Home హైదరాబాద్ అమ్మా బైలెల్లినాదో

అమ్మా బైలెల్లినాదో

The Golconda Fort is a festival of Jagadamba Amman

నేటి నుంచి నగరంలో బోనాల సందడి
ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: నేటి నుంచి బోనాల సందడి మొదలు కానుంది. డప్పు చప్పుళ్లతో, మంగళవాయిద్యాలతో అమ్మా.. బైలెల్లినాదో అనే ఆటపాటలతో, శివశక్తుల చిందులతో, పోతురాజుల వీరంగంతో నగరం పులకించే క్షణం రానే వచ్చేసింది. ఆషాఢమాసం తొలి ఆదివారంలో బోనాల పండుగను జరుపుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజు గోల్కొండ కోట జగదాంబ అమ్మవారి ఉత్సవాలతో బోనాల పండుగ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. గురు, ఆదివారాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు 50 వేల వరకు భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. ఇదే రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఈ నెల 29, 30న బోనాలు, రంగం కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు.

ప్రభుత్వ లాంఛనాలతో…
ఈ రోజు ఉదయం బోనాల పండుగ ప్రారంభం అవుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్టెల ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి మరి కొంత మంది మంత్రులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి సాక సమర్పిస్తారు. దీంతో అట్టహాసంగా వేడుకలు ప్రారంభమవుతాయి. భారీ ఊరేగింపుగా తొట్టెల ప్రదర్శన చోటా బజార్‌కు చేరుకున్న తరువాత అనంతచారి ఇంటి నుంచి తొట్టెలు, అమ్మవార్ల విగ్రహాలు, రథాన్ని తీసుకొని ప్రదర్శనగా వెళతారు. నిజాం కాలం నుంచి బోనం సమర్పిస్తున్న పటేలమ్మ బోనం ఈ ప్రదర్శన మార్గమధ్యంలో కలసి జగదాంబిక ఆలయానికి చేరుకుంటారు. జగదాంబిక, మహంకాళి అమ్మవార్లను ఆలయంలో ప్రతిష్టించడంతో ఆరోజు వేడుక ముగుస్తుంది. 22వ తేదీ ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. దాదాపు 2లక్షలకు పైగా భక్తులు ఆ ఒక్క రోజే హాజరవుతారని అంచనా.

ప్రత్యేక ఏర్పాట్లు…
బోనాలు పండుగకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టారు. గోల్కొండ కోట మొత్తం పోలీసు పహరాలో ఉంది. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం దాదాపు 5 లక్షల వాటర్ ప్యాకెట్స్, మహిళలు, వయోవృద్ధులు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విదించనున్నారు.