Home మెదక్ ప్రజల ఆకాంక్షల నుండే తెలంగాణ జనసమితి ఆవిర్భావం

ప్రజల ఆకాంక్షల నుండే తెలంగాణ జనసమితి ఆవిర్భావం

The emergence of Telangana from the wishes of the people

విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి
ఏళ్ళ తరబడి వెల్దుర్తి ప్రజలు ఇసుకపై పోరాటం చేస్తున్నారు
మద్యం, డబ్బులకు ఓటు అమ్ముకోవద్దు
ప్రజలకు ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు

మన తెలంగాణ/వెల్దుర్తి : వెల్దుర్తి మండలానికి ఘనమైన చరిత్ర ఉందని, హల్దీ పరివాహక ప్రాంతం నుండి ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు పడిపోయి వ్యవసాయం కుంటుపడి ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని, ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందన్నారు. జనసమితి జెండాపండుగలో భాగంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ చౌరస్తా వరకు మహిళలు, యువకులు బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోదండరాం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికార పార్టీ నాయకులే డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాల పేరిట ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటికి పదివేల ఇళ్ళు కూడా నిర్మించలేదుకాని లక్షల టిప్పర్‌ల ఇసుకను ఆయా ప్రాంతాల నుండి దోచేశారన్నారు. ఇసుక విషయంలోనే కాకుండా భూముల విషయంలోనూ నిరుపేద ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇనాం, పోరంబోకు, అటవీ భూములను ఏళ్ళతరబడి సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలివ్వాల్సింది పోయి భూ ప్రక్షాళన పేరుతో గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు లబ్ధ్ది చేకూర్చాల్సింది పోయి నాయకులు చాయిస్ దొరికితే వాటిని తమపేర్లపై రాయించుకుంటున్నారన్నారు. పేద ప్రజలకు పట్టాలిప్పిస్తే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పులు తెచ్చుకొని కుటుంబాలను బాగు చేసుకుంటారనే సోయి మాత్రం నాయకుల్లో కనిపించడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల పోరాటం, విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు అన్నివర్గాల వారికి సముచిత న్యాయం జరగడం లేదన్నారు. అర్హులకు పింఛన్‌లు అందడంలేదు కాని అనర్హులైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రం రాయితీ ట్రాక్టర్‌లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పూరిగుడిసె, అద్దె ఇంట్లో నివసిస్తున్న నిరుపేదలకు కాకుండా డబుల్ బెడ్ రూంలు ఎవరికి ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత అధ్వాన్న పరిస్థితులు ఉన్నందునే ప్రజల కోసం తాము పార్టీని స్థాపించడం జరుగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇంఛార్జ్ రౌతు కనకయ్య, జిల్లా కోఆర్డినేటర్ దూడ యాదేశ్వర్, మండల నాయకులు చింతకుంట సత్యనారాయణగౌడ్, బాలాగౌడ్, నర్సింలుగౌడ్, దుర్గాగౌడ్, నరేందర్‌గౌడ్‌లతో పాటు పలువురు యువకులు, మహిళలు పాల్గొన్నారు.