Home ఎడిటోరియల్ పల్లెకు దూరమవుతున్న మోడీ

పల్లెకు దూరమవుతున్న మోడీ

MODI

గత లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ రైతాంగం నరేంద్ర మోడీకి ఓట్ల వర్షం కురిపించింది. గడిచిన నాలుగేళ్ల కాలంలో మోడీ రైతుల ఓటు బ్యాంకు దివాళా తీసింది. కలలు కల్లలైన రైతాంగం నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, మండుతున్న పెట్రో ధరలతో రైతులు సతమతమవుతున్నారు. నమ్మి ఓట్లు వేస్తే నరేంద్ర మోడీ నడ్డి విరగ కొడుతున్నాడని రైతులు మండిపడుతున్నారు. నాలుగేళ్ల క్రితం మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ని ఊడ్చి పారేసింది. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో 73 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యావత్ రైతాంగం నరేంద్ర మోడీకి నీరాజనం పట్టారు. గంప గుత్తగా బిజెపికి ఓట్లు వేశారు. రైతులు పండించిన పంటలకు ఆశించిన దానికన్నా అత్యధిక ధరలు చెల్లిస్తామని ఆ ఎన్నికల్లో మోడీ చేసిన వాగ్దానం రైతుల ఓట్లు రాబట్టడానికి కారణమైంది. కాంగ్రెస్‌ని చిత్తుగా ఓడించడానికి సోపానమైంది. అయితే ప్రస్తుతం గ్రామీణ రైతాంగం జీవన ప్రమాణాలు కుంచించుకు పోవడంతో వారి నుంచి మోడీ ప్రభుత్వం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. 130 కోట్ల జనాభాలో 70 శాతంగా ఉన్న రైతాంగం మోడీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీని వల్ల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తిరిగి రైతాంగం ఓట్లను సంపాదించడం అంత సులువు కాదని వ్యవసాయ ఆర్థికవేత్తలు అంటున్నారు. కులం, మతం ప్రాతిపదికగా ఓట్లు రాలే దేశంలో ఎన్నికల ఫలితాలను ముందుగా ఊహించడం కష్టమే. అయినా ప్రాంతీయ పార్టీల బలాబలాలను ప్రక్కన పెడితే కోట్లాది మంది రైతుల మనోభావాలు మోడీకి అనుకూలంగా లేవని, 2014 నాటి విజయ పరంపర 2019లో కొనసాగే అవకాశం లేదని రైతులతో జరిపిన ఇంటర్వూలు స్పష్టం చేస్తున్నాయి. 2014లో మోడీ ప్రభంజనం కీలకంగా మారి ఓట్లను తెచ్చి పెట్టింది. కాని ప్రస్తుతం రైతులు మోడీ మాటలను నమ్మే పరిస్థితి లేదని, చెరకు పండించే 53 యేళ్ల ఉదయ్ వీర్ సింగ్ అనే రైతు అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ వాగ్దానం చేశారని, కాని మా ఆదాయం మునుపటి కన్నా సగానికి పడిపోయిందని ఆయన చెప్పారు. రైతుల పట్ల మోడీ అనుసరిస్తున్న వివక్ష, రైతు వ్యతిరేక విధానం వల్ల రైతాంగం నష్టాల పాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.పల్లెలో నులక మంచాల మీద కూర్చున్న కైరానా రైతులు, ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ,అతి చిన్న ప్రాంతీయ పార్టీ ఐన రాష్ట్రీయ లోకదళ్ నేతని గెలిపించిన వారిలో ఉన్నారు. వారంతా మోడీగాని, ఉత్తరప్రదేశ్‌లో పాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన వాగ్దాలను నెరవేర్చలేదని, రైతాంగాన్ని అసలు పట్టించుకోవడం లేదని చెప్పారు. నిజానికి మోడీ మంచి వ్యాపారవేత్త అని, కాని ఈసారి ఆయన శుష్క వాగ్దానాలకు తమని తాము అమ్ముకోమని, రెండున్నర ఎకరాల్లో చెరుకుని పండించే 55 యేళ్ల నరేంద్ర కహ్లాండె తెగేసి చెప్పారు. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం, సాగు నీటి సరఫరాలో తీసుకున్న చర్యలు, పంటల బీమా, వ్యవసాయ మార్కెట్లలో కల్పించిన ఆధునిక సదుపాయాల వల్ల రైతాంగం మంచి ధరలకు అమ్ముకునే అవకాశం కల్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ప్రభుత్వ తీరుని సమర్థించుకున్నారు. 48 నెలల మోడీ పాలన, 48 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకన్నా ఎంతో మెరుగ్గా ఉందని ఆయన కితాబిచ్చారు.
వ్యవసాయ దిగుబడులు రికార్డు స్థాయిలో పెరగడంతో 2018లో గడిచిన మూడు నెలల కాలంలో ఆర్థిక రంగం ప్రగతి బాటలో పయనించింది. అదే సమయంలో వ్యాపారవేత్తల అనుకూలమైన బిజెపి పాలనలో మార్కెట్లో ఆహార పంటల ధరలు గణనీయంగా తగ్గి పోవడం, తగ్గిన కూలీ రేట్లు, అంతంత మాత్రంగా దక్కిన పంట దిగుబడుల తక్కువ రేట్లు 263 మిలియన్ల మంది,అంటే 26.3 కోట్ల మంది రైతులను ఎంతగానో బాధించాయి. ఈ రైతులంతా కేవలం రెండు హెక్టార్లలోపు కమతాలు కలిగిన వారే కావడం విచారకరం. గడిచిన సంవత్సరంలో రైతుల్లో నరేంద్ర మోడీ కీర్తి 12 శాతం వరకు తగ్గి పోయిందని, దేశంలో నెలకొన్న ధోరణి ( మూడ్ ఆన్ ది నేషన్ ) అనే అంశంపై సర్వే నిర్వహించిన లోక్ నీతి అనే సంస్థ నివేదిక బయటపెట్టింది. లోక్‌నీతి అనేది సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ( సిఎస్‌డిఎస్ ) అనే పరిశోధన సంస్థలో ఒక భాగం. వచ్చే యేడాది కూడా రైతుల సమస్యలపైనే ఓట్లను అడిగే అవకాశముందని రాజకీయ నాయకుడిగా మారిన ఓ విద్యా వేత్త యోగేంద్ర యాదవ్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పడిపోయిన పంట దిగుబడుల ధరలకు నిరసనగా కొన్ని రైతు సంఘాలు గత తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మబోమని నిరసన చేపట్టాయి. పంట దిగుబడులను, పాలను రోడ్డు మీద పారవేసి నిరసన తెలిపాయి.
దేశంలో పండించిన పప్పు ధాన్యాల ధరలు 25 శాతానికి పడిపోయాయి. ఇవి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. అధిక దిగుబడుల వల్ల మార్కెట్లకు వచ్చే పప్పు ధాన్యాలు పెరిగి పోయాయి. ప్రతి యేటా ప్రభుత్వం కనీసం 20 పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుంది. అయితే నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం వరి, గోధుమలను మాత్రమే మద్దతు ధరకు కొంటాయి. కూరగాయల ధరల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. ఉల్లి, క్యాబేజి, టమోట ధరలు గత సంవత్సరం నుంచి 25 శాతానికి దిగజారాయి. త్వరగా పాడై పోయే గుణం కలిగిన ఈ పంట దిగుబడులను నిల్వ చేయడానికి చాలినన్ని శీతల గిడ్డంగులు, తరలించడానికి శీతల వాహనాలు లేకపోవడంతో వాటిని పెద్ద పట్టణ ప్రాంతాల మార్కెట్లకు తరలించి అమ్ముకునే అవకాశం లేకుండా పోతోంది. పాల ధరలు కూడా గత సంవత్సరం నుంచి 25 శాతానికి పైగా పడిపోయాయి. న్యూఢిల్లీకి మూడు గంటల్లో చేరుకోగలిగిన చర్కి దాద్రి గ్రామంలోని రైతులు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని, కిలోకు 25 పైసలు మాత్రమే చెల్లిస్తామని వ్యాపారస్తులు చెప్పడంతో పెద్ద ఎత్తున టమాటలను రోడ్డు మీద పారబోసి నిరసన తెలిపారు. నిజానికి కిలో టమోట పండించాలంటే సుమారు 6 రూపాయల పెట్టుబడి పెట్టాలని రైతులు చెప్పారు. ఝాజ్జర్ గ్రామానికి చెందిన జై భగవాన్ అనే రైతు అర ఎకరంలో ఉల్లిని పండించడానికి 12 వేల రూపాయల అప్పు చేశాడు. పంట దిగుబడి వచ్చిన తరువాత అమ్మబోతే మొత్తం పంటకు 1200 రూపాయలు మాత్రమే దక్కే పరిస్థితి ఎదురైంది. ఈ ధర తాను కూలీలకు చెల్లించిన కూలీ డబ్బులకు సమానం కాదని ఆయన వాపోయాడు. ఆయన ఢిల్ళీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. ఇక అదే గ్రామానికి చెందిన ప్రకాష్ సింగ్ పచ్చి మిరప పండించడానికి 6 వేల రూపాయల అప్పు చేశాడు. ఆ పంటని అమ్మబోతే 200 రూపాయలు మాత్రమే ఇస్తామని వ్యాపారస్తులు చెప్పారని, చేసిన అప్పు నా కళ్ల ముందు కనపడుతోందని, తాను సోమరిగా కూచోనని, మరింత అప్పు చేసి మరో పంటను వేస్తానని చెప్పాడు.
గత ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న అశోక్ గులాటి, రైతులకు మద్దతు ధర దక్కడానికి మూడు ప్రత్యామ్నాయ పాలసీలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో మార్కెట్లలోకి డిమాండ్‌ని మించి వచ్చే పంటలను నిల్వ చేయడానికి తగిన గోదాములను నిర్మించాలని, ఎగుమతులను వీలైనంత వరకు పెంచాలని లేదా నూనె గింజల నుంచి నూనెని తయారు చేసే అవకాశాలను మార్కెట్‌లోనే కల్పించడానికి తగిన నిర్మాణాలు చేపట్టాలని, ఇతర పంటల నుంచి తయారు చేయడానికి అవకాశమున్న ఉప ఉత్పత్తులను సాధించడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. అయితే ఇదంతా చేయడానికి దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పులు అవసరం. అయినా విశ్లేషకుల అంచనా ప్రకారం, తాత్కాలిక ప్రయోజనాలైన అధిక గిట్టుబాటు ధర, పంట రుణాల రద్దు వంటి హామీలతోనే రానున్న ఎన్నికల్లో గెలవాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. 2017లో అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుతో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నామని అత్యధిక శాతం రైతులు వాపోతున్నారు. అంతకు ముందు 2016లో పెద్ద నోటన్లు రద్దు చేయడంతో ఎన్నో కష్టాల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ప్రభుత్వం నుంచి రైతులు ఎంతో ఆశించారు. కాని నిజమేమిటంటే నాలుగేళ్ల క్రితం కంటే మరింత దారుణమైన పరిస్థితిలో పడిపోయామని రైతులు అనుకుంటున్నారని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి చెప్పారు. నల్ల ధనం వెలికి తీయడం కోసమే పెద్ద నోట్లని రద్దు చేశామని మోడీ చెప్పినా, చలామణిలో ఉన్న 85 శాతం కరెన్సీ, నోట్ల మీద ఆధారపడి బతికే రైతులు, నోట్ల రద్దుతో విత్తనాలు కొనలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అంతేకాకుండా పంటలు అమ్ముకునే అవకాశం లేక సతమతమయ్యారు. 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేయడం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారాయని కైరానాలోని 35 మంది రైతులు చెప్పారు.
పెరిగిన డీజిల్ పంపు సెట్ల ధరలు, విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలపై ఉత్తరప్రదేశ్‌లో 2.2 కోట్ల మంది రైతులు మండి పడుతున్నారు. ఈ రాష్ట్రంలో చాలా మంది రైతులు పొలాలు దున్నడానికి ట్రాక్టర్లని,పంటల రవాణాకు ట్రాలీలను ఉపయోగిస్తున్నారు. సాగు నీటిని అందించే పంపులను నడపడానికి విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. దేశంలో డీజిల్ ధరలు గత రెండు సంవత్సరాలలో 40 శాతానికి పైగా పెరిగి పోయాయి. విద్యుత్ చార్జీలు 20 శాతం పెరిగాయని శామిలిలోని శ్రీపాల్ అనే రైతు చెప్పాడు. అత్యధిక శాతం రైతులు డీజిల్‌పై ఆధారపడతారు. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో రైతులపై అధిక భారం పడింది.
ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, షామ్లిలు చెరకు పంటని అధికంగా పండించే ప్రాంతాలుగా పేరు సంపాదించాయి. బ్రెజిల్ తరువాత ఇండియాలోనే అత్యధికంగా చెరుకుని పండించే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన చెరుకు దిగుబడులు చక్కెర ధర పడిపోవడానికి దారి తీశాయి. ఇది చక్కెర కర్మాగారాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో రైతులకు చెల్లించాల్సిన 2,3౦౦ కోట్ల రూపాయలు బకాయి పడాల్సి వచ్చింది. ప్రభుత్వ తీరుపై రాం లఖన్ సింగ్ అనే రైతు పెదవి విరిచాడు. గత డిసెంబర్ వరకు ఏ ఒక్క చక్కెర ఫ్యాక్టరీ కూడా రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కయ్యిందని, ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా బిజెపికి మళ్లీ ఓటు వేయాలని కోరుకుంటారా అని ప్రశ్నించాడు.

* మయాంక్ భరద్వాజ్ (ది వైర్)