Home ఎడిటోరియల్ బిజెపి కశ్మీర్ పాచిక!

బిజెపి కశ్మీర్ పాచిక!

jammu

రానున్న సాధారణ ఎన్నికలపై దృష్టిపెట్టిన బిజెపి ఇప్పుడు కశ్మీరులో పిడిపితో తెగతెంపులు చేసుకుంది. జమ్ము కశ్మీరులో పిడిపికి మద్దతు కొనసాగించడం వల్ల జాతీయవాద, దేశభక్తి కలిగిన పార్టీ అని చెప్పుకోడానికి ముఖం చెల్లని పరిస్థితి తలెత్తుతుందని భయపడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. దీంతో, జమ్ము కశ్మీరులో ప్రభుత్వం కూలిపోయింది. ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. మరోసారి కశ్మీరులో గవర్నరు పాలన మొదలయ్యింది. రమజాన్ కాల్పుల విరమణ వైఫల్యం, షుజాత్ బుఖారీ హత్య, ఔరంగజేబ్ హత్య. చర్చలకు రాజ్ నాథ్ సింగ్ పిలుపిచ్చినా ప్రతిస్పందన లేకపోవడం తదితర కారణాలెన్నో ఈ నిర్ణయం వెనుక ఉండవచ్చు. ఏది ఏమైనా గత మూడు సంవత్సరాలుగా కశ్మీరులో పిడిపి, బిజెపిల ప్రభుత్వం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నదిన యదార్థం.
గత కొంతకాలంగా బిజెపి కశ్మీరులో పిడిపితో కొనసాగాలా లేదా అన్న ఆలోచనలో ఉంది. కాని కశ్మీరులో నానాటికి దిగజారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వైదొలగకపోతే తర్వాత చేతులు కాలుతాయని భయపడింది. ఇప్పుడు కశ్మీరులో తీసుకున్న నిర్ణయం వల్ల జమ్ము కశ్మీరులో బిజెపి రాజకీయంగా కోల్పోయేదేమీ లేదు. జమ్ములో రెండు పార్లమెంటరీ స్థానాలు, లద్దాక్ లో ఒక పార్లమెంటరీ స్థానంపై కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. ఈ మూడు స్థానాలు కోల్పోయినా కూడా బిజెపికి బాధలేదు. అసలు లక్ష్యం దేశవ్యాప్తంగా 2019లో బిజెపికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం. కశ్మీరును అగ్నిగుండంగా మార్చేసిన తర్వాత ఇలాగే పిడిపితో మైత్రి కొనసాగిస్తే ప్రతిపక్షాలకు బిజెపిపై దాడి చేసే అవకాశం ఇచ్చినట్లే. పైగా పిడిపి వేర్పాటువాదులపట్ల మెతగ్గా వ్యవహరించే పార్టీ.
అలాంటి పార్టీతో బిజెపి మైత్రిని ప్రతిపక్షాలు నిలదీస్తాయి. అందుకే ఎన్నికలకు ముందు తెగతెంపులు చేసుకుంటే, కశ్మీరులో తాము పనిచేయాలని ప్రయత్నించినా పిడిపి అడ్డుపడుతూ వచ్చిందని, అందుకే తెగతెంపులు చేసుకుని తమ దేశభక్తిని నిరూపించుకున్నామని ప్రచారం చేసుకోవచ్చు. కశ్మీరులో ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ప్రజలను నమ్మించగలిగితే, కశ్మీరును కాపాడేది తామేనని ప్రజల్లో ప్రచారం చేసుకుంటే మరోసారి ఎన్నికల్లో గెలుపు సాధ్యం చేసుకోవచ్చు. బిజెపితో చేతులు కలిపినందుకు బహుశా పిడిపి తగిన మూల్యం చెల్లించవలసి వస్తోంది.
కాని అందరూ అర్ధం చేసుకోవలసిన ప్రశ్న ఏమంటే, పిడిపి స్వయం పరిపాలన కోరే పార్టీ అని తెలిసి కూడా బిజెపి చేతులు కలిపి ప్రభుత్వంలో చేరింది. బిజెపి జాతీయవాదం, దేశభక్తి, దేశసమైక్యత గురించి మాట్లాడుతుంది, బిజెపి నాయకులు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు కాని ఇలా వేర్పాటువాద శక్తులతో ఎందుకు చేతులు కలుపుతున్నట్లు? 2016 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి గూర్ఖా జనముక్తి మోర్చాతో చేతులు కలిపింది. గూర్ఖా జనముక్తి మోర్చా వేర్పాటువాద పార్టీ అని అందరికీ తెలిసిందే. పశ్చమబెంగాల్లో వారికి అనుకున్నన్ని సీట్లు రాలేదు. అస్సామ్ లో బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ తో చేతులు కలిపింది. పంజాబ్‌లో అకాలీదళ్ మిత్రపక్షం.
అకాలీదళ్ పంజాబ్‌ను ప్రత్యేక ప్రాంతంగా పంజాబీ సూబా ఏర్పాటు చేయాలని కోరుతోంది. నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్ తోను, త్రిపురలో ఇండిజినస్ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతోను చేతులు కలిపింది. త్రిపురలో ఈ వేర్పాటువాద పార్టీకి మిలిటెంటు సంస్థ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో సంబంధాలున్నాయన్న బలమైన ఆరోపణలున్నాయి. ప్రత్యర్థులందరినీ జాతి వ్యతిరేకులని ముద్ర వేసే బిజెపి చేతులు కలుపుతున్న పార్టీలివి. ఇవి స్వార్థ ఎన్నికల రాజకీయాల ఎత్తుగడలు కావా?
బిజెపికి బలం ఉన్న జమ్ములోనే కాదు, యావద్దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం బలపడుతున్న సూచనలున్నాయి. ముఖ్యంగా కశ్మీరు రాజకీయాల్లో పిడిపి ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోతుందన్నఅభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. కథువా హత్యాచారం కేసులో నిందితుల తరఫున ర్యాలీలో పాల్గొన్న మంత్రులను తొలగించవలసి రావడం, కేసు సిబిఐకి ఇవ్వడంలో విఫలమవ్వడం ఇలాంటి అనేక సంఘటనలు జమ్ములో బిజెపి పట్ల వ్యతిరేకతకు కారణమవుతున్నాయని బిజెపి నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఇంకా కొనసాగించాలని పిడిపి పట్టుబట్టింది. బిజెపి తరఫున కశ్మీరు ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న కవీందర్ గుప్తా మాట్లాడుతూ చెప్పిన మాటలను బట్టి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కశ్మీరులో ప్రభుత్వాన్ని పడగొట్టే నిర్ణయం తీసుకున్నారు.
ఉక్కుపాదంతో జమ్ముకశ్మీరులో మిలిటెన్సీని అణిచేయాలని కేంద్రం ఎంత ప్రయత్నించినా, 2016 తర్వాతి నుంచి స్థానిక యువకులు మిలిటెన్సీలో చేరడం తగ్గలేదని వార్త. మరోవైపు కశ్మీరులో భద్రతాదళాలకు, ప్రతిఘటనకారులకు, మిలిటెంట్లకు మధ్య ఘర్షణల్లో చనిపోతున్న సాధారణ ప్రజల సంఖ్య పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్ నివేదికలో చేసిన వ్యాఖ్యలు కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. జమ్ము కశ్మీర్ కోయలిషన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే మానవహక్కుల సంస్థ వార్షిక నివేదిక ప్రకారం 2016లో 383 మంది మరణించారు. 145 మంది సాధారణ పౌరులు, 138 మంది మిలిటెంట్లు, 100 మంది భద్రతా సిబ్బంది. ఆ తర్వాతి సంవత్సరం 387 మంది మరణించారు. ఇందులో 207 మంది మిలిటెంట్లు, 93 మంది భద్రతాసిబ్బంది, 87 మంది సాధారణ పౌరులు.
ఈ సంవత్సరం మొదటి ఐదునెలల కాలంలో 67 మంది మిలిటెంట్లు, 41 మంది సాధారణ పౌరులు, 31 మంది భద్రతా సిబ్బంది మరణించారు. రాజకీయంగా కేంద్రప్రభుత్వ విధానాల్లో లోపమే ఈ హింసాకాండ పెరగడానికి కారణంగా చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం కశ్మీరులో దిగజారిన పరిస్థితుల వల్లనే బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. కాని ఈ పరిస్థితులకు పిడిపి బిజెపిలు రెండు పార్టీలు కారణమని మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా విమర్శించారు.
జమ్ము కశ్మీరులో బిజెపి పిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుంచి హిందూ జమ్ము, ముస్లిమ్ కశ్మీర్ అనే అఖాతం పెరిగిపోయింది. ఇప్పుడు కశ్మీరులో ప్రభుత్వం పడిపోయింది కాబట్టి కొత్త గవర్నరును అక్కడ నియమించవచ్చు. బిజెపి మిగిలిన రాష్ట్రాల్లో చేస్తున్నట్లే ఒక ఆరెస్సెస్ మనిషిని అక్కడికి పంపిస్తే పరిస్థితి ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. ఇప్పుడు జమ్ము కశ్మీరులో శాంతిభద్రతల పరిస్థితికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అవుతుంది. కశ్మీరు విషయంలో కేంద్రం అనుసరిస్తూ వచ్చిన విధానాలే అక్కడ పరిస్థితిని దిగజార్చాయని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం.
కశ్మీరు పరిస్థితి రానున్న ఎన్నికల్లో ప్రచారాయుధంగా మార్చుకునే ఆలోచన బిజెపికి ఉండవచ్చు. కశ్మీరు విషయంలో జాతీయభావాలను రెచ్చగొట్టి ప్రజలను ఆకర్షించడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా బిజెపి చాలా సార్లు కశ్మీరు సమస్యను ఎన్నికల రాజకీయాలకు ఉపయోగించుకుంది. జమ్ము కశ్మీరులో రాజకీయంగా దెబ్బతిన్నా పర్వాలేదు, జమ్ము కశ్మీరులో పరిస్థితి దిగజారినా పర్వాలేదు సాధారణ ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని బిజెపికి అనుకూలంగా మార్చడమే ముఖ్యం అని స్వార్థ రాజకీయాలతో వేసిన ఎత్తుగడ ఇది. కశ్మీరు సమస్య పరిష్కరించడానికి తాము ప్రయత్నించినా పిడిపి అడ్డుతగలడం వల్ల సాధ్యం కాలేదని ఇప్పుడు దేశప్రజలకు బిజెపి చెబుతుంది.
పిడిపి పార్టీ బిజెపి ఎత్తుగడలను ముందుగా ఊహించడంలో విఫలమైంది. ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళడం కష్టమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. బిజెపి మాత్రం జాతీయ ప్రయోజనాల కోసం కశ్మీరులో ప్రభుత్వాన్ని కూడా పణంగా పెట్టినట్లు ప్రచారం చేసుకునే అవకాశం దక్కించుకుంది. మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మూడు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కాని ప్రజాదరణ తగ్గుముఖం పట్టడం, ఇటీవల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు, మిత్రపక్షాలు వదిలిపోవడం ఇవన్నీ బిజెపికి ప్రతికూలాంశాలు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇప్పుడు కశ్మీరు గొప్ప సాధనంగా మార్చుకుంది.
కశ్మీరులో ప్రభుత్వాన్ని పడగట్టే నిర్ణయం వల్ల కశ్మీరు సమస్య మరింత సంక్లిష్టమయ్యే ప్రమాదం ఉంది. మరోసారి ఢిల్లీ తమను మోసం చేసిందన్న అభిప్రాయం కశ్మీరులో బలపడేలా చేసింది బిజెపి.