Home కలం పాలగుమ్మి కథల్లో ఉద్వేగం

పాలగుమ్మి కథల్లో ఉద్వేగం

Palagummi-Padmaraju

పాలగుమ్మి పద్మరాజు కథల్లో సీరియస్‌నెస్ ఉంటుంది. ఆ కథల చుట్టూ గోదావరి ఉంటుంది. అది వరద గోదావరి కావచ్చు. ఇసుక తిప్పల గోదావరి కావచ్చు. పాలగుమ్మి పద్మరాజు కథల్లో గోదావరి కావచ్చు. ఇసుక తిప్పల గోదావరి కావచ్చు. పద్మరాజు కథల్లో గోదావరి ఒక పాత్ర.
‘గాలివాన’ కథల్లో కావలసినంత సీరియస్‌నెస్ ఉంది. రావు గారి గాంభీర్యం, ముష్టి ఆమె దీనత్వం, గాలివాన తీవ్రత అన్నిటినిండా సీరియస్‌నెస్. ఆఖరుకు ఫ్లాట్‌ఫారమ్, రైలులో కూడా సీరియస్‌నెస్. కథ ప్రారంభమే “మబ్బు మసగ్గా అలుక్కుపోయింది’ అని ప్రారంభమవుతుంది. మసగ్గా ఒకచోట, దట్టగా ఒకచోట సీరియస్‌నెస్ పరచుకొని ఉంటుంది కథ నిండా. ‘గాలివాన’ కథ పాలగుమ్మి పద్మరాజు గారికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టిన కథ. గోదావరి నేపథ్యంలో పాలగుమ్మి రాసిన కథల నిండా సీరియస్‌నెస్ ఉంటుంది.
‘పంతం’ కథలో గోదావరి వరదలు.. ‘పొగలాగా చుట్టలు చుట్టుకుంటూ ప్రవహించే ఆ చీకటి నీటిని చూస్తుంటే ఎవరికైనా భయం వేస్తుంది.’ అని మొదలయ్యే కథ నిండా కావలసినంత సీరియస్‌నెస్. నిండు గోదావరిలో కొట్టుకు వచ్చే కట్టె పుల్లలు పట్టే వాళ్ళ చుట్టూ కథ తిరుగుతుంది. “గోదావరి చాలా భీకరంగా ఉంది. నాలుగు పక్కలా ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. సన్నని చినుకుపడుతుంది. గాలి ఎక్కువగా ఉంది” ఈ వాతావరణం కథ నిండా ఉంటుంది. కథ నిండు గోదావరిలాగా గంభీరంగా ఉంటుంది.
“కుర్రతనమా! మానవ స్వభావమా!” కథ మనస్తత్వాలకు సంబంధించిన కథ! ఇద్దరు రైలు ప్రయాణీకుల మధ్య సాగిన కథ యిది. ఆ యిద్దరు ఆడా మగా. మంచి వయస్సులో ఉన్నారు. వారి అంతరంగాలను ఆవిష్కరించే కథ యిది. “ఆమె ప్రత్యక్షంలో అతడు తన స్వభావ సిద్ధమైన మనస్థైర్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడు” అది అతడి మనస్తత్వం. “ఆమె మళ్లీ సన్నగా తన చూపులను అతడి వైపు తిప్పి, అతడు తన వంకే చూస్తూ ఉండటం చేత వెంటనే ముఖం తిప్పుకొని, మొదటి వలె కిటికీ వంక చూస్తూ ఉంది. ఆమె చెక్కిళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి’ అది ఆమె మనస్తత్వం. ఇద్దరి మధ్య ఒక ఆకర్షణ. వికర్షణ. వారిరువురూ ఎవరికి వారు విడిపోయే వరకు ఈ సీరియస్‌నెస్ కనబడుతుంది. మనస్తత్వ చిత్రణలో పా.ప. గారు అందె వేసిన చేయి.
‘పడవ ప్రయాణం’ కథలోనే ఉంది ఆ కథకు నీటి ప్రవాహంతో సంబంధం ఉన్నట్లు. ఆ ప్రవాహం గోదావరి. ఈ కథలో గోదావరి జిల్లాల్లో రవాణా వ్యవస్థకు గోదావరి ఎలా ఆలంబనగా ఉందో తెలుస్తోంది. ఇద్దరు ఆడ, మగా దిగువ తరగతి మనుషుల చుట్టూ కథ తిరుగుతుంది. పా.ప. గారు దిగువ తరగతి మనుషుల భాష బాగా పట్టుకున్నారు. ఈ కథలో ఆ భాష బాగా కనిపిస్తుంది. “లంజ”ను ‘నెంజ’ అనటం, ‘లేచి’కి ‘నెగసి’ అనటం. విజయనగరానికి “ఇజీ నగరం” ఇత్యాది మాటలన్నీ దిగువ తరగతికి చెందిన గోదావరి జిల్లాల మనుషుల మాటలు. పద్దాలు, రంగిల మధ్య పరస్పర ఆకర్షణ. పద్దాలు మక్కెలిరగ తన్ని అతడినే కోరుకునే రంగి మనస్తత్వం చిత్రమైంది.
‘ఆడు నా వోడు. ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నా వోడు”. అన్నది రంగి మనస్సు. ఈ కథ నిండా పా.ప. గారు సీరియస్‌నెస్‌ను కొనసాగిస్తారు.
చిన్నతనంలోనే వితంతులైన శకుంతల కథ. ‘పాలపొంగు’ కథ అసందర్భమైన శ్రుతిలో సంగీతం ఈ కథ నిండా సీరియస్‌గా వినిపిస్తూ ఉంటుంది. శకుంతల గంభీరంగా గంభీరమైన గోదావరిలో కలిసిపోతుంది. “మగ పురుషుడు ఆడ స్త్రీ” కథలో మగ, ఆడ మనస్సుల ఆంతర్యాలను విప్పి చూపిన కథ. “నిజంగా ఆడవాళ్ళను గురించి తనకేమీ తెలియదని” కథానాయకుడు రామగోపాల్, ఆడవాళ్ళ మనస్తత్వాలు బాగా ఎరిగిన వాడన్న ఫీలింగ్ ఉన్నవాడు, అనుకోవడంతో కథ ముగుస్తుంది. ఆడవాళ్ళ అంతరంగాల గాథలని నొక్కి చెప్పే కథ యిది.
“ఇసుక తిన్నెలు” కథ నిండా సీరియస్‌నెస్ పరచుకొని ఉన్నది. ఈ కథ నిండా గోదావరి, రేవులు, ఇసుక తిన్నెలు, ప్రవాహం, రాజమండ్రి పేపర్ మిల్లు తారసపడతాయి. మన మనస్సును పాటిరేవు చుట్టూ తిరిగేలా కథ నడిపారు. మాలరేవు లాంటి సీరియస్ నెస్ కథ నిండా లభ్యమౌతుంది. మన మనస్సులు లోతులు, సుడిగుండాలు, ఇసుక తిన్నెల చుట్టూ తిరుగుతుంది. నొసలు చిట్లించి, నల్లకళ్ళద్దాలతో సీరియస్‌గా కథ చెబుతున్న పా.ప. గారు మనకు కథలన్నిటా కనిపిస్తారు. పాలగుమ్మి పద్మరాజు గారు సీరియస్ కథకులు. కథ నడిపే తీరులో, వర్ణనలలో ఆ సీరియస్‌నెస్ ఉంటుంది. తెలుగు సాహిత్యాన్ని తన కథలలో సుసంపన్నం చేసిన వారిలో పాలగుమ్మి పద్మరాజు గారొకరు.