Home మహబూబ్‌నగర్ కోడిగుడ్డు కొండెక్కింది!

కోడిగుడ్డు కొండెక్కింది!

eggs

రికార్డు స్థాయికి చేరిన ధర  హోల్‌సేల్‌లో రూ.4.66, రిటైల్‌లో రూ.5.25

మహబూబ్‌నగర్ అర్బన్ : గతంలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో గుడ్డు ధర రూ.4.66 ఉండగా రిటైల్ లో రూ.5.25 కాగా గ్రామీణ ప్రాంతాల్లో కిరాణషాపుల్లో గుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 పలుకుతోంది. మండుతున్న కూరగాయల ధరలతో బెంబెలెత్తిపోతున్న సామాన్యుడికి మరో వైపు గుడ్డు ధర సైతం పెరగిపోవడంతో ఆర్థిక భారం మీద పడుతుంది. గడిచిన ఆరు నెలలుగా కోడి గుడ్డు ధర ఎగబాకుతూ వస్తోంది. గత నెల వరకూ గుడ్డు హోల్‌సేల్‌లో రూ. 3.06 ఉండగా, నవంబర్ మొదటివారంలో రూ.4.27కు పెరిగింది. ప్రస్తు తం అది రూ.4.66కు చేరింది. రిటైల్ మార్కెట్‌లో రూ.4 ఉన్న గుడ్డు ధర ఒక్కసారిగా రూ.5.25కు ఎగబాకింది. దీం తో చిల్లరవర్తకులు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాణషాపు నిర్వాహకులు కోడి గుడ్డును రూ.6 నుంచి రూ.7 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి ఏటా చలికాలం సీజన్‌లో గుడ్డు ధర పెరగడం సాధారణమైనప్పటికీ ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయిలో గుడ్డు ధర ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. చలికాలంలో ప్రారంభంలోనే గుడ్డు ధర ఇలా ఉంటే రానున్న మూడు నెలల్లో ఇంకెంత ధర పెరుగుతుందోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజులుగా ఆకుకూరలు, కూరగాయల ధరలు మండిపోతుండడం తో ప్రత్యామ్నాయంగా కోడిగుడ్డు వైపు చూద్దామంటే గుడ్డు ధర సైతం విపరీతంగా పెరగడంలో ఏమీ తోచక సామాన్యుడు ఆర్థిక భారాన్ని మోస్తూ తప్పనిసరి పరిస్థితిలో కాలాన్ని వెల్లదీస్తున్నారు. గత మూడేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం బాగా దెబ్బతినడం, కోళ్లకు రోగాలు రావడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడంతో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోవడంతో వ్యాపారులు పౌల్ట్రీ రంగంపై ఆసక్తి కనబరచడం లేదు. చిన్న వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారానికి దూరం కాడంతో ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది.