Home రాష్ట్ర వార్తలు డిజిపి పేరు చెప్పి భూటోపీ!

డిజిపి పేరు చెప్పి భూటోపీ!

ph

మేడ్చల్‌జిల్లా యాద్గార్‌పల్లిలోని తమ పట్టా భూముల కబ్జాపై రైతుల ఆందోళన
డిజిపి అనుచరులమంటూ బెదిరించి ఆరు ఎకరాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ

మన తెలంగాణ/ కీసర: డిజిపి అనుచరులమంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు దౌర్జన్యంగా తమ పట్టా భూములను కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా కీసర మండ లం యాద్గార్‌పల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే ఫిర్యాదు తీసుకోకుండా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బుధవారం జిల్లా ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధిత రైతులు కన్నీటి పర్యంతమై తమ గోడు వెల్లబోసుకున్నారు. బాధిత రైతులు కాటేపల్లి బాల్‌రెడ్డి, కె.నాగిరెడ్డి, చిత్తమయ్య, ఆగమయ్య, రామయ్య, లక్ష్మమ్మ, పారిజాత తదితరులు తెలిపిన వివరాల ప్రకారం. యాద్గార్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 210, 209, 213, 214, 243, 244లో 15.20 ఎకరాల పట్టా భూమి ఉందని అట్టి భూమిలో తమ తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. కాగా గత 19వ తేదీన సచివాలయ ఉద్యోగిగా చెప్పుకుంటున్న నల్లగొండకు చెందిన శ్రీనివాస్‌రెడ్డితో పాటు వెంకట్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, సుధీర్‌లు భారతమ్మ నుంచి తాము ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేశామంటూ తమ పట్టాభూమిని కబ్జాచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చటి పొలాలను మట్టితో చదును చేశారని అడ్డుకునే ప్రయత్నం చేసిన తమపై దౌర్జన్యానికి దిగారని వాపోయారు. తాము డిజిపి డీజీపీ అనుచరులమని ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకొండంటూ బెరింపులకు పాల్పడుతున్నారని, మహిళలని కూడా చూడాకుండా దుర్భషలాడుతున్నారని అన్నారు. తమపై అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులు గత కొన్ని రోజులుగా నరకం చూపుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తమ పట్టా భూములు ఉన్న సర్వే నంబర్లలో భారతమ్మ అనే మహిళకు ఎలాంటి భూములు లేవని, తప్పుడు సర్వే నంబర్లతో తమ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తాము కబ్జాదారులతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ యంవి రెడ్డిని కలిసిన రైతులు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై కీసర సీఐ సురేందర్ గౌడ్ వివరణ కోరగా పోలీసులపై ఆరోపణలను ఖండించారు. భారతమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు కాటేపల్లి బాల్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. భూముల కబ్జా విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.