Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పూర్తి కానున్న తుమ్మిళ్ల మొదటి దశ

The first stage of the finished Tummilla

పూర్తైన పది కిలోమీటర్ల డబుల్ పైపు లైను
తుమ్మిళ్ల నుంచి డి 25 వరకు భూగర్భపైపులైన్లు
57,500 ఎకరాలకు సాగునీరు
ఆర్‌డిఎస్ చివరి ఆయకట్టు అన్నదాతలో ఆనందం

మన తెలంగాణ /మహబూబ్‌నగర్ : ఆశలు వదులుకున్న ఆర్‌డిఎస్ చివరి ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరయనుంది. నాలుగు దశాబ్దాలుగా సాగని సాగుతో చివరి ఆయకట్టు రైతులు సాగుకు దూరమయ్యారు. వర్షాధార పంటలపై ఆధార పడ్డ కర్షకుడు కష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నాలుగు దశాబ్ద కాంగ్రెస్ పాలనలో చివరి ఆయకట్టు రైతుల కన్నీళ్లు తుడవలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం చివరి ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు చేపట్టిన  తుమ్మిళ్ల ఎత్తిపోతల పధకం రైతు కళ్లల్లో ఆశలు నింపింది, చిగురింపచేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పధకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పధకంతో చివరి ఆయకట్టు రైతులను ఆదుకోవాలనే పట్టుదలతో పనులు చేపట్టింది. తుమ్మిళ్ల పధకాన్ని రెండు దశలలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. రూ 786 కోట్లతో  57.500 ఎకరాల సాగు లక్షంగా పనులు ప్రారంభించారు. ఆర్‌డిఎస్ డి 25 నుంచి చివరి ఆయకట్టు డి 40 వరకు తుమ్మిళ్ల ద్వారా సాగునీటిని అందించాలని ప్రభుత్వ యోచన. అందులో భాగంగా తుమ్మిళ్ల పథకం మొదటి దశ పనులకు రూ 121.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

తుమ్మిళ్లకు తెర తీసిన వైనం
కర్ణాటక తుంగభద్ర తీరంలోని రాజోళిబండ వద్ద రాజోళి డైవర్షన్ స్కీం (ఆర్‌డిఎస్)ను ఏర్పాటు చేశారు. ఆర్‌డిఎస్‌కు 17.1 టిఎంసిల నీటి కేటాయింపుతో 142.8 కిమీ పొడవుతో నిర్మించారు. 40 కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రంలో ఉండగా తెలంగాణలో 102.8 కిమీ ఉంది. కర్ణాటకకు 1.2 టిఎంసిలు, తెలంగాణలోని అలంపూర్ తాలూకాకు 15.9 టిఎంసిల నీటి ఒప్పందంతో ప్రాజెక్టును నిర్మించారు. అలంపూర్ తాలూకాలో 87.500 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. రాజోళిబండ 0 నుంచి డి 40 వరకు సాగునీరందిస్తారు. కర్ణాటకలో డి 12 ఉండగా 12 ఏ నుంచి అలంపూర్ తాలూకాలో ఉన్నాయి. ఆర్‌డిఎస్ ఎగువను తుంగభద్ర నదిపై కర్ణాటక మూడు ఎత్తిపోతల పధకాలను ఏర్పాటు చేసింది. దీంతో ఆర్‌డిఎస్ నిర్ణీత టిఎంసిల నీటి వాటా కష్టంగా మారింది. దీనికితోడు ఎగువ కర్ణాటక రైతుల నీటి చౌర్యంతో అలంపూర్ తాలూకాలో 25 వేల ఎకరాల ఆయకట్టు భారమైంది. 15.9 టిఎంసిల నీటివాటాలో కనీసం 5 టిఎంసిలు సాగునీరు సాగలేదు. దీంతో ఆర్‌డిఎస్ చివరి ఆయకట్టు కష్టంగా మారింది. గత నాలుగు దశాబ్దాలుగా చివరి ఆయకట్టు సాగక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కున్నారు. నాలుగు దశాబ్దాల కాలంలో పరిపాలించిన పాలకులు చివరి ఆయకట్టును పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి మద్యంతర పరిష్కారానికి మొగ్గు చూపింది. దీంతో తుమ్మిళ్ల ప్రాజెక్టు మొగ్గ తొడిగింది.

తుమ్మిళ్ల మొదటి దశ పనులు
తుమ్మిళ్ల ఎత్తి పోతల పథకంలో మొదటి దశ పనులు ఖరీఫ్ సాగుకు కీలకంగా ఉంది. సుంకేసుల వెనుకనీటిపై తుమ్మిళ్ల పధకాన్ని ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదీ తీరంలోని రాజోళి మండలం, తుమ్మిళ్ల గ్రామంలో తుమ్మిళ్ల పధకానికి మార్చి 8న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పనులు చేపట్టారు. తుమ్మిళ్ల పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నారు. పంప్‌హౌస్ వద్ద ఫోర్‌బే ద్వారా తుంగభద్ర నుంచి ఎత్తి పోస్తారు. తుమ్మిళ్ల నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని తనగల గ్రామం వద్ద ఉన్న డి 25కి భూగర్భం ద్వారా ప్రెజర్ మెయిన్ డబుల్‌పైపులైను పనులు చేపట్టారు. పనులు వేగవంతంగా జరుగుతుండటంతో 10.5 కిలో మీటర్ల భూగర్భ డబుల్ పైపు లైను పనులు పూర్తయ్యాయి. ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాలనే లక్షంతో అధికారులు, గుత్తేదారులు అహర్నిషలు కష్టపడుతున్నారు. డి 25 వద్ద కాలువలోకి నీటి విడుదల చేసేందుకు డెలివరి సిస్టం పనులు పూర్తయ్యాయి. తుమ్మిళ్ల నుంచి మాన్‌దొడ్డి కాలువ వద్ద భూగర్భ పైపులైను వెళ్లేందుకు కాలువపై డబుల్‌లైన్ రోడ్ బ్రిడ్జి (డిఎల్‌ఆర్‌బి) పనులు పూర్తయ్యాయి. మొదటి దశ పనులు పూర్తయితే ఖరీఫ్‌లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయి. మొదటి దశలో 57.500 ఎకరాలకు సాగునీరందించే దిశగా పనులు సాగుతున్నాయి.

తుమ్మిళ్ల రెండవ దశ పనులు …
రబీలో సైతం సాగునీరందించే లక్షంతో రెండవ దశ పనులకు శ్రీకారం చుట్టారు. రెండవ దశలో దాదాపు 100 ఎకరాలు రైతులు కోల్పొవలసి వచ్చింది. ప్రభుత్వం రెండ దశ పూర్తి చేసేందుకు రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు రూ లక్ష చొప్పున అందించింది. రెండవ దశ పనులు రూ 665 కోట్ల నిధులను కేటాయించింది. ఈ దశలో రిజర్వాయర్లను నీటితో నింపి రబీలో సాగునీరు అందించాలనే ప్రణాళికలతో రూపొందించారు. జులేకల్, వల్లూరు, మల్లమ్మకుంటలో రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నారు. సుంకేసులలో వృధాగా పోయే వరదనీటితో రిజర్వాయర్లను నింపుతారు. తద్వారా చివరి ఆయకట్టుకు రబీకి సాగునీరు అందిస్తారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పధకంతో రాజొళి మండలం, వడ్డెపల్లి,మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాలతో పాటు ఇటిక్యాలలో కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఖరీఫ్,రబీకి సాగునీరు అందిస్తే చివరి ఆయకట్టు కనికట్టుగా మారి బంగారు పంటలు పండిస్తుందనటంలో సందేహం లేదు.

Comments

comments