Home దునియా విశ్వనగరానికి తొలి రాయబారులు

విశ్వనగరానికి తొలి రాయబారులు

The first ambassadors to Hyderabad

విశ్వనగరిగా సింగారించుకుంటున్న చారిత్రాత్మక భాగ్యనగరానికి ప్రపంచదేశాల ప్రతినిధులు రావడమే కాదు ఖండాంతరాలు దాటి అరుదైన పక్షులు వస్తున్నాయి. జీవవైవిద్య వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్న అమీన్‌పూర్ తటాకాన్ని తెలంగాణ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుతుంది. అయితే చెరువు చరిత్రలోకి తొంగిచూస్తే ఆనాటి రాజుల దూరదృష్టి, పర్యావరణం, గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు అందించేందుకు తవ్విన చెరువులు అగుపిస్తాయి. తెలంగాణలో వేలాది గ్రామాలను నిర్మించి గ్రామానికి ఒక చెరువు తవ్వించి దేశానికే ఆదర్శమైన కాకతీయరాజుల సంస్కరణల ఆడుగుజాడల్లోనే గోల్కొం-డరాజులు దృష్టి కేంద్రీకరించి చెరువులు తవ్వించారు. గోల్కొండరాజ్యాన్ని తీర్చిదిద్దిన ఇబ్రహీం కుతుబ్ షాహి నిర్మించిన చెరువుల్లో అమీన్ పూర్ చెరువు ఒకటి. క్రీస్తుశకం 1550 నుంచి 1580 వరకు గోల్కండ రాజ్యాన్ని పాలించిన ఇబ్రహీం కులీకుతుబ్ షాహి తొలుత స్థానిక పాలకుడిగా అనుభవాన్ని పెంపొందించుకుని ప్రజల అవసరానికి చెరువుల నిర్మాణాలు చేపట్టారు. ఆయన నిర్మించిన 11 చెరువుల్లో అమీన్‌పూర్ చెరువు ఒకటి, నాటి దండకారణ్య ప్రాంతంలో ఈ చెరువు నిర్మించి అడవులను నరికించి గ్రామాలను ఏర్పాటు చేశారు.

ఇక్కడ పండ్ల తోటలు ఉండేవని విదేశీ యాత్రికుల రచనల్లో తెలుస్తుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలను ప్రపంచంలోని పక్షులు గమనించి ఆనాటినుంచే వలసలు ప్రారంభించి ఉంటాయని చరిత్రకారుల అభిప్రాయం. నాలుగు శతాబ్దాల క్రితమే గోల్కొండ రాజు నిర్మించిన ఈ చెరువు కుతుబ్ షాహీల అనంతరం నిజాం రాజులు అభివృద్ధి చేశారు. మహారాజుల విడిది కేంద్రంగా, విహార ప్రాంతంగా ఉన్న ఈ చెరువుకు దేశ స్వాతంత్య్రానంతరం కష్టాలు ప్రారంభమయ్యాయి. సమైక్య పాలకులు పట్టణీకరణ పేరుతో చెరువు శిఖం భూముల్లో కాంక్రీట్ గునపాలు దించగా అభివృద్ధి పేరుతో కాలుష్యం నింపారు. ఈ నేపథ్యంలో వలసపక్షులు తగ్గిపోయాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మిషన్ కాకతీయలో చెరువును చేర్చి భారినీటిపారుదల శాఖ ప్రత్యేకదృష్టి సారించడంతో అమీన్ పూర్ చెరువు పూర్వవైభవం పునర్ ప్రతిష్టిస్తుంది. అతిగొప్ప పర్యాటకప్రాంతంగా అభివృద్ధి చెందడంతో పాటు జీవవైవిద్యప్రాంతంగా ప్రపంచం గుర్తించడం తో మళ్లీ ఖండాంతరాలుదాటి వలసపక్షులు తెలంగాణకు దారిపడుతున్నాయి. చలి,వర్ష,ఎండకాలాల్లో వేరువేరుజాతుల పక్షులు ఇక్కడికిరావడంతో పాటు సంతానాన్ని ఉత్పత్తి చేయడంతో ప్రపంచంలోని విభిన్నజాతుల పక్షులకు చెరువు వేదికైంది. సముద్రాలు దాటి వలసవస్తున్న పక్షులు అనేకం ఉన్నాయి. చెరువుచుట్టూ 250 జాతుల చెట్లు ఉండగా 171 రకాల వలస

పక్షులు వస్తుంటాయి.అలాగే చెరువులో 9 రకాల చేపలు,41 రకాల సీతాకోక చిలుకలు, 23 రకాల జంతువులు, 21 రకాల కీటకాలు ఉన్న అమీన్ పూర్ చెరువు జీవవైవిద్య వారసత్వసంపదగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రకటించి కోట్లాది రూపాయల ఖర్చుతో అభివృద్ధిపనులు చేపట్టింది. అనేక దేశాల వలసపక్షులతో పాటు గుజరాత్‌కు చెందిన రాజహంసలు చెరువు అందాలను ద్విగుణీకృతం చేస్తున్నాయి. అందుకే ప్రపంచదేశాల నుంచి వస్తున్న వలసపక్షులు హైదరాబాద్ విశ్వనగరానికి తొలి రాయబారులని అనడం అతిశయోక్తి కాదేమో….

-వి. భూమేశ్వర్