Home ఎడిటోరియల్ ప్రశ్నించే హక్కు నిరాకరిస్తున్న ప్రభుత్వాలు

ప్రశ్నించే హక్కు నిరాకరిస్తున్న ప్రభుత్వాలు

rally

అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రజలకు గల ప్రశ్నించే హక్కును ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వాలు బయటికి ‘ప్రజాహితం’ అనిచెప్పి చేపడుతున్న ప్రాజెక్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత వ్యక్తంచేస్తే వారిని వర్ణించడానికి ప్రభుత్వాలు కొత్తకొత్త పదాలను కనిపెడుతున్నాయి. ‘అభివృద్ధి వ్యతిరేకి’, ‘జాతి వ్యతిరేకి’, ‘పట్టణప్రాంత నక్సల్’, ‘తీవ్రవాది’ అని ముద్రవేస్తున్నాయి.
చెన్నైలో జూలై ఆరున ఒక పత్రికాగోష్ఠిలో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక, నౌకానిర్మాణ శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ ప్రభుత్వ పథకాలను విమర్శించేవారిని, ప్రాజెక్ట్‌లపై వ్యతిరేకత కూడగట్టే వారిని టెర్రరిస్టులు అని కాక మరో పదంతో పిలవడానికి నిరాకరించారు. ఎందుకనగా వారంతా ‘ప్రజా వ్యతిరేకులు, ప్రగతి వ్యతిరేకులు’ అని వర్ణిస్తూ అటువంటివారిని టెర్రరిస్టులు అని పిలవాలని ఆయన నొక్కి చెప్పారు. అయితే టెర్రరిస్టు అనే పదానికి నిఘంటువులో ఇచ్చిన అర్ధం గురించి బహుశా మంత్రికి పూర్తిగా తెలిసినట్టు లేదు. టెర్రరిస్టు అంటే నిఘంటు అర్థం ‘తమ రాజకీయ లక్ష్యాల కోసం చట్టవ్యతిరేక హింసకు పాల్పడుతూ ప్రజలను ముఖ్యంగా సాధారణ పౌరులను బెదిరించడం’. అయితే బహుశా మంత్రి ఇటీవల తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో పౌరులకు వ్యతిరేకంగా ‘చట్టవ్యతిరేక హింసకు, బెదిరింపులకు’ పాల్పడటం గమనించడంలో మంత్రి విఫలమయ్యారు. అది తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పుల విషయంలో చాలా స్పష్టంగా కనిపించింది. మే 22వ తేదీన వేదాంత సంస్థకు చెందిన స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్ నుంచి వెలువడుతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా తూత్తుకుడిలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన జరుపుతున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పులలో 13 మంది మరణించారు. తమిళనాడు ప్రభుత్వం అంతటితో ఆపలేదు. వందలాది మంది నిరసనకారులను అరెస్టు చేయడమేకాక వారిపై అమానుష జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించింది. తమ జీవనానికి హాని కలుగజేస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరుపుతున్న ప్రజలను ఏరకంగా ‘టెర్రరిస్టులు’ అని ముద్ర వేస్తారు? అప్పుడు మరి ప్రదర్శకుల పట్ల అతిగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వ తీరు ‘భీతిగొల్పడం’ కాక మరేమిటి?
వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే పథకాల గురించి ప్రశ్నించిన వారి గుండెల్లో ప్రభుత్వం ఏ విధంగా భయం పుట్టిస్తుందనడానికి తమిళనాడు మంచి ఉదాహరణ. స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్ వద్ద కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగిన గత నెల రోజుల్లో ప్రత్యక్షంగా ఉద్యమంతో సంబంధం ఉన్న వందలాది మంది ప్రదర్శకులను అరెస్ట్ చేసింది. అంతేకాక వారి అరెస్టులకు వ్యతిరేకంగా వాదిస్తున్న న్యాయవాదిని, పర్యావరణ ఉద్యమకారుణ్ణి, ప్రదర్శన, ఇతర నిరసనల వార్తలు సేకరించిన జర్నలిస్టులను కూడా నిర్బంధించింది. వారిలో కొందరిని విడుదల చేశారు. తూత్తుకుడి ప్రదర్శన వార్తల ప్రసారం నిలిపివేతకు ముందు గత ఏడాది కాలంలో ప్రభుత్వం తమ యాజమాన్యంలోని అరసు కేబుల్ టి.వి. కార్పొరేషన్ ద్వారా ఇటువంటి ఎన్నో నిరసనల వార్తలు 11 వార్తా చానళ్ళ ప్రసారాలు నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతో చేపడుతున్న చెన్నై సేలం గ్రీన్ కారిడార్ ప్రాజెక్టు పట్ల కూడా ప్రజలనుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అది రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో చేపట్టే ఈ హైవే ప్రాజెక్టువల్ల దాదాపు 159 గ్రామాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాక సారవంతమైన వ్యవసాయ క్షేత్రాలకు, అడవులకు నష్టం వాటిల్లుతుంది. వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతారు.
అవధులు దాటిన అసహనంతో తమిళనాడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలలో ఇప్పుడు ప్రతిబింబిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన ముంబై – అహమ్మదాబాదు సూపర్ ఫాస్ట్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం భూసేకరణ జరపడాన్ని నిరసిస్తూ జరిగే ప్రదర్శనల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం ఇక ముందు ఎలా స్పందిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణకు తుది గడువు ఈ ఏడాది డిసెంబర్. అయితే ఆ గడువు లోపల భూసేకరణ పూర్తి కాకపోవచ్చు. ఎందుకంటే తమ భూములను ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడటంలేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు
వివిధ ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీకి చెందినవి అయినా తమ దృష్టిలో ఆర్థిక ప్రగతికి తోడ్పడగలవని నమ్మే ప్రాజెక్టులను గురించి ప్రశ్నించడాన్ని లేక వ్యతిరేకించడాన్ని అసలు సహించడం లేదు. అయితే గతంలో ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. 1980 నుంచి ప్రాజెక్టుల విషయంలో జనం ప్రశ్నించడం మొదలైంది. ఆవిధంగా ఉదాహరణకు 1980 తర్వాత సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, నర్మదా నదిపై నిర్మించే ఇతర ఆనకట్టల విషయంలో నర్మదా బచావో ఆందోళన్ చాలాకాలం జరిగింది. అప్పటి నుంచి భారీ ప్రాజెక్టులకు రుణసహాయం చేస్తున్న ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తమ మద్దతుపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1992లో మొదటిసారిగా ప్రపంచ బ్యాంకు తాము ఆర్థిక సహాయం చేస్తున్న ఒక ప్రాజెక్టును గురించి స్వతంత్ర సమీక్ష జరపడం సర్దార్ సరోవర్ ప్రాజెక్టుతో మొదలైంది. దాని ఫలితంగా ఆ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడమే కాక ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తలెత్తే పర్యావరణ, సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకొని రుణవిధానాలను రూపొందించడానికి, కొత్త ప్రాజెక్టుల సమీక్షకు ఆనకట్టల కోసం ప్రపంచ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు పూనుకుంది.
నర్మదా బచావో ఆందోళన వల్ల సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం, ఇతర ఆనకట్టల నిర్మాణం ఆగిపోనప్పటికీ ఇటువంటి ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన సందేహాలు వ్యక్తం కావడానికి దారితీసింది. పెద్ద ఎత్తున జనం నిర్వాసితులు కావడమే కాక పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి ప్రాజెక్టులు అవసరమా అనే సందేహాలు తలెత్తాయి.
ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రభావితులైన సామాజిక వర్గాలు ప్రాజెక్టు స్థలాన్ని నిర్ణయించడానికి వారికి గల హక్కును చాటడం ఐదేళ్ల క్రితం 2013లో ఒడిశాలో జరిగింది. వేదాంత యాజమాన్యంలోని బాక్సైట్ గని తవ్వకం పనులను ఒడిశాలోని నియమగిరి కొండ ల్లో నివసించే దొంగ్రియా కొండ ప్రజలు వ్యతిరేకించారు. వారికి గిరిజనులు, అడవులలో నివసించే ఇతర సాంప్రదాయ వర్గాల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 ద్వారా ఈ హక్కు లభించింది. వారి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందంటారు. అయినప్పటికీ బాక్సైట్ గని తవ్వకాలను వ్యతిరేకించిన నీయమగిరి సురక్షా సమితి కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధం ఉందని గత సంవత్సరం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టుల విషయంలో ఏదైనా వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలా ప్రశ్నించే వారిని ‘తీవ్రవాదులు’ అని ముద్ర వేయడం ఇబ్బందిపెట్టే విధంగా ఉంది. అయితే ఇప్పుడు జనం తెలివిమీరారని తమ హక్కుల గురించి, తమకు గల ప్రశ్నించే హక్కు గురించి తెలుసుకున్నారనే విషయాన్ని ప్రభుత్వాలు అంగీకరించడం లేదు
అంతే ఇబ్బందికరమైన మరో అంశం ఏమిటంటే జూన్ నెలలో ముంబైలో గవర్నర్ల వార్షిక సమావేశం జరిగినా ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు వంటి బహువిధ ఆర్థిక సహాయ సంస్థలకు గతంలో ప్రజా ఉద్యమాల వల్ల తలెత్తిన అవరోధాల గురించి తెలియ చేయకపోవడం. అందుకు బదులుగా ఇలా కొత్త కొత్త సంస్థలు ఆర్థిక సహాయం చేయడానికి గల అవకాశాలు ప్రభుత్వం పనిగట్టుకొని ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక శాసనాలు, పర్యావరణహిత నియంత్రణలు, భూసేకరణ చట్టాలతో సహా అన్ని నియంత్రణలను నీరుగార్చేందుకు ప్రోత్సాహమిస్తున్నాయి. దానికితోడు ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో ఎదురయ్యే ప్రతిఘటనలన్నింటిని టెర్రరిస్టుల పని అని ప్రకటించడం ద్వారా రాజ్యం అణచివేతకు ద్వారాలు తెరిచినట్లే.

* (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)