కవరీ ఆఫ్ ఇండి యా’, ఆటోబయోగ్రఫీ’ ముఖ్యమైనవి. నెహ్రూ రాజ నీతి భావాలకు భారత జాతిపట్ల ఆయనకు గల దృఢవిశ్వాసానికి ఈ గ్రంథాలు నిదర్శనం. స్వాతం త్య్రోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో మితవాద, అతివాద వర్గాల నాయకులతో కలసి, కాంగ్రెస్ కార్యక్రమంలో నూతన భావాలను ఆయన ప్రవేశపెట్టారు. డోనాల్డ్ డంకన్ అభిప్రాయం ప్రకారం నెహ్రూ సైద్ధాంతిక దృక్పథం జాన్ లాక్, రూసో, భెంథామ్, జెఎస్.మిల్ భావాలకు సన్నిహితంగా వుంటుంది.
నెహ్రూ ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనాన్ని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఆయనకు ప్రాణం లాంటిది. నెహ్రూ మాటలలో చెప్పాలంటే ప్రజా స్వామ్యం కేవలం రాజకీయపరమైనది. ఆర్థికపర మైనది మాత్రమే కాదు. అది మేథస్సుకు సంబం ధించినటువంటిది. ప్రజాస్వామ్యమంటే వ్యక్తి సంపూ ర్ణంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన స్వేచ్ఛ, ఇతరుల అభిప్రాయాలు తన అభిప్రాయా లకు భిన్నమైనప్పటికి సామరస్యంతో అర్థం చేసుకోవడం ప్రజాస్వామ్యం లక్షణం. ప్రజాస్వామ్యం ప్రగతి శీలమైనది. కాని స్థిరమైనది కాదు. ప్రజాస్వామ్య మంటే రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలకు అవ సరమైన మానసికప్రక్రియ అని నెహ్రూ భావించారు.
నెహ్రూ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ‘కేంద్రీకరణ ప్రవృత్తి’ అనివార్యమని పేర్కొన్నాడు. “ప్రణాళికాబద్ద ప్రజాస్వామ్య సమష్టివాదం” మాత్రమే దేశాన్ని పీడిస్తున్న దారిద్య్రాన్ని తొలగించేందుకు దోహదం చేస్తుందని తాను రచించిన “డిస్కవరి ఆఫ్ ఇండియా”లో ఆయన పేర్కొన్నాడు. భారతదేశం అవలంబిస్తున్న జాతీయ ప్రణాళికా విధానం ఆధునిక సమస్యలైన వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణకు, ‘కేంద్రీకృత సామాజిక ప్రణాళిక’కు, దేశ ఆర్థిక ప్రగతికి అవసరమని నెహ్రూ భావించారు. రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాతినిధ్య ప్రభుత్వ సిద్ధాంతం, ప్రజల సార్వభౌమ అధికారం అవసర మని నెహ్రూ భావించారు.
రాజకీయ ప్రజాస్వామ్యానికన్న ఆర్థికప్రజా స్వామ్యం అవసరం అని నెహ్రూ విశ్వసించారు. తాను రచించిన “గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ”లో ప్రజా స్వామ్యమంటే సమానత్వమని, సమ సమాజం లోనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య సిద్ధాంతం పేరుతో కేవలం ఒక వర్గం ప్రజలే తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని ఆయన ఊహించారు. ప్రజాస్వా మ్యాన్ని సాంఘిక, ఆర్థిక, సమానత్వాల ద్వారా సాధించవచ్చునని నెహ్రూ పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితులకు, ప్రజాస్వామ్య భావాలకు, ప్రజాస్వామ్య సమాజం ఏర్పాటుకు భారతదేశంలోని కులవ్యవస్థ ఆటంకాలు కలిగిస్తుందని నెహ్రూ ఆనాడే గుర్తించారు. భారతదేశంలో కులవ్యవస్థ అభివృద్ధి నిరోధకమైనదని, ప్రగతిసాధనలో ఆటంకాలు కల్పి స్తుందని, ఇలాంటి పరిస్థితిలో రాజకీయ ప్రజా స్వామ్యం కూడా కష్టసాధ్యమని, కులవ్యవస్థలను బట్టి ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అవసరమే లేదని నెహ్రూ పేర్కొన్నారు.
దేశప్రధానిగా తిరుగులేని నాయకుడుగా, లౌకిక వాదిగా, తన భావాలను రూపొందించి పంచవర్ష ప్రణాళికల ద్వారా వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతికి ఆయన కృషి చేశారు. నెహ్రూ 14 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొని భారత ప్రజాస్వామ్య పితామహుడుగా ప్రఖ్యాతి చెందారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యాంగ భారతదేశం రూపుదిద్దుకోవడానికి నెహ్రూ రాజనీతి భావాలు ఎంతో తోడ్పడ్డాయి. ప్రభుత్వ పథకాలను, విధానా లను సామాన్యులకు అందుబాటులో వుండేటట్టు అమర్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆయన పునర్ వ్యవస్థీకరించారు. తన విధానాలను మారుతున్న ఆర్థిక, సాంఘిక పరిస్థితులను బట్టి రూపొందించే వారు. ఆయన రాజనీతిజ్ఞత, పాలనాదక్షత, ప్రజాస్వామిక భావాలు, ఇతర దేశాలను మంత్రముగ్ధులను చేశాయి.
ప్రపంచ రాజకీయాలలో అలీన ఉద్యమంలో నెహ్రూ అంతర్జాతీయ వాదిగా గుర్తింపు పొందారు. ఆసియా, ఆఫ్రికా దేశాల సమైక్యతకు అలీన విధానా నికి నూతన బాటలు వేశారు. అగ్రరాజ్యాల ఒత్తిడితో సతమతమవుతున్న ఆఫ్రో, ఆసియా దేశాలకు రాజకీ య మనుగడ సాగించడానికి అలీన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తన అంతర్జాతీయ భావాలతో నాజర్, మార్షల్ టిటో, ఎన్‌కుమా లాంటి మహాను భావుల ఆలోచనలను ప్రభావితం చేశారు. జాన్ ఎఫ్.కెనడి, కృశ్చేవ్ లాంటి అగ్రరాజ్యాల నాయకుల దృష్టిని నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, ప్రపంచ శాంతి పరిరక్షణ వైపు మళ్ళించారు. అంతర్జాతీయ రాజకీయాలలో అలీన ఉద్యమం, తటస్థ విధానాల ద్వారా తృతీయ ప్రపంచ దేశాలలో రాజకీయ ఉద్రిక్తతలను సడలించి నిరాయుధీకరణ సాధనలో గణనీయమైన పాత్రను నిర్వహించారు.
నెహ్రూ ‘ప్రజాస్వామ్య సామ్యవాది’. ఆర్థిక చింతనలో ఆయన భావాలు రాజకీయ ఉదారవాదం, సామ్యవాదాల మేలు కలయిక. నెహ్రూ సామ్యవాద భావాలకు, జర్మన్ సామ్యవాదులు వాగ్నర్, ష్మాలర్, వీచే మొదలగు వారి భావాలకు సామ్యాన్ని గమనించవచ్చు. నెహ్రూ అభిప్రాయంలో సామ్య వాదం కేవలం ఆర్థిక పునర్నిర్మాణ సిద్ధాంతంకాదు. అది ఒక జీవిత విధానం. తాను సామ్యవాదమనే మాటను ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారంగా భావిస్తున్నానని నెహ్రూ పేర్కొన్నారు. సోవియట్ సామ్యవాద విధానాల ద్వారా ప్రభావితుడై సోవియట్‌ను నవ్య నాగరికత గల దేశంగా ఆయన పేర్కొన్నాడు. అంటే తన దృష్టిలో కొద్ది మినహాయింపులతో ప్రైవేటు ఆస్తిని రద్దు చేయా లని నెహ్రూ పేర్కొన్నారు. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని, సామ్యవాదాన్ని, ఉదారవాదాన్ని ఏనాడు వైరూప్య సిద్ధాంతాలుగా భావించలేదు.
భారతజాతి విలక్షణమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక ధ్యేయాలను రూపొందించడంలో ఆయన భావాలు రూపుదిద్దుకున్నాయి. ఆధునిక కాలంలో స్వేచ్ఛా సమానత్వాలను గురించిన సంఘీభావాన్ని ఏర్పరచి, ప్రగతిశీల సామ్యవాద వ్యవస్థ నిర్మాణానికి ఆయన తోడ్పడ్డారు.
నెహ్రూ ఆలోచనా సరళిలో శ్రీ అరబిందో లాంటి తాత్విక సిద్ధాంతాలు కాని, గాంధీజీ లాంటి ఆదర్శ వాదంకాని, రాజాజీ లాంటి తార్కిక భావాలు కాని, ఠాగూర్ లాంటి కాల్పనిక కావ్యదృష్టిగాని లేదు. అయినప్పటికి, పండిట్ నెహ్రూ, భారతదేశ చరిత్రలో ఉదాత్త రాజకీయ భావాలుగల రాజనీతి తత్తవేత్తగా గుర్తింపు పొందారు. భారతదేశంలో ప్రజాస్వామిక భవితవ్యం ఆయన సిద్ధాంతాలపైనే చాలా వరకు ఆధారపడి వుంటుందని రాజకీయ పండితులు భావించారు. ఉదారవాద ప్రజాస్వామ్య సిద్ధాంతాల లో విశ్వాసమున్న వారందరికీ నెహ్రూజీ భావాలు మార్గదర్శకం కాగలవు.
ప్రపంచశాంతిపట్ల, ఐక్యరాజ్యసమితి ఆశయాల పట్ల ఆయనకు అచంచల విశ్వాసం. అగ్రరాజ్యాల నియంతృత్వ విధానాలను, సామ్రాజ్యవాద ధోరణిని నెహ్రూ నిశితంగా విమర్శించాడు. ఏ రాజ్యకూటమి లో చేరకుండా భారతదేశాన్ని అలీన విధానం ద్వారా తీర్చిదిద్దడమే కాకుండా తృతీయ ప్రపంచ దేశాలలో అలీన విధానం ఉద్యమంగా రూపొందించడానికి నెహ్రూ మార్గదర్శకుడైనాడు. అలీన విధానం స్వాతం త్య్ర ఉద్యమాల నుంచి అవతరించినదని, మానవ స్వేచ్ఛ, ప్రపంచ శాంతి ప్రమాదంలో వున్నప్పుడు స్వతంత్ర దేశాలు తాము సాధించిన స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో అలీన విధానాన్ని రూపొందించినట్లు నెహ్రూ అభిప్రాయ పడినారు. అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర భద్రతకు, విశ్వాసానికి, శాంతియుత సహజీవ నానికి పంచశీల సిద్ధాంతాన్ని రూపొం దించిన రాజకీయ చాణుక్యుడు, మహామేథావి పండిట్ నెహ్రూ.
– 9440886001