Home ఎడిటోరియల్ హిందువులకూ మయన్మార్ సెగ

హిందువులకూ మయన్మార్ సెగ

  • అల్లర్లలో మరణించిన 86 మంది

Refugees-Cartoons

రోహింగ్యా ముస్లిమ్ శరణార్థులతో పాటు హిందువులు కూడా మయన్మార్‌నుంచి బంగ్లాదేశ్‌లోకి కాందిశీకులుగా వస్తున్నారు. వారు కూడా రోహింగ్యాల వలెనే తమ దేశంలో హింసాకాండను ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం సాగుతున్న తెగల ఘర్షణల్లో 86 మంది హిందువులు ప్రాణాలు అర్పించారు. ఆ తరువాత బంగ్లాకు హిందు శరణార్థుల తాకిడి పెరిగింది. సుమారు 500 మంది హిందువులు ఇటీవల వేలాది రోహింగ్యా శరణార్థులతో పాటు బంగ్లాలోని కోక్స్ బజార్‌లోకి మయన్మార్ సరిహద్దులు దాటి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ దేశంలో హింసాకాండ పెచ్చు పెరగడాన్ని ఈ పరిణామం సూచిస్తోంది. హిందూగ్రామం కుటు పలాంగ్ నుంచి కూడా పర్వతాలను దాటి రఖైన్ హిందూ శరణార్థులు బంగ్లాదేశ్‌లోకి రావడం పెరిగింది. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు గత 10 రోజులలో మొత్తం 90,000మంది వచ్చారని ఐక్యరాజ్య సమితి అధికారుల అంచనా.
ఇంకా అనేక వేలమంది సరిహద్దులవద్ద ఆహారం, మందులు లేకుండా చిక్కుబడిపోయి ఉన్నారు. రోహింగ్యాలు ఆధిక్యంలో గల మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి వచ్చిన మొత్తం 414 మంది హిందువులు కోక్స్ బజార్‌లోని హిందూ ప్రాంతంలో తలదాచు కొన్నారు. మొత్తం 510 మంది హిందూ శరణార్థులు అక్కడ ఉన్నా రని ఆ ప్రాంతాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టి యన్ ఐక్యతా మండలి అధ్యక్షులు రణదాస్ గుప్తా చెప్పారు. వారిలో 200 మంది స్త్రీ, పురుష బాలవృద్ధులు ఒకే ఒక్క చెక్క గదిలో ఇరు క్కుని గడుపుతున్నట్లు కూడా చెప్పారు.
నల్లదుస్తులు ధరించిన ముసుగు మనుషులు ఆగస్టు 27, 28 తేదీలలో తమ ఇళ్లపై దాడులు చేసి 86 మందిని చంపారని ఆ శరణార్థులు తెలిపారు. మయన్మార్‌లో ఆ ప్రాంతం మంగ్డు జిల్లాలో ఉంది.
తీరం చేరిన ముస్లిం మృత దేహాలు
హిందువులపై దాడి జరిపిన వారిని దర్యాప్తు ద్వారా గుర్తించి శిక్షించాలని రణదాస్ గుప్తా కోరారు. మయన్మార్ తాజా జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో హిందువులు 0.5 శాతం, ముస్లింలు 4.3 శాతం దాకా ఉన్నారు. గత 5 రోజులుగా 54 మంది రోహింగ్యాల మృతదేహాలు బంగ్లాదేశ్ తీరానికి కొట్టుకువచ్చినట్లు కోక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ అలీ హుస్సేన్ విలేకరులకు వెల్లడిం చారు. రోహింగ్యా తిరుగుబాటుదార్లు అనేక పోలీసు స్థావరాలపై జరిపిన దాడులు తిప్పికొట్టడానికి సైన్యం ఎదురుదాడులు జరప డంతో 400 మంది మరణించారు. ఆ తర్వాత ఆగస్టు 25న రఖైన్‌లో హింసాకాండ తాజాగా ప్రజ్వరిల్లింది. మయన్మార్‌లో రఖైన్ అత్యంత పేద రాష్ట్రం. దాదాపు 10లక్షలమంది రోహింగ్యాలకు అది నిలయం.
బౌద్ధుల మెజారిటీలో ఉన్న ఆ దేశంలో దశాబ్దాలుగా రోహింగ్యా లు ఊచకోతలు, తీవ్ర దాడులకు గురయ్యారు. ఆ దేశంలో వారిని పౌరులుగానే భావించరు. వారికి పౌరసత్వం ఇవ్వాలన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా వినపడుతున్న డిమాండ్. వారికి తమ సొంత దేశ మంటూ ఏదీ లేదు. వారిపై భద్రతా బలగాలు సాగిస్తున్న ఏరివేత చర్యలకు బౌద్ధులు కూడా తోడవుతున్నారు. ఆ దాడులను మయన్మార్ తాత్కాలిక అధినాయకురాలు అంగ్ సాన్ సూకీ ఇంతవరకూ ఖండించలేదు. ఆ ప్రభుత్వ ప్రమేయంతోనే రోహింగ్యాలపై హింసా కాండ సాగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
హింసను సూకీ ఖండించాలన్న మలాలా
ఐక్యరాజ్య సమితి రోహింగ్యా శరణార్థుల వార్తలను ఎప్పటి కప్పుడు ప్రపంచానికి వెల్లడిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ విద్యా వేత్త, బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న నోబెల్ శాంతి బహు మతి గ్రహీత మాలాలా యూసఫ్ జాయ్ రోహింగ్యాలపై హింసా కాండను ఖండించాలని ఒక తాజా ప్రకటనలో సాటి నోబెల్ విజేత అంగ్ సాన్ సూకీకి విజ్ఞప్తి చేశారు. చైనాలో జరుగుతున్న ‘బ్రిక్స్’ దేశాల శిఖరాగ్ర సభ సంయుక్త ప్రకటన రోహింగ్యాలపై హింసా కాండను ఖండించింది. భారతదేశానికి కూడా రోహింగ్యా శరణార్థు ల తాకిడి ఉంది. వారందరినీ వెనక్కు పంపేయాలన్న ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉంది. ఆ ఆలోచన మానుకొని, రోహింగ్యా శరణా ర్థులకు మానవతా దృష్టితో ఆశ్రయం కల్పించాలని పలు సామాజిక సంస్థలు కోరుతున్నాయి.
మయన్మార్‌లో సైనికులు, ఆయుధాలు ధరించిన సాధారణ పౌరులు కలిసి రోహింగ్యా ముస్లింలపై మారణకాండ సాగిస్తున్నారు. రోహింగ్యా పురుషులు, మహిళలు, పిల్లలను విచక్షణా రహితంగా మట్టుబెడుతున్నారు. మయన్మార్ హింసాకాండ బాధితులకు ఆహారం, నీరు, మందులు, ఇతర ముఖ్య సరఫరాలను ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థలు అందించడాన్ని ఆ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ముఖ్యంగా రఖైన్‌లోని రోహింగ్యా బాధితులకు సరఫరాలు అంద కుండా చేస్తోంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రోహింగ్యా శరణా ర్థుల పరిస్థితిని జాతీయ భద్రతా మండలి నెలవారీ సమావేశంలో సమీక్షించారు. ఆ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు, త్రివిధ దళాల అధిపతులు, పోలీసు గూఢచారి సంస్థల ఉన్నతాధి కార్లు పాల్గొన్నారు.
అమాయక పౌరులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని బంగ్లా ప్రభుత్వం మయన్మార్‌ను కోరింది. భారీ ఎత్తున ప్రజలు సరిహద్దులు దాటి తమ దేశంలోకి వలస రావడాన్ని అరికట్టాలని కూడా బంగ్లా సూచించింది. ఉమ్మడి భద్రతా కట్టుదిట్టాలు సాగించేం దుకు ప్రతిపాదించింది. మయన్మార్ సైనిక హెలికాప్టర్లు ఆగస్టు 27, 28, సెప్టెంబర్ 1న పదేపదే తమ గగన తలాన్ని అతిక్రమించినట్లు కూడా బంగ్లా ఆరోపించింది. ఇది మంచి ఇరుగు పొరుగు సంబంధా లకు హానికరమని పేర్కొంది. రఖైన్‌లో భద్రతా బలగాల అత్యాచారా లను తక్షణమే నిరోధించాల్సిన బాధ్యత మయన్మార్‌కు ఎంతైనా ఉంది.

– ఎస్.ఎస్.