Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎరుక్కుపోయి ఇరుక్కున్నాడు

The golden theft targeting weddings
మహబూబ్‌నగర్ : ఎరుక్కుపోయి ఇరుకుపోవడం అంటే ఇదేనేమో… అత్యాశకు పోయిన ఓ దొంగ సిసి కెమెరనే చివరికి పోలీసులకు పట్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్‌పి డాక్టర్ బి. అనురాధ శుక్రవారం తన ఛాంబర్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఎనుగొండ గ్రామానికి చెందిన రవితేజ అలీయాస్ రఘు కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా బంగారు దొంగతనమే లక్ష్యంగా చేసుకున్నాడు. అందుకు భిన్నంగా ఫంక్షన్ హాల్స్‌లో జరిగే వివాహాలను, పెళ్లి కూతూర్లు ఉండే గదులను లక్ష్యంగా చేసుకుని బంగారు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే భూత్పూర్ దగ్గర ఉన్న కిష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏప్రిల్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో రవితేజ హాజరయ్యాడు. ఎవరూ లేని సమయంలో పెళ్లి కూతురు ఉండే గదికి వెళ్లి గడియ పెట్టి ఎవరికి అనుమానం రాకుండా బ్యాగుల్లోని బంగారం దొంగతనానికి పాల్పడ్డాడు. అనంతరం చూసుకున్న పెళ్లి కూతురు బంగారం పోవడంతో నివ్వెరపోయింది. అనంతరం ఫంక్షన్ హాల్ యాజమానిని సంప్రదించగా రవితేజ చాకచక్యంగా వెళ్లి బంగారం దొంగతనం చేసిన విధానాన్ని సిసి కెమెరాలో చూశారు. విషయాన్ని పోలీసులకు అందజేశారు. అదే తరహాలోనే మహబూబ్‌నగర్‌లోని ఏప్రిల్ 29న జరిగిన వాసు ఫంక్షన్ హాల్‌లో జరిగిన మరో వివాహంలో కూడా రవితేజ ఇదే తరహాలోనే దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇక్కడ కూడా సిసి కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు చాకచక్యంగా సిసి టివి పుటేజిలను అన్ని ఫంక్షన్ హాల్ యాజమానులకు చేరవేశారు. అనుమతులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు యాజమానులకు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహానికి రవితేజ హాజరై గతంలో చేసిన దొంతనం మాదిరే ఇక్కడ కూడా పెళ్లి కూతురు ఉండే గదిలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో యాజమాని సంబంధిత రూరల్ పోలీసులకు అప్పగించారు. వెంటనే రూరల్ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తన సిబ్బంది వెంకటేష్, జాకీర్‌లను తీసుకుని రవితేజను అదుపులోకి తీసుకున్నారు. రవితేజను విచారించడంతో అసలు విషయం బయట పడడంతో 12.8 తులాల బంగారాన్ని పోలీసులు రికవరీ చేసి నిందితుడు రవితేజను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు సినిమా హళ్లు, వైన్ షాపులు, ఆసుపత్రులు, ప్రధాన కూడళ్లు, ఇళ్ల దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సిసి కెమెర వంద మంది పోలీసులతో సమానమని చెప్పారు. సిసి కెమెరాలు ఉండడం వల్ల నేరాలను త్వరగా గుర్తించి నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందని, తద్వారా నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని ఎస్‌పి చెప్పారు.

Comments

comments