Search
Wednesday 26 September 2018
  • :
  • :

వడ్డీ రేట్ల పెంపు, ట్రేడ్ వార్ భయాలు

gold

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ పతనమయ్యాయి. ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ఆందోళనలు వంటివి మార్కెట్‌ను మరింత నష్టాల వైపు లాగాయి. దీంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 356 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 11260 కీలక స్థాయిని కోల్పోయింది. వడ్డీ రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాల వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 356 పాయింట్ల నష్టపోయి 37,165 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్ తీవ్రతరమైన నేపథ్యంలో ఆసియా సూచీలు భారీ నష్టాల్ని చవిచూశాయి.  చైనా దిగుమతులపై 25 శాతం టారీఫ్‌లను విధించాలని అమెరికా భావిస్తుండడం, దీనికి ప్రతిగా చర్యలు చేపడతామని చైనా హెచ్చరించింది. దీంతో వాణిజ్య యుద్ధం తీవ్రతరం అవుతుండడంలో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా రియల్టీ సూచి 2 శాతం నష్టపోగా, ఆ తర్వాత ఆటో, ఫైనాన్షియల్ సర్వీస్, నిఫ్టీ బ్యాంకులు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో మార్కెట్ మిశ్రమంగా ప్రారంభమైంది. తొలుత సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల అంశాలతో క్షణాల్లో సూచీలు నష్టాల బాట పట్టాయి. బుధవారం ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచడంతో వాహన, ఆర్థిక, బ్యాంక్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ప్రధానంగా ఎం అండ్ ఎం, మారుతీ, గ్రాసిం, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా షేర్లు 2 నుంచి 2.50 శాతం నష్టపోయాయి. మరోవైపు బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్, పవర్‌గ్రిడ్ డాక్టర్ రెడ్డీస్, లుపిన్ షేర్లు 1 శాతం నుంచి 2 శాతం వరకు లాభపడ్డాయి.

Comments

comments