Home కలం బాలల సాహితీ నేస్తం నరసయ్య

బాలల సాహితీ నేస్తం నరసయ్య

Narsaiah-Poet

నేడు పసిమొగ్గలుగా ఉన్న పిల్లలే రేపటి పరిమళ భరిత పౌరులుగా మారి, దేశానికి బంగారు భవితను సమకూర్చిపెడతారు. మహోన్నతమైన మేధావులుగా బిడ్డల్ని తీర్చి దిద్దడంలోనే పెద్దలు విధివిధానాలు ఆధారపడి వుంటాయి. “మొక్కై వంగది మానై వంగునా” అనే నానుడి పిల్లల పెంపకాన్ని ఉద్దేశించి వాడుతుంటాము. కనుక దేశాభివృద్ధిని కాంక్షించే బాధ్యతాయుతమైన పౌరుల్ని తయారు చేసుకోవాలంటే విద్యావిధా నాలు అభివృద్ధి కాముకంగా ఉండాలి. మొదట బాల్యాన్ని బడిలో విత్తడానికి ప్రభుత్వ సంకల్పిం చే వసతులతోపాటు బిడ్డల తల్లిదండ్రుల సహకా రం మెండుగా ఉండాలి. పాఠశాలలోపల వెలు పల బాలలను ఆకర్షించే ఆసక్తిని కలిగించే సాహిత్యం అందుబాటులో ఉండాలి. పసివారి మనస్సుల్లో నాటుకునే సాహిత్యాన్ని సృష్టి చేయ డం అంతతేలికైన పనికాదు. ఇటువంటి సాహి త్యాన్ని ఉపాధ్యాయులు మాత్రమే రాస్తారను కోవడం పొరపాటు. ఉపాధ్యాయేతర వృత్తిలో వున్న సాహిత్య సృజనకారులు బాలసాహిత్యాన్ని బహుళంగానే రాస్తున్నారు. ఇట్లా బాల సాహి త్యాన్ని ప్రవృత్తిగా చేసుకొని రాస్తున్న సాహితి వేత్తల్లో వాసాల నరసయ్య గార్ని ప్రముఖంగా పేర్కొనవచ్చును.బాలలను సమర్థవంతమైన మేధో సంపత్తి గల ఉత్తమ దేశ పౌరులుగా తీర్చిదిద్దడా నికి, సాహిత్యం ఒక ఉపకరణంగా ఉపయోగపడు తుందని నమ్మి బాలసాహిత్యాన్ని ఒక బాధ్యతగా తీసుకొని రాస్తున్న గొప్ప సాహితివేత్త వాసాల నరసయ్య, వీరు రాసే బాల సాహిత్యం మీద ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందిం చుకొని, తన రచనాశక్తిని ఆసక్తిని బాల సాహిత్యం వైపుకు మళ్లించారు. వీరు బాలల కథలు, కవితలు రాయడమే కాకుండా, బాల సాహిత్యం రాసే కవులు, రచయితల చేత కవిత్వము, కథలు రాయించి సంకలనాలుగా తీసుకవచ్చారు. వాటిని బాలలకు అందే విధంగా ప్రచారంలో పెట్టారు. వీరు “పోస్టల్ డిపార్ట్‌మెంట్‌”లో ఉద్యో గించినా, ప్రవృత్తి రీత్యా సాహిత్యాన్ని ఎన్నుకొని ఉద్యోగ విరమణ అనంతరం కూడా పిల్లల నీతి కథలు కవితలు సంపుటాలుగా వెలువరిస్తున్నారు.
వీరి కవితలు అలతి అలతి పదాలతో బాలల హృదయాల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అట్లే వీరి కథలు ఎంతో క్లుప్తంగా నీతి ప్రబోధకంగా ఆసక్తిని పెంచే విధంగా ఉంటాయి. వాసాల వారి బాల గేయాలు చిట్టి పొట్టి మాట లతో మృదుమధురమైన భావాలతో అలరారు తుంటాయి.
“ఊయలతో హాయిగా/ ఊగేటి పాపాయి
తీయగా కలగంటూ /మూయరా కనుదో యి” అంటూ ఊహల ఊయలలో తెలిపోయే ఒక లాలిత్యాన్ని గేయంలో కనపరుస్తారు. “ చిన్నారి పొన్నారి / చిట్టి వాడివి నీవు/ చింతలను మరిపించి / చిత్తమును దోచోవు / నిండుగా నూరేళ్లు / ఉండాలిరానీవు/ నీతినీ జాతినీ / నిలపాలిరా నీవు” అంటారు. బాలలకు తల్లిదండ్రులను ప్రేమించాలని, దేశాన్ని ప్రేమిం చాలనే, ప్రబోధనాత్మకమైన గేయం “చిట్టిపొట్టి” “ చిట్టి పొట్టితమ్ముళ్ళారా/ చిన్నారి చెల్లెళ్లారా/ యింటింటి నవ్వులారా/ యిరుల తరిమేదివ్వెల్లిరా / ఆటాపాటా నేర్చుకోండి / చదువు సంధ్యా నేర్చుకొండి/ అమ్మా నాన్నలు మీపై నుంచిన / ఆశలన్నీ తీర్చగలెండి / మా యామర్మం వీడా లండి / మాతృ భూమినే ప్రేమించండి/ ద్వేషం మోసం వదలాలండి/ దేశ ప్రతిష్ఠను పెంచాలండి ” అంటారు.
పనిమీద ధ్యాసను, ప్రేమను పెంచే విధంగా ప్రబోధించే గేయం “పని చేయ్యరన్నా/ పని చెయ్యిచిన్నా/ పని చేయకుంటె నువ్/ పైకి రావన్నా /… కండ కరిగేదాకా/ కష్టించి పని చెయ్యి / తిండి కేమి కొదవ? / దండిగా దొరికేను/… గడిచి పోయిన గడియ / నడిచి మరలా రాదు /” అంటూ కాలం విలువను కష్టించి పని చేసే తత్తాన్ని చెప్తాడుకవి.
వాసాల నరసయ్య గారి “స్ఫూర్తి కథలు ” పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో స్ఫూర్తి నిచ్చే విధంగా రాయబడినవి. మూఢ విశ్వాసాలకు, అజ్ఞానంతో కూడిన సందేహాలకు, నివృత్తి కల్పించే సమాధానాలతో ఈ కథలు రాయబడినాయి. అహర్నిశలు పసిబిడ్డల్ని ప్రేమ వాత్సల్యాలతో పసిడి మనస్కులుగా మార్చాలంటే త్యాగ నిరతిని , నీతిని , కష్టంచి పని చేసే విధానాల్ని గూర్చి చెప్పే సాహిత్యం అవసరమని నమ్మిన నరసయ్య తన కాలాన్ని బాలసాహిత్యం వెలువరించడానికే వినియోగించారు. నరసయ్య 1942 జనవరి 26వ తేదిన కరీంనగర్ జిల్లా ‘చౌలమద్ది’ గ్రామంలో వాసాల వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరు తొలుత స్కూల్ మాస్టర్‌గా పనిచేసిన తరువాత కాలంలో పోస్ట్‌మాన్‌గా ఉద్యో గించి అందులోనే పదవీవిరమణ చేశారు. వీరు దాదాపు 20 పుస్తకాలకుపై చిలుకు రాశారు. ఎన్నో వ్యాసాలు , సమీక్షలు రాశారు.
వీరు రాసిన బాల సాహిత్యానికి అరడజను పైగా పురస్కారాలు లభించాయి. వీటన్నింటిలోను ముఖ్యమైంది 2017 సంవత్సరమునకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ వీరిని బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. వీరి బాలసాహిత్య కృషికి తగిన గుర్తింపు వీరిని వెతుక్కుంటూ వచ్చిందనే చెప్పాలి.వీరు శాంత స్వభావులు. బాల సాహిత్యమే శ్వాసగా ధ్యాసగా జీవిస్తున్న వారు. జీవితంలో వచ్చే వడిదుడుకులను అధిగమిస్తూ వసంత కాలపు పరిమళభరిత గాలుల్లాంటి చల్లని తాజా ఊహలతో పసివాడైపోతూ బాల సాహిత్యపు సృష్టిలో మునిగితేలుతుంటారు. ఏనాడూ వీరు అవార్డులు రివార్డుల వెంట పరుగులెత్తలేదు. వీరిని వెతుక్కుంటూ అవార్డులు ఎన్నో వీరి పంచన చేరాయి. వీరు వృద్దాప్యంలోనే విడువని బాల్య స్మృతులతో, వీరిఆలోచనలు అనుభూతులై ఊహాతీత బాలలప్రపంచాన్ని కలగంటూ, ఆలోచనలకు అక్షరాకృతులిస్తుంటారు. వీరి సాహి త్యంలో స్వేచ్ఛాయుతంగా పక్షులుపాడే పాట లూ, పూలు పంపే రంగురంగుల సందేశాలు, రాత్రులు మబ్బుల్లో దోబూచులాడే చంద మామ, చిలిపినవ్వుల చుక్కల వెలుగులు, పచ్చ పచ్చని వనాల్లో వసంతకాలపు కోయిలపాటలు ద్యోతకమౌతుంటాయి.. భావి తరాలకు బాటలు వేసే బాలల ప్రపంచాన్ని కవితలుగా కథలుగా ఆరవోసారు వాసాల నరసయ్య.
“మంచి పుస్తక మొక్క/ మంచి నేస్తము పాటి/ మన నూరడించు టలో/ తనకు తానే సాటి /…. మన సంస్కృతి మన భాష /మన సంప్రదాయమ్ము/ మరే దేశ చరిత్రలో / మన లేదు! కనలము” అనే బాలలలో నూరిపోసే వాసాల నరసయ్యకు కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం (2017)కు ఎంపిక చేయడం తెలుగువారందరికి గర్వకారణం. వాసాల నరస య్యను అభినందిద్దాం.