*ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
*పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి
*9లోగా బూత్‌లెవల్, అనుబంధ సంఘాల కమిటీల ఎన్నిక
*డిసిసి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
మన తెలంగాణ/వరంగల్‌బ్యూరో : దేశ ప్రధానిగా 2019లో యువనేత రాహుల్‌గాంధీని చేయడమే లక్షంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని డిసిసి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని ఎన్ఆర్ఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వరంగల్ నగరంలోని ప్రతి డివిజన్లో ఇంటిఇంటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్కహామీని ప్రభుత్వాలు అమలు చేయకుండా మాటల గారడితో పబ్బం గడుపుతున్నారని ఆయన విమర్శంచారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బూత్ లెవల్ కమిటీలను, బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ, మహిళ, యువజన, విద్యార్థి సంఘాలకు సంబంధించిన కమిటీలను కూడా ఎన్నుకోవాలని ఆయన సూచించారు. ఈ కమిటీల టిపిసిసి అధ్యక్షుడు సూచించినట్లుగా డిసెంబర్ 9లో ఎంపిక పూర్తి చేయాలని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ వరంగల్ నగర కమిటీలో ప్రతి డివిజన్ నుంచి ఒక నేత ఉండే విధంగా చూడాలన్నారు. అలాగే ప్రతి డివిజన్లో సోషల్ మీడియాకు సంబంధించి ఒకరిని ఎన్నుకోవాలని, ఇందు కోసం డివిజన్లో పేరు, సెల్ నెంబర్‌ను కమిటీకి అందజేయాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన కోరారు. గ్రేటర్ వరంగల్ వర్కింగ్ అధ్యక్షుడు రాజనాల శ్రీహరి మాట్లాడుతూ ప్రతి డివిజన్ నుంచి ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒకరి బూత్లెవల్లో ఎన్నుకోవాలన్నారు. డివిజన్లో బూత్ కమిటీలో పది మంది సభ్యులు ఉండే విధంగా ఎంపిక చేయాలన్నారు. ఒక్కొక్కరు వంద మంది ఓటర్లను రెగ్యూలర్‌గా కలిసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గతంలో ఉన్న పాత ఓటర్ల లిస్టును, కొత్త ఓటర్ల లిస్టులను పరిశీలించి టిఆర్ఎస్ నాయకులు తొలగించిన ఓటర్లను తిరిగి చేరిపించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లకా్ష్మరెడ్డి, కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.