Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆకలి మరణాలు

ph0

ఢిల్లీలో అపూర్వ విషాదం, రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు  ఆప్‌పై విరుచుపడ్డ కాంగ్రెస్, బిజెపిలు

న్యూఢిల్లీ: ఢిల్లీ మండవలి ప్రాంతంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆకలితో చనిపోయారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్టులో ఈ విషయం వెలుగు చూసింది. ఢిల్లీ ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై కాంగ్రెస్, బిజెపిలు ఆప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. 8,4,2 ఏళ్ల చిన్నారులను వారి తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని హాస్పిటల్ అధికారులు పోలీసులకు తెలిపారు. డాక్టర్ వారిని పరీక్షించారని, ప్రాథమిక పోస్ట్‌మార్టంలో వారు ఆకలి బాధతో లేదా పోషకాహార లోపంతో  చనిపోయారని డాక్టర్లు చెప్పారని  డిప్యూటి కమిషనన్ ఆఫ్ పోలీస్ పంకజ్ సింగ్ తెలిపారు. అయితే పిల్లల చావుకు అస లు కారణం ఏమి టో రెండోసారి పోస్ట్‌మార్టం రిపోర్టు తో బయటపడుతుందని ఆయన చెప్పారు. పిల్లల కడుపులో ఆహారం ఏమీ కనపడలేదని డాక్టర్లు ప్రకటించా రు. ఫోరెన్సిక్ టీం పిల్లల ఇంటిని తనిఖీ చేసినప్పుడు ఇంట్లో నీళ్ల విరేచనాలను అదుపు చేసే మందులు కనపడ్డాయని పోలీసులు తెలిపారు. అయితే చనిపోయిన మూడో అమ్మాయి స్వల్పకాలంలో  అనారోగ్యం పాలయ్యిందని, దీనిపై  దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. పోషకాహార లోపం వల్ల చనిపోయారనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నామన్నారు. రిక్షా కార్మికుడైన  పిల్లల తండ్రి నిన్నటి నుంచి కనపడలేదని, ఆయన కూలి కోసం వెళ్లి ఉంటాడని స్థానికులు చెప్పారు. పిల్లల శరీరాలపై ఎటువంటి గాయాలు లేవ ని డాక్టర్లు ప్రకటించారు. చాలా రోజుల నుంచి తిండి లేకపోవడం వల్ల పిల్లలు చనిపోయి ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. ఆకలి బాధతో ముగ్గురు పిల్లలు చనిపోయిన సంఘటనపై ప్రతిపక్షాలు రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్‌గా తీసుకుంటుందా అని బహుజన్ సమాజ్ పార్టీ ఎంపి చంద్ర మిశ్రా ప్రశ్నించారు. ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరమైనదని, అయితే ఎటువంటి పరిస్థితిలో పిల్లల మరణాలు సంభవించాయనేది పరిశీలించాల్సిన అవసరముందని, వారి మరణాలకు ఆకలి కారణమా అనేది తేల్చాల్సి ఉందని ప్లానింగ్ శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ తెలిపారు. మంత్రి సమాధానంపై బిఎస్‌పి నేత మిశ్రా అసంతృప్తిని వ్యక్తం చేశారు. పిల్లల మరణాలకు కారణం తిండి లేకపోవడమేనని మీడియాలో వార్తలు వచ్చాయని ఆయన తెలిపారు. మీడియాలో వచ్చినవన్నీ వాస్తవాలు కాదని, డాక్టర్ల రిపోర్టుల మీద ఆధారపడి నిర్ధారణ చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇది చాలా సీరియస్ విషయమని, దీనిపై సభ్యులు చర్చించాలని కాంగ్రెస్ ఎంపి ఆనంద్ శర్మ కోరారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇది నిరంతం జరిగే కార్యక్రమమని మంత్రి ఇందర్‌జిత్ సింగ్ సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం చాలా మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని, అయినా పేదరికం అనేది సాపేక్షికమని మంత్రి అన్నారు.

Comments

comments