Home తాజా వార్తలు దేశానికే ఆదర్శం

దేశానికే ఆదర్శం

The government has brought about 40 lakh eyes

అంధత్వం లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం, ఇది దేశానికే ఆదర్శం
3.70 కోట్ల మందికి ఉచిత కంటి పరీక్షలు, కళ్లజోళ్లు, అవసరమైతే ఆపరేషన్లు
40 లక్షల కళ్లజోళ్లను ప్రభుత్వం తెప్పించింది
మెదక్ జిల్లా మల్కాపూర్‌లో కంటి వెలుగు పథకాన్ని ఆవిష్కరిస్తూ సిఎం

మన తెలంగాణ/ మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలను నిర్వహించి అవసరమున్న వారికి ఉచితంగా కళ్ళజోళ్లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశా రు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సిఎం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 3 కోట్ల 70లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలతోపాటు కళ్ళజోళ్లు, అవసరమైతే ఆపరేషన్లు కూడా ఉచితంగానే నిర్వహించబడుతాయన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 825 వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల కంటిచూపు మెరుగుపర్చేందుకు ఈ బృందాలు శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేస్తారన్నారు.

ప్రజలు కంటిచూపు విషయంలో నిర్లక్షం వహించకుండా వైద్య బృందాలచే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. విద్యార్థుల నుండి వృద్ధుల వరకు కంటిచూపు అత్యంత ప్రధాన్యమైనదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా ప్రతి రోజు 120 ఆపరేషన్లు చేసే సామర్ధం ఉన్న ఆసుపత్రులతో సహా సరోజినిదేవి కంటి ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. 40లక్షల కళ్ళ జోళ్లను రాష్ట్ర ప్రభుత్వం తెప్పించిందని, ఇంకా అవసరమైతే ఎన్నైనా సరే ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, యువకులు, ఎన్‌జివోలు, ఉద్యోగులు, అన్ని వర్గాలకు చెందిన వారు ముందుకువచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.

గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో వివక్షలకు గురైందని అవమానాలను దిగమింగి స్వంత రాష్ట్రాన్ని సాధించుకొని కేవలం నాలుగున్నరయేళ్లలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రం పరుగెడుతుందని తెలిపారు. ముఖ్యంగా రైతుల కష్టాలు తనకు తెలుసని, రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపడం సంతోషంగా ఉందన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు చెక్కులను అందజేసి కార్పొరేషన్ నిధుల కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇంటింటికి రెండు పాడిగేదెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. అంతకుముందు మల్కాపూర్‌లోని రాక్ గార్డెన్‌లో ముఖ్యమంత్రి మొక్కను నాటారు.

రాష్ట్రంలో సమస్యలు పూర్తిగా తీరిపోయాయి : గతంలో రైతాంగానికి వ్యవసాయానికి సరిపడా విద్యుత్ లేక బోర్లు సరైన నీళ్లందించగా పంటలు ఎండిపోయి అప్పుల పాలయ్యారని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ సర్కార్ హయంలో 24 గంటల నిరంతర విద్యుత్‌తో పాటు నాణ్యమైన విత్తనాలు, కనీస మద్దతు ధర పెంపు, సాగు, తాగునీటి కొరత పూర్తిగా తీరిపోయిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా బుధవారం నాటికి 20వేల గ్రామాలకు ఇంటింటికి మంచినీటిని అందించామని, మిగతా గ్రామాలకు కూడా దీపావళి కల్లా అందజేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా వెచ్చించని నిధులను వెచ్చించి నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నామన్నారు. బడ్జెట్‌లో రూ.25వేల కోట్లను కేటాయించగా 35వేల కోట్ల రూపాయలు బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల నుండి తీసుకొని నిర్మించుకుంటున్నామన్నారు. కేవలం సాగునీటి ప్రాజెక్టు కొరకే 65వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానిదేనని తెలిపారు. కేంద్రం కూడా ఇంత బడ్జెట్ ఖర్చుపెట్టడానికి వెనకాడుతుందని సిఎం అన్నారు. రైతుల సమస్యలు పూర్తిగా తీరాలంటే క్రిష్ణా, గోదావరి నీళ్లు తీసుకువచ్చి సాగుకు అందజేస్తామన్నారు. 15 టీఎంసీల ప్రాజెక్టు కేవలం ఒక సంవత్సర కాలంలో నిర్మించుకొని ప్రపంచంలోనే చరిత్ర సాధించామని ఆయన అన్నారు. రైతు బాగుండాలంటే సాగునీటితో పాటు రైతు పెట్టుబడి సాయం కెసిఆర్ ఉన్నంత వరకు ఖచ్చితంగా అందజేస్తామని హామీనిచ్చారు. ఇప్పటికే భూరికార్డుల ప్రక్షాళన ద్వారా తరతరాలుగా వస్తున్న భూతగాదాలను పరిష్కరించడం జరిగిందని, మున్ముందు కబ్జాదారులను, అనుభవదారులను తొలగించి అసలు పట్టాదారులకే భూమిని వర్తింపజేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

తెలంగాణ ధనిక రాష్ట్రం: రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ సమస్య నిర్మూళనకు అమెరికా తరహాలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సిఎం తెలిపారు. ఇప్పటికే దాని అంచనాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రతి పల్లె కూడా పట్టుకొమ్మలా మార్చి ప్రజలు పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. విషజ్వరాలు ప్రబలకుండా పూర్తి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేయడంతో పాటు ఇంటికోక ఇంకు డు గుంత నిర్మించి భూమిలో నీటి ఊటలు పెంచే దిశగా కార్యాచరణ రూపొందించి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణతోపాటు ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ఉన్న అడవులలో చెట్లను పెంచి సకాలంలో వానలు కురిపించడం కాకుండా అడవుల్లో ఉన్న వానరాలతోపాటు ఇతర జంతువులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు చేపడతామన్నారు.

మల్కాపూర్ గ్రామం నుంచి నేర్చుకుంటా : ఈ గ్రామానికి రావడం తాను అదృష్టంగా భావించడంతో పాటు ఈ గ్రామం తన నియోజకవర్గంలో ఉండడం మరింత సంతోషాన్ని నింపిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన మల్కాపూర్ గ్రామస్తులను ముఖ్యమంత్రి అభినందించారు. ముఖ్యంగా ఐక్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని, అలాంటిది మల్కాపూర్ గ్రామస్తులంతా ఏకతాటిపై ఉండి గ్రామాభివృద్ధిలో పాలుపంచుకొని స్వంత ఊరును అభివృద్ధి చేసుకోవడం ఎంతో మంచి కార్యక్రమమని అన్నారు. ప్రస్తుతం దేశంలో మతం, కులం, ఆడ, మగ అనే వ్యత్యాసాలు మన అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయం సాధిస్తున్నారన్నారు.

దేశం అభివృద్ధి పథంలో నడువాలంటే ముఖ్యంగా ఉత్పాదకం, అనుత్పాదకం అనే రెండు రంగాలు ఎంచుకోవాలని, అందులో అద్భుతమైన ప్రతిభావంతులను ఉత్పాదక రంగంలో ఉంచి కొంచెం తక్కువ సామర్ధం కలిగిన వారిని అనుత్పాదక రంగాల్లో ఉంచుతారని, ఇందువల్ల ఆ దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. కేవలం ఒక రష్యా దేశంలోనే 92శాతం పైలెట్లు మహిళలే ఉన్నారని ఉదాహరణ చెబుతూఅవకాశమిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. మల్కాపూర్ గ్రామంలో పర్యటించినప్పడు కూడా మహిళలు, యువకులు తెలివిపరులను, మొక్కలు నాటడమే కాకుండా వాటిని పూర్తిస్థాయిలో పెంచారని ఈ సందర్భంగా వారిని సిఎం అభినందించారు. గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని పూర్తి స్థాయిలో వాడడంతోపాటు వంద శాతం హరితహారాన్ని విజయవతం చేసుకొని మధ్య నిషేధ గ్రామంగా కూడా తీర్చిదిద్దుకున్నందుకు గ్రామస్తులను అభినందించారు. గ్రామాన్ని కలెక్టర్ దత్తత తీసుకోవాల్సిందిగా కోరుతూ గ్రామాభివృద్ధికి రూ.6కోట్లను మంజూరు చేశారు.

ఈ నిధులను కలెక్టర్ ఖాతాలోనే ఉంచుతామని అభివృద్ధికి అవసరమైనన్ని నిధులను వినియోగించుకోవాల్సిందిగా పూర్తి హక్కులను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రానికి మల్కాపూర్ గ్రామం మణిహారమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఉప సభాపతి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.కేశవరావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరిసుభాష్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, సిఎంఓ అధికారి స్మితాసబర్వాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శాంతకుమారి, హరితహారం ప్రత్యేక కార్యదర్శి వాకిటి కరుణ, శాసనసభ్యులు మధన్‌రెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.