- వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలోనే ఎందుకు చేస్తారు?
జ : శ్రావణమాసం విష్ణుమూర్తికి సంబంధించిన మాసంగా ప్రశస్తి. ఈ మాసంలోనే ఆయన జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు వెక్కడుంటే శ్రీమహాలక్ష్మి కూడా అక్కడే కనుక ఆమెకు కూడా ఈ మాసమే ఇష్టమైంది. ఉభయులూ తీరికగా దొరికే మాసం కనుక ఈ మాసం విష్ణుభక్తులకు ఎంతో ఇష్టమైంది. లక్ష్మీనారాయణులిరువురినీ శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తారు. - వ్రతం ఏ సమయంలో ప్రారంభిస్తే మంచిది.
జ : వర్జం ఉ. 6.33- నుండి 8.16 ని. వరకు ఉంది. వర్జ సమయం మంచిదికాదు కనుక అది దాటిపోయింతర్వాత మొదలుపెట్టుకోవడం మంచిది. సాధారణంగా అపహార్ణవేళ అంటే 12 గంటలు దాటిన తర్వాత మొదలుపెట్టుకుంటే మంచిది. అలా కుదరకపోతే సాయంత్రం చేసుకుని పేరంటం పిలుచుకుంటే రెండూ ఒక్కసారిగా జరిగిపోతాయి. - ఏం మంత్రాలు చదువుకోవాలి?
జ : రోజూ చదువుకునే లక్ష్మీస్తోత్రంతోబాటు అష్టోత్తరం కాని సహస్రనామంకాని అనుసంధానిస్తే మంచిది. - వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉండాలంటారు నిజమేనా?
జ : ఉండగలిగితే మంచిది. పూర్తి ఉపవాసం చేయదలచుకున్నవారు వ్రతాన్ని సాయంత్రానికి మార్చుకోండి. అలా కుదరనివారు. మధ్యాహ్నానికే పెట్టుకోండి. వ్రతం ముగిసే వరకు ఎలాగూ ఏమీ తీసుకోరు కనుక ఆ మేర ఉపవాసం చేసినట్టే అవుతుంది. - అమ్మవారి పూజలో కలశం ఎందుకు పెడతారు?
జ : కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశ పాత్రగా మట్టి పాత్రనుగాని, వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను గాని వినియోగిస్తారు. లోహమైనా మట్టి అయినా అది పృథ్వీతత్తానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్తానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశతత్తానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్తానికి సంకేతం. దాని ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒకచోటికి చేర్చి పూజిస్తాం. అమ్మవారు పంచభూతమయి కనుక కలశ స్థాపనతో ఆరాధించడం ఆనవాయితీ! శ్రావణమాసం వెళ్ళేవరకు ఆరాధన కొనసాగించాలి. - కలశం ఎలా తయారుచేసుకోవాలి?
జ : కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడగాలి. తర్వాత దానికి పసుపు, కుంకుమలతో అలంకరించాలి. బియ్యంపోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు జల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరుపోసి మామిడాకులు కానీ, తమలపాకులు కాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్ళు ముక్కు, పెదవులు, కనుబొమలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు. దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు. - అమ్మవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదించాలి?
జ : 1/3/5/9. సాధారణంగా అమ్మవారికి అప్పాలు, వడలు, చక్కరపొంగలి, పులిహార, దద్దోజనం, శుండలు, పాయసం, కేసరి, లడ్డు ప్రసాదంగా నివేదిస్తారు. - అమ్మవారి దీక్షా తోరణం ఎలా తయారుచేసుకోవాలి?
జ : సాధారణ దారాన్ని 5 పొరలుగా తీసుకుని దానికి పసుపురాయాలి. దానికి మధ్యలో మామిడి ఆకునుకాని, తమలపాకును కాని పెట్టి ముడివేయాలి. దీన్ని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాక చేతికి మణికట్టు దగ్గర ధరించాలి. దీన్ని మొదటి శుక్రవారం కట్టుకుంటే నెలంతా ఉంచుకుని అమ్మవారి పూజ నెలరోజులూ జరుపుకోవాలి లేదా వరలక్ష్మి వ్రతం నాడు కట్టుకుని కలశానికి ఉద్వాసన పలికిన తర్వాత తీసేయొచ్చు. భర్తకు భార్య, భార్యకు భర్త ఈ తోరణాన్ని కట్టాలి. పిల్లలకు తండ్రే కట్టవచ్చు. - పూజలో ఏయే పువ్వులు వినియోగించాలి?
జ : అమవారికి పూజలో తామర,మొగలి పువ్వులు వినియోగించాలి. దూర్వాయుగం (గరిక) కూడా వాడతారు. - తాంబూలంలో ఏమేమి ఉంచాలి?
జ : తమలపాకులు, పచ్చివక్కలు లేదా ఎండు వక్కలు, ఖర్జూరం, కుంకుమ, పసుపు, చందనం, చిన్న అద్దం, దువెన, కాటుక, అందుబాటులో ఉండే ఏదో ఒక పండు, నానబెట్టిన శెనగలు, వీలైతే జాకెట్గుడ్డ వాయనంగా సమకూర్చి పేరంటానికి వచ్చినవారికి బహూకరించాలి. - వ్రతంలో చక్కరపొంగలి నైవేద్యంగా పెట్టాలా? పాయసం పెట్టాలా? పాయసమైతే బియ్యం పాయసం పెట్టాలా? సేమ్యా పాయసమైనా ఫర్వాలేదా?
జ : అమ్మవారికి పూజలో ప్రసాదంగా చక్కరపొంగలికానీ పాయసం కాని నివేదిస్తారు. పాయసం దేనితో తయారుచేసినా దోషం కాదు. - పూజ కోసం తయారుచేసిన హరిద్రా రూపాన్ని ఏం చేయాలి?
జ : పసుపుతో చేసే రూపాన్ని హరిద్రా లక్ష్మి అంటారు. అది ఎటూ పసుపే కనుక ముఖానికి రాసుకోవడం ఉత్తమం. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ. ముఖవర్ఛసులో లక్ష్మీకళ ఉంటుంది. - పూజలో వినియోగించిన బియ్యాన్ని ఏం చేయాలి?
జ : మర్నాడు అన్నం వండి దేవతా మందిరంలో ఇలవేలుపుకు ప్రసాదంగా సమర్పించి స్వీకరించాలి. - పూజ తర్వాత కొబ్బరికాయను ఏంచేయాలి?
జ : మనం రోజూ పూజించే దేవుడికి నివేదన చేసి కొట్టి ప్రసాదంగా చేసుకుని అందరూ తీసుకోవాలి. - కలశంలోని నీటినేం చేయాలి?
జ : కలశంలో ఉన్న నీరు పరమపవిత్రమైనవి కనుక అందరూ తలా కాసిని తలపై చల్లుకోవాలి. మిగిలిన నీటిని ఇంటావిడ, ఆడపిల్లలు స్నానంచేసేటప్పుడు నీటిలో కలిపేసుకుని స్నానం చేయాలి. - కలశంగాపెట్టిన కొబ్బరికాయ కొట్టినపుడు పాడైపోయి ఉంటే ఏం చేయాలి?
జ : అలా జరిగిందేమని మనసు పాడుచేసుకోకండి. మీరు పూజించింది కలశానికే కాని దాని మీద నిలబెట్టిన కొబ్బరికాయకు కాదు. అది లోపల బాగున్నా చెడిపోయినా బాధపడనక్కర్లేదు. - కలశం లేకుండా కూడా వ్రతం చేసుకోవచ్చా?
జ : వ్రతం అంటే ఒక దేవుణ్ణో దేవతనో ఆహ్వానించి కొంతకాలంపాటు ఆరాధించే పద్ధతి. ఇది కొనసాగింపు పూజా విధానం కనుక అది పూర్తయ్యేవరకు ఆరంభంలో ఉంచిన కలశం కూడా ఉంటుంది. ఈ కలశం వ్రతకాలం మొత్తానికి గుర్తుగా ఉంటుంది. అందుకని కలశం తప్పనిసరి. కలశం లేకుండా అయితే లక్ష్మీ పూజ చేసుకుంటే సరిపోతుంది. నెలమొత్తంగా విధివిధానంగా పూజ చేయడానికి కుదరనివారు కలశరహితంగా చేసుకోవడం ఉత్తమం. అందువల్ల ఎప్పుడైనా అవాంతరం వచ్చినా మనసు నొచ్చుకోకుండా ఉంటుంది. - మా ఇంట్లో నాలుగు నెలల గర్భిణి ఉంది. మేం వ్రతం చేసుకోవచ్చా?
జ : నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కాకపోతే గర్భిణులు ఎక్కువ సేపు కూచోలేరు కనుక వేగంగా వ్రతవిధి పూర్తిచేస్తే తీర్థ ప్రసాదాలు తీసుకుని విశ్రాంతి తీసుకోగలుగుతారు. - ఇంట్లో ఎవరికౌనా నెలసరి ఉంటే వ్రతం చేసుకోవచ్చా?
జ : నెలసరి ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయి కనుక వారు మరుసటి శుక్రవారం చేసుకుంటే మంచిది. నెలసరి ఉంది కనుక చేయకూడదు అని ఎక్కడా లేదు. - ఈ శుక్రవారం వ్రతం చేసుకోడానికి కుదరకపోతే ఏం చేయాలి?
జ : ఈ వారం కుదరకపోతే శ్రావణమంతా అమ్మవారికి విశేషమైనదే కనుక ఏ శుక్రవారమైనా వ్రతం చేసుకోవచ్చు. అలా కూడా కుదరనివారు దసరా నవరాత్రులలో అమ్మవారు లక్ష్మీ అవతారంలో ఉన్నప్పుడు ఈ పూజ
చేసుకోవచ్చు.-