Search
Wednesday 21 November 2018
  • :
  • :

రూ.5కే భోజనం

The first phase begins in 4 towns

జిల్లాకు కూడా విస్తరణ                                                                                                                                              తొలి  విడతలో 4 పట్టణాల్లో ప్రారంభం

మన తెలంగాణ/సంగారెడ్డి : ఐదు రూపాయలకే భోజనం ! ఎంతోమంది ఆకలి తీరుస్తున్న ఈ పథకం ఇప్పుడు జిల్లాలోకి అడుగిడబోతోంది. తొలివిడతలో మూడు పట్టణాల్లో ఈ ఆకలితీర్చే పథకం ప్రారంభం కాబోతోంది. అనేక మంది ఆకలిని తీరుస్తున్న సంగతి తెలిసిందే. జంటనగరాల్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు అనేక మంది రూ.5 చెల్లించి  ప్రభుత్వం కల్పిస్తున్న భోజన సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మొదట్లో సాధారణంగా ప్రారంభమైన ఈ పథకం జంటనగరాల్లో అనేక ప్రాంతాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని కొంతమంది అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే పథకం జిల్లాలో కూడా అమలు చేయడానికి సంకల్పించారు. దీనికి గాను యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయబోతోంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు సదాశివపేట, ఆందోల్, జహీరాబాద్‌లలో తొలివిడతలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. తద్వారా ఇక్కడి అల్పాదాయ వర్గాలకు కూడా భోజనం తక్కువ ధరకే అందించబోతున్నారు. మంగళవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు జరిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పట్టణాల విస్తరణ బాగా పెరిగింది. అనేక కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు పట్టణాలకు సమీప గ్రామాల నుంచి అనేక మంది వలస వచ్చారు. ఇంకా వస్తున్నారు. ఈ పట్టణాల సమీపంలో అనేక పరిశ్రమలు ఉండటంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీనికి తోడు కొత్తకాలనీల్లో ఇండ్ల నిర్మాణం పుంజుకుంది. వీటిలో పాలుపంచుకునే భవననిర్మాణ కార్మికులు కూడా పెరిగారు. ఇక నిత్యం అనేక పనుల కోసం రైతులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీనివల్ల వీరందరికీ కూడా ఈ రూ.5ల భోజన పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ పథకం జిల్లాకు కూడా వస్తే మరింత మానవీయత వెల్లివిరుస్తుంది. తక్షణమే దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే సదాశివపేటలో మినీ ట్యాంక్‌బండ్‌ను వచ్చే నెలలో పూర్తిచేయబోతున్నారు. అదే సమయంలో ఆందోల్, నారాయణ్‌ఖేడ్‌లలో కూడా మినీ ట్యాంక్‌బండ్ పనులు వేగవంతం చేయాలని సంకల్పించారు. ఇక సంగారెడ్డిలో పార్కు మరమ్మతు వెంటనే జరపాలని నిర్ణయించారు. ఈ పార్కు అధ్వాన్నంగా తయారైంది. పట్టణం మొత్తానికి ఉన్న ఏకైక పార్కు. పట్టణ వాసులకు ఏమాత్రం ఉల్లాసాన్ని కలిగించలేకపోతోంది. దీంతో వెంటనే మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. స్మశాన వాటిక పనులు కూడా నత్తనడకన జరుగుతున్నాయని, వీటిని గుత్తేదారు మార్చడం ద్వారా తక్షణమే పూర్తిచేయించాలని నిర్ణయించారు. ఇక సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో రోడ్లు క్లీనింగ్ చేసే మిషన్లను కూడా తెప్పించబోతున్నారు. త్వరలో ఈ యంత్రాలు ఈ రెండు పట్టణాలకు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ రెండు పట్టణాల్లో పరిశుభ్రతను పెంపొందించాలని ఇటీవల జరిపిన నగర సుందరీకరణ మరింత పెరిగేలా చూడబోతున్నారు.

Comments

comments