Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కవితా విశ్వంభరుడు

C-Narayana-Reddy

“రాస్తూ రాస్తూ పోతాను – సి / రా ఇంకే వరకు-/ పోతూ పోతూ రాస్తాను – వ / పువు “వాడే వరకు”- అని తన సంకల్పాన్ని ప్రకటించి
“ఏదైనా రాయందే / ఈ క్షణాన్ని పోనీయను
కలాన్ని పిండేయందే /కాలాన్ని కదలనీయను
అవసరమైనప్పుడల్లా /అగ్గిపుల్లతో – చీకటి
కొవ్వును కరిగించందే / కొత్త పొద్దు రానీయను.”

అని తన లక్షాన్ని ఉద్ఘాటించి ‘కవిత నా మాతృభాష’, ‘కవిత నా శ్వాస’, ‘కవిత నా చిరునామా’ అని కవిత్వాన్ని ప్రేమించి ఏడున్నర దశాబ్దాలకాలం నుంచి ఎత్తిన కలం దించకుండా రచనలు చేస్తున్న సతత హరిత సాహితీ చైతన్య మూర్తి డా. సి. నారాయణ రెడ్డి గారు.
సినారె ముద్దుపేరుతో తెలుగుల గుండియలను దోచుకున్న ఆ మహాకవి. గేయం, పద్యం, వచన పద్యం, రూపకం, నాటిక, విమర్శ, సిద్ధాంతం, దీర్ఘకవిత, గజళ్లు, ద్విపదులు, ప్రపంచపదులు, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియల్లో ఉజ్వల కావ్యాలు రచించారు. ముఖ్యంగా గేయ కవిత్వంలో పలు విధాల గీతులను ప్రవేశపెట్టి ఆ ప్రక్రియకు పట్టాభిషేకం జరిపించారు. సిద్ధాంత రచనలో సమన్వయం సాధించారు. జాతీయ, అంతర్జాతీయ క్షేత్రాల్లో పర్యటించారు. తెలుగు భాషా సాహిత్యాల మాధుర్యాలను పంచిపెట్టి ప్రశంసలు అందుకున్నారు. ఆ మహాకవి అలవోకగా మాట్లాడినా, మిత్రులతో సరదాగా గడిపినా, బంధువులతో అనుబంధాలను అల్లించుకున్న వేళల్లోనైనా, విద్యార్థులతో గడిపినా- ఆ సన్నివేశాల్లో కవిత్వమే దూకేది. అదొక అద్భుత సమ్మోహన శక్తి.
సినారెగారి వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన హృదయానికి పొలిమేరలు లేవు. అంతరాల విన్యాసాలు రుచించవు, నినాదాలు గిట్టవు. అయితే వాస్తవాలను నినాదంగా మలచడంలో చాలా నేర్పరి. నేల మీద నిలబడి నింగిని గుండెలో బంధించారు. ఆకాశ మంత విస్తరించి నేలను కౌగిలించుకున్నారు. ప్రకృతి హృదయంలో దాగిన అద్భుత సౌందర్యాన్ని దర్శించారు. మానవ ప్రకృతిలోని ఆంతర్యాల వ్యూహాలను వీక్షించారు. నల్లని రాళ్లలో దాగివున్న కళ్లను, గుండెలను మనోనేత్రాల తో అందుకున్నారు. ఎండల రుతువుల విభుని శౌర్యాన్ని, శరత్తులోని వెన్నెల రేడు శీతలత్వాన్ని ఆమని పరిమళ రాగ గాంధర్వాన్ని, హేమంత సీమంతినీ కవ్వింపుల తరళత్వాన్ని ఒకటేమిటి మరొకటేమిటి? ఇంకెన్నింటిలో తన వ్యక్తిత్వం నుంచి సాహితీ వ్యక్తిత్వం నుంచి పలికించి ‘విశ్వంభరుడు’ అనే గౌరవం పొందారు.
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన సినారె గారు 29 జూలై 1931న సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ‘హనుమాజిపేట’ గ్రామంలో బుచ్చమ్మమల్లా రెడ్డి దంపతుల కళ్ల వెలుగులా జన్మించారు. ఆయనకు పెట్టిన పేరు సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి. సత్య శబ్దం సాహిత్యంలోనే చేరింది. ఇంటిపేరులోని ‘సింగి’ చైతన్య రూపాన్ని పలికించింది. అట్లా మారిపోగా సి.నారాయణ రెడ్డి అనేపేరు సినారెగా విశ్వప్రసిద్ధమైంది.
సినారెగారు 1953 -55 సం॥లలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివి 1962లో ‘ఆధుని కాంధ్ర కవిత్వము సంప్రదాయాలు- ప్రయోగములు” అనే అంశాన్ని పరిశోధించి పి.హెచ్.డి చేశారు. 1976లో తెలుగు శాఖలో ఆచార్యులయ్యారు. 1981-85 వరకు అధికార భాషా సంఘాధ్యక్షుడుగా, దేశంలో ప్రథమ సార్వత్రిక విశ్వ విద్యాలయం డా. బి.ఆర్. అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా, 1989-92 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసి ఆ మహోన్నత సంస్థల అభివృద్దికి కృషి చేశారు. 1992 రాష్ట్ర భాషా సాంస్కృతిక సలహాదారుడుగా, 1997లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికమండలి అధ్యక్షుడిగా, 1997-2003దాకా రాజ్యసభ సభ్యుడుగా విశిష్ట సేవ లందించారు. ఈ పదవిని అందుకున్న తొలి దక్షిణ భారత కవి ఒక్క నారాయణ రెడ్డి గారే!
ఆ మహాకవికి రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులతోపాటు అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు “విశ్వంభర” మహాకావ్యానికి లభించింది. ఇక సినారె సాహిత్య వైభవాన్ని చాటే ఎన్నో పరిశోధనా గ్రంథాలు, అభిమానులు రాసిన గ్రంథాలు అనేకం వెలువడ్డాయి. దేశంలోని కొన్ని విశ్వవిద్యాల యాలు ఆ మహాకవి గౌరవ డాక్టరేట్లతో సత్కరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1977లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించడం జరిగింది.
సినారె గారికి బాల్యదశలోనే కవిత్వం ‘పాట’ రూపంలో సొంతమైంది. స్వగ్రామం హను మాజిపేటను చుట్టేసిన పైరుల హరితస్వరాలు, సెలయేళ్ల గలగలలు, హరిదాసుల జానపద బాణీలు ఆ లేత గుండెని కవ్విం చాయి. ఫలితంగా ఆ చివురు మనస్సు నుంచి రెక్క విప్పింది. అంటే పాటతో ఆయన సాహితీ జీవితం మొగ్గ తొడిగిందని చెప్పాలి. అటు తర్వాత ఆ విద్యార్థి దశలోనే అనేక పాటలు, ఆ తర్వాత సినారె ఈ పాట గురించి అనే నిర్వచనాలు ఇచ్చారు అభిమాన పురస్సరంగా అందుకే ఒక చోట తన వ్యక్తిత్వాన్ని రూపాన్ని, గీత స్వభావాన్ని ప్రకటించడం జరిగింది.
“తెలుగు కళ్లకు తెలుసు నా / లలితకళా రూపం
తెలుగు కళ్లకు తెలుసు నా/ కలగీతిగా దీపం”
సినారెకు బాల్యదశలోనే సంస్క రణ దృక్పథం పట్టుపడింది.
“మాలమాలయని మచ్చరించి మీ సాలు దువ్వెదవదేలా! / మాలడే మహామంత్రియైన పూమాలవేసేదవదేలా!”
ఈ సంస్కరణ గుణమె ఆయన రాసిన కొన్ని కావ్యాలలో కన్పిస్తుంది. సినారెగారు మానవ తావాది. వస్తువు ఏదైనప్పటికీ మనిషి ధర్మాన్ని అందులో నిక్షేపిస్తారు. ముందుగా
“నా వచనం బహువచనం / నా వాదం సామ్యవాదం /కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం” అని సూటిగా చెప్పారు.
“మనిషి నా పల్లవి /మనిషి నా పతాక
మనిషినా అవధి / మనిషి నా ఆవేశం
మనిషి నా ఉచ్ఛాసం /మనిషి నావిశ్వాసం” అని ఉద్ఘాటించారు.
సినారె శ్రామికజన పక్షపాతి. చాలా రచనల్లో ఈ అభిమానం కన్పిస్తుంది.
“శ్రమ జీవి చెమటబిందువులో / ఆణిముత్యమూ ఉంది
అగ్నిగోళమూ ఉంది” ఇలాంటివే మరికొన్ని కవితలు కూడా.
సినారె సమానత్వం ఆకాంక్షించారు. దానికి స్థిరత్వాన్ని కల్పించటానికి తన కవిత్వాన్ని సూక్త సూత్రాలుగా అందించారు.
“ఎవడు హిందు వెవడుతురక? ఎవడురా కిరాస్తానీ, ఎవరిది తెలుగెవరిది, రవమెవరిది హిందుస్తానీ?
ఒకే తోట వికసించిన రకరకాల పువ్వులురా
ఒకే వాణి గుడిలో వెలుగొందిన మణి దివ్వెలురా
సినారె కవిత్వం మనిషి స్వచ్ఛమైన జీవితానికి అండగా నిలిచి ప్రబోధించేదిగా ఉంటుంది.
“ఉప్పెనలో తలవొగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవితం / ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం / చచ్చే దాకా బతికి ఉండడం జాతకాలలోఉన్నదే
ఒరిగిపోయినా తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం/ప్రలోభాలుపై పడినా నీతికి పడిచచ్చేదే జీవితం”. సినారె గారి సాహిత్యమంతా మానవ వికాసం కోసం రాయబడిందే. ప్రతి రచనలో పదునుతో కూడుకున్న నాదం. ఆర్ద్రతాగ్ని నినాదం, ఆత్మచైతన్య సందేశం, మానవతా పరిమళ ప్రవాహం అభ్యుద యాంకిత స్వచ్ఛ సందేశంవంటి అంశాలు అనేకం ఉన్నాయి. అవన్నీ నిరంతరం సమాజాన్ని సముద్ధరిం పజేసే నిర్వచ నోక్తులే.
కవిగా, గేయలలిత చిత్రగీతకారుడిగా, విమర్శకుడిగా, సాటకకర్తగా, వక్తగా, ఉప న్యాసకుడిగా, ఆచార్యుడిగా, విద్యావేత్త గా, పరిపాలనాధక్షుడిగా, ఉపకులపతిగా, సాంస్కృ తిక మండలి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, జ్ఞానపీఠిగా, మంచి మనసున్న మహా మనీషిగా ప్రపంచానికి మానవతా మహోజ్వల సందేశమం దించిన సినారెగారు భౌతికంగా మనమధ్య లేకపోయి నప్పటికీ ఆయన కలం నుండి దూకిన అక్షరం, పరిమళించిన సందేశం మానవాళికి నిత్యం ఉత్తేజాన్ని కలిగిస్తాయని చెప్పి ఆమహాకవి దివ్యాత్మకు అంజలి ఘటిస్తున్నాను.

Comments

comments