Home బిజినెస్ జిఎస్‌టిని సరళతరం చేయాలి

జిఎస్‌టిని సరళతరం చేయాలి

GST should be a linear generation

భారత పన్ను సంస్కరణల్లోనే ఇదొక మైలురాయి
జిఎస్‌టిని సులభతరం చేస్తే పురోగతి: ఐఎంఎఫ్

వాషింగ్టన్ : భారత పన్ను సంస్కరణల్లో జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) కీలక మైలురాయి అని, అయితే దీనిని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) అభిప్రాయం వ్యక్తం చేసింది. జిఎస్‌టిలో బహుళ రేటు విధానాలు, ఇతర అంశాల కారణంగా ఫిర్యాదులు, అధికార యంత్రాంగం వ్యయం పెరుగుతున్నాయని పేర్కొంది. వార్షిక నివేదికలో ఈ విషయాలను ఐఎంఎఫ్ వెల్లడించింది. తక్కువ రేటుతో ద్వంద్వ రేటు విధానం, ఎంపిక చేసిన వస్తువులకు ఎక్కువ పన్ను రేటుతో ఒక శ్లాబులో జిఎస్‌టి విధిస్తే మంచి పురోగతి ఉంటుందని, ఆదాయం స్థిరంగా ఉంటుందని ఐఎంఎఫ్ వార్షిక నివేదికలో తెలిపింది.

దేశంలో వస్తువుల పంపిణీ, సేవలపై విధించే పరోక్ష పన్నునే జిఎస్‌టిగా తీసుకొచ్చారు. 2017 జులై 1న జిఎస్‌టి అమల్లోకి వచ్చింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్నులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు జిఎస్‌టి సంస్కరణ చేపట్టారని, ఇది భార త పన్ను సంస్కరణల్లో ఒక మైలురాయి వంటిదని ఐఎంఎఫ్ ప్రశంసించింది. జిఎస్‌టి విధానంలో పలు రకాల పన్ను శ్లాబులతో క్లిష్టంగా ఉందని, జిఎస్‌టి పురోగతిని దెబ్బతీయకుండా విధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. వస్తు సేవలపై పరోక్ష పన్నుల విధానాన్ని తీసుకురావడంలో జిఎస్‌టిది కీలక పాత్ర అని తెలిపింది. భారత్ కాకుండా మరో నాలుగు దేశాలు నాలుగు శ్లాబుల పన్ను రేట్లు విధిస్తున్నాయని వెల్లడించింది.

వ్యాట్ విధిస్తున్న 115 దేశాల్లో 49 దేశాలు ఒకే రేటులో పన్ను విధిస్తున్నాయని, 28 దేశాలు రెండు శ్లాబుల్లో పన్నులు వేస్తున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. భారత్‌లో సున్నా శాతం, 12%, 18%, 28% శ్లాబుల్లో జిఎస్‌టి విధిస్తున్న విషయం విదితమే. ఐఎంఎఫ్ మిషన్ చీఫ్(ఇండియా) రానిల్ సల్గడో మా ట్లాడుతూ, జిఎస్‌టి ఉత్పాదకతను పెంచుతుందని, మధ్యకాలికంగా పటిష్టమైన వృద్ధికి ఊతం అందిస్తుందని అన్నారు. సామాజిక, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం నిధులను పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని అన్నారు.