Home మంచిర్యాల మోసం చేసేందుకే ‘రైతుబంధు’

మోసం చేసేందుకే ‘రైతుబంధు’

cangress-parti-image

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క

మనతెలంగాణ/మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకే రైతుబంధు కార్యక్రమాన్ని చేపడుతుందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క ఆరోపించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాలప్రేంసాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టాదారులకు ఎకరానికి రూ. 4వేలు ఇస్తూ పండగ చేసుకోండని గ్లోబెల్ ప్రచారం చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ఎకరానికి రైతు పది క్వింటాళ్ల పత్తి పండిస్తే తమ ప్రభుత్వ హయాంలో క్వింటాకు రూ.7వేలు ఇప్పిస్తూ ఎకరానికి రూ.70వేల అందించామని అదే ప్రస్తుతం కెసిఆర్ ప్రభుత్వం క్వింటాకు నాలుగు వేలు ఇస్తూ పది క్వింటాళ్ళకు రూ.40వేలు ఇస్తున్నారని, దీంతో  సంబంధిత రైతు రూ.30 వేలు నష్టపోతున్నారని వివరించారు. అదే విధంగా మిర్చి ఎకరానికి 30 క్వింటాళ్ళు దిగుబడి వస్తే తాము క్వింటాకు రూ.13,200 చొప్పున పది క్వింటాళ్ళకు మూడు లక్షలతొంబై ఆరువేల రూపాయలు చెల్లించామని గుర్తు చేశారు. అదే రైతుకు ఇప్పుడు కేవలం రూ.2,500 మాత్రమే క్వింటాకుటిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని ఇది ఎంత వరకు సమంజసమని అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడంతోనే అన్నదాతలు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, బాధిత కుటుంబాలను పరామార్శించడం చేతకాక  రైతుబందు అంటూ ప్రగల్బాలు పలుకడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.ప్రాణహిత ప్రాజెక్టును తరలించడంతో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం  జరుగుతుందని,  ప్రాజెక్టుల రీడిజైన్‌ల  పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కప్రాజెక్టు కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్మించలేదని, తమ ప్రభుత్వ హాయాంలోనే కడెం, ఎల్లంపల్లి, ప్రాణహిత, సాత్నాల, గూడెం లిప్ట్ ఇరిగేషన్,మత్తడి, గడ్డెన్నవాగు, కొమురంభీం ప్రాజెక్టు,ర్యాలీవాగు,పెద్దవాగు, నీల్వాయి,  గొల్లవాగు తదితర ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్‌దని అన్నారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,లకా్ష్మరెడ్డి, నాయకులు కమాలకర్‌రావు, పడాలమాధవి, హేమలత, పెంటరజిత, అబ్దుల్‌సత్తార్, సుంకిసత్యం తదితరులు పాల్గొన్నారు.