Home కలం ఒద్దిరాజు సోదరులు

ఒద్దిరాజు సోదరులు

oddiraju-6

ఒద్దిరాజు సోదరులు భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో అసమాన కృషిని ప్రదర్శించారు. ప్రాపంచిక పరిజ్ఞాన విస్తృతికి భాషాజ్ఞానం దోహదం చేస్తుందని వారు ప్రబోధించారు. చిన్ననాటినుండి భాషా ధ్యయనానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భాషా పరిజ్ఞా నాన్ని పెంచుకున్నారు. ఇంట్లోనే తల్లి వారికి మొదటి గురువు. ఆమె వారిరు వురికి పద్యాలు నేర్పించారు. ఐదేళ్ల ప్రాయానికే సీతారామచంద్రరావు ఐదొం దల పద్యాలను కంఠస్థం చేశారు. అనంతరం హసన్ అనే గురువు వద్ద పెద్ద బాల శిక్ష, గణితం మొదలైనవి నేర్చుకు న్నారు. స్వగ్రామం ఇనుగుర్తిలో తరికంటి కృష్ణశాస్త్రి, చెరుకుపల్లి గోపాలకృష్ణ శాస్త్రి అనే పండితుల వద్ద సంస్కృతం అభ్యసించారు.
నాడు కీకారణ్యంలా ఉన్న ఇనుగుర్తి ప్రాంతంలో పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ తిరిగేవారు. పగటిపూట ఇనుగుర్తిలో విశ్రాంతి తీసుకునే ఆ పోలీసుల వద్ద ఈ సోదరులు ఉర్దూ నేర్చుకున్నారు. ఆ గ్రామంలో పనిచేసే జి.డబ్ల్యు.డి.కెంపు అనే నీటిపారుదల విభాగ ఉద్యోగి దగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఆ గ్రామానికి గొర్రెలు, మేకల చర్మాలు వ్యాపా రం చేసేందుకు ఒక తమిళ వ్యాపారి వచ్చాడు. అతనికి ఉర్దూ నేర్పిస్తా మనే ఒప్పందంతో అతని వద్ద తమిళం నేర్చుకున్నారు. తమిళం నేర్చుకో వడంతో పాటు ఆ భాషలోని పలు సాహిత్య, వ్యాకరణ గ్రంథాలను ఔపోసన పట్టారు. తులసీదాసు రామాయణం, ప్రేవ్‌ుచంద్ నవలలు మొదలైన వాటి ద్వారా హిందీని అభ్యసించారు. ఈ భాషల అధ్యయ నంతో వారు సంతృప్తి చెందలేదు. ఇంకా నేర్చుకోవాలన్న తపనతో పార్శీ, అరబ్బీ, కన్నడ, మరాఠీ భాషలను కూడా నేర్చుకున్నారు.
భాషాధ్యయనంతో వారి జ్ఞానతృష్ణ తీరలేదు. ఇనుగుర్తి గ్రామంలో తాటిపాముల అప్పయ్య వద్ద జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం నేర్చుకున్నారు. స్వయంకృషితో అల్లోపతి, ఆయుర్వేదం, హోమియో వైద్య విధానాలను అభ్యసించారు. వారి వద్ద వైద్యం నేర్చుకున్న శిష్యులు కొందరు వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. వైద్యవిజ్ఞానంపై ‘విషములు తచ్చికిత్సలు’ అనే గ్రంథాన్ని వెలువరించారు రాఘవ రంగారావు. శరీర విజ్ఞాన శాస్త్ర విశేషాలతో కూడిన ‘శారీరక విజ్ఞానము’ రచించారు ఈ సోదరులు. వాద్య సంగీతం కూడా నేర్చుకున్నారు. వీణ, వయోలిన్, ఫ్లూట్, హార్మోనియం మొదలైన వాద్య సంగీత పరికరాలను వాయించడంలో నిష్ణాతులనిపించుకున్నారు. తామే స్వంతంగా వీణను తయారుచేశారు. పలువురు విద్యార్థులకు సంగీతాన్ని ఉచితంగా నేర్పి, వారిని గొప్ప సంగీత విద్వాంసులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మను స్వయంగా పేర్చడంలోనూ ఈ సోదరులు ప్రతిభ చూపారు. తీరొక్క పువ్వులతో వారు బతుకమ్మను పేర్చేతీరు చూపరులను అబ్బురపరిచేది. పండుగ సమయాల్లో ముగ్గులు వేయడం, గొబ్బిళ్లు చేయడం కూడా స్వయంగా చేసేవారు. సైకిల్ అంటే తెలియని కాలంలో మదరాసు నుండి సైకిల్ విడిభాగాలను తెచ్చుకుని, వాటిని అమర్చుకుని సైకిల్‌పై అనేక గ్రామాల్లో సంచరించిన ఒద్దిరాజు సోదరులు సైకిల్ ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పారు.
ఈ సోదరులు హస్త కళల్లో ప్రవీణులయ్యారు. వడ్రంగం పని కూడా చేశారు. వారు కట్టుకున్న ఇంటికి స్వయంగా నగిషీలు చెక్కారు. ఇంటి తలుపులు మొదలుకొని ప్రతి అంశంలోనూ కళాత్మకత ఉట్టిపడేలా ఇంటిని నిర్మించారు. ‘చేతి పనులు 100 యోగములు’, ‘బాల విజ్ఞాన మంజూష’ అనే గ్రంథాలను రచించి, ప్రచురించారు. ఈ గ్రంథాల వల్ల కుటీర పరిశ్రమలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న అనేకులు కుటీర పరిశ్రమలను స్థాపించి, లాభపడ్డారు. ఫోటోగ్రఫీ నేర్చుకోవడంతో పాటు ఫోటోగ్రఫీపై ‘ఛాయాకర్షణ’, ‘ఛాయాగ్రహణము తంత్రము’ అనే పుస్తకాలను రచించారు. విద్యుత్తుకు సంబంధించిన వివరాలతో ‘విద్యుద్విజ్ఞానము’ అనే అముద్రిత గ్రంథాన్ని రాశారు.
అచ్చుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకున్నారు ఈ సోదరులు. స్వగ్రామం ఇనుగుర్తిలో ఒక ముద్రణాలయాన్ని నెలకొల్పా రు. కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్, ముద్రణ, బైండింగ్ మొదలైన అన్ని పనులూ తామే నిర్వర్తించారు. ‘విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల’ పేరుతో అనేక గ్రంథాలను ప్రచురించారు. ‘తెనుగు’ అనే పత్రికను వెలువరిం చారు. 1922 ఆగస్టు 27న ప్రారంభమైన ఈ పత్రిక ఐదేళ్లు కొనసాగింది.
సాహిత్య సృజన ఈ సోదరులకు కొట్టిన పిండి. ‘ఎ మాన్యువల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్’ అనే ఆంగ్ల గ్రంథానికి అనుసృజనగా 1930లో ఆంగ్లవ్యాకరణగ్రంథాన్ని రచించారు వారు. రవీంద్రనాథ్ టాగూర్ రచించిన ‘రెక్’ను ఈ ఇరువురిలో పెద్దవారైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు ‘నౌకాభంగము’ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. సంస్కృత వ్యాకరణాన్ని ఈ ఇరువురు సోదరులు కలిసి రచించారు. ‘పాణినీయాష్టాధ్యాయి’ని సీతారామచంద్రరావు రాశారు. పాణిని రచించిన ‘అష్టాధ్యాయి’కి ఆంధ్రవ్యాఖ్యానం జోడిస్తూ రాఘవ రంగారావు చేసిన రచన ముద్రితం కాలేదు. భట్టి కావ్యాన్ని, సిద్ధాంత కౌముదిని సీతారామచంద్రరావు అను వదించారు. ‘ముదలాయిరం’, ‘వణ్ణమాడఙ్గల్’, ‘సుశీలా మైనావతి’ అనే గ్రంథాల అనువాదాలను రాఘవ రంగారావు చేశారు. ఈ ఇరువురు ‘స్త్రీ సాహసము’, ‘ముక్తి లవ’,‘రుద్రమ దేవి’, ‘శౌర్య శక్తి’, ‘వరాహ ముద్ర’, ‘బ్రాహ్మణ సాహసము’, ‘వీరావేశము’ అనే చారిత్రక నవలలను వెలువ రించారు. ‘పంచకూళ కషాయము’ అనే ప్రహసనాన్ని రచించారు. ప్రదర్శన యోగ్యమైన పలు నాటకాలను, నాటికలను కూడా వారు సృజించారు. ‘మోహినీ విలాసము’, ‘ప్రేమ ప్రవాహము’ అనే నాటకాలను సీతారామచంద్రరావు రాయగా, ఈ ఇరువురు కలిసి ‘భక్తి సార చరిత్ర’ అనే నాటకాన్ని రచించారు.ఇరువురు సోదరులు సంస్కృ తంలోనూ రచనలు చేశారు. సీతా రామచంద్రరావు ‘కృష్ణస్తవ:’, ‘శ్రీస్తవ:’, ‘శుకపక్షీయవ్‌ు’, ‘ఉత్సవానంద భాణవ్‌ు’, ‘వైభవ స్తవ:’, విభక్త్యర్థవ్‌ు’, ‘ధాతు నిఘంటు:’ అనే గ్రంథాలను రచించారు. ‘ఆర్తి ప్రబంధవ్‌ు’, ‘సప్తగాథ వ్యాఖ్య’ రాఘవ రంగారావు సంస్కృత రచనలు.ఇరువురిలో పెద్దవారైన సీతారామచంద్రరావు ‘ది ఫ్లవర్’, ‘ది బ్లెస్సింగ్’, ‘డెడికేషన్ టు ది విద్యుద్విజ్ఞానం’, ‘మై షౌట్స్ విల్ బి సో’ మొదలైన ఆంగ్ల రచనలు చేశారు.పెద్దవారైైన సీతారామచంద్రరావు శతక రచన కూడా చేశారు. ఆయన రచించిన ‘లోకేశ్వర శతకం’ ఇప్పటికీ అముద్రితంగానే ఉంది. విభిన్న రంగాల్లో కాలిడడమే కాకుండా వాటిలో అసమాన ప్రతిభ ప్రదర్శించిన చైతన్యమూర్తులు ఒద్దిరాజు సోదరులు.