Home తాజా వార్తలు సూర్యాపేట కలెక్టరేట్ భూసేకరణపై పిల్ కొట్టివేత

సూర్యాపేట కలెక్టరేట్ భూసేకరణపై పిల్ కొట్టివేత

The High Court dismissed the public litigation

ఓట్ల పోరాటానికి కోర్టుల్ని వేదికగా చేయవద్దు : హైకోర్టు

రాజకీయాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని హైకోర్టు వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యాపేట కలెక్టర్ కోసం భూసేకరణ చేయడాన్ని సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఓట్లు ద్వారా పోరాడాల్సిన పెద్దలు కోర్టుల్ని వేదికగా చేసుకుని పిల్ ద్వారా సాధించాలనుకోవడం సబబుకాదని ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం వెలువరించిన తీర్పులో వ్యాఖ్యానించింది. పిటిషనర్ చక్కిలం రాజేశ్వర్‌రావు ఒక జాతీయ పార్టీ నాయకుడని పిల్‌లో పేర్కొనకపోవడాన్ని బెంచ్ తప్పుపట్టింది. చక్కి లం పిల్‌లో ఇంప్లీడ్ అయిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిటిషన్‌ను కూడా బెంచ్ కొట్టివేసింది. సూర్యాపేటకు సమీపంలోనే ప్రభుత్వ భూములు ఉన్నా వాటిని కాద ని పట్టణానికి దూరంగా కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేట్ భూముల్ని సేకరించడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు.

సూర్యాపేట జిల్లా ఆవిర్భావానికి ముందే మునిసిపల్ చైర్మన్ భర్త శ్రీసాయి డెవలపర్స్ పేరుతో భూమి కొనుగోలు చేశారు. కలెక్టరేట్‌కు సేకరించిన పాతిక ఎకరాల భూమిలో చైర్మన్ భర్తకు చెందిన భూమి 8 ఎకరాలు మాత్రమే. మిగిలిన భూములను ఇతరుల నుంచి సేకరించారు.   మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి చెందిన వ్యక్తులకు చెందిన భూముల విలువ పెంపు ద్వారా వారికి లబ్ది చేకూర్చేందుకే సూర్యాపేటకు దూరంగా భూమిని కొనుగోలు చేశారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాదన కూడా ఆమోదయోగ్యంగా లేదు. రాజకీయంగా ఉన్న వ్యతిరేకత ఈ తరహా కేసులు వేసి కోర్టుల నుంచి సాధించాలనుకోవడం ఆమోదయోగం కాదు. అందుకే చక్కిలం దాఖలు చేసిన పిల్‌ను, కోమటిరెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నాం.. అని బెంచ్ తన తీర్పులో పేర్కొంది.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్ధేశంతో 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేశా రు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా ఏర్పాటు అయింది. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం కోసం కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేటు భూముల్ని సేకరించి నిర్మాణాలు చేయాలని సంకల్పాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు చేసిన న్యాయపోరాటంలో దారుణంగా ఓడిపోయారు. పిల్ దాఖలు చేసిన చక్కిలం రాజేశ్వర్‌రావు చేసి న వాదన వీగిపోయింది.

రాజకీయంగా తనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని చెప్పకపోవడాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు ఆది నుంచి అభ్యంతరం చెప్పారు. పిల్ దాఖలు చేసేప్పుడు పాటించాల్సిన న్యాయపరమైన నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తినన్న విషయాన్ని గోప్యంగా ఉంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడాన్ని హైకోర్టు కూడా తన తీర్పులో సమర్ధించింది. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధికార ప్రతినిధిగా చక్కిలం వ్యవహరిస్తున్న విషయాన్ని ఫేస్‌బుక్‌లోని అంశాన్ని ఆయన బెంచ్ దృష్టికి తీసుకురావడం కీలక అంశంగా చెప్పవచ్చు. ఆ విషయాన్ని పిల్‌లో ప్రస్తావించలేదని, కేవలం రాజకీయ ఉద్ధేశంతోనే పిల్ వేశారనే అదనపు ఏజీ వాదన న్యాయపరంగా నిలబడింది. సూర్యాపేట బస్టాండ్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే కలెక్టరేట్ నిర్మాణం చేస్తున్నామని, భవిష్యత్‌ను గమనంలోకి తీసుకుని విశాలం ప్రాంతంతో కలెక్టరేట్ నిర్మాణం చేయడం వల్ల ప్రజలకే మేలు జరుగుతుందని, పిల్‌ను కొట్టేయాలన్న ప్రభుత్వ వాదన హైకోర్టులో గెలిచింది. ఇదే విషయాన్ని హైకోర్టు విచారణ సమయంలోనే.. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తినని ఎందుకు పిల్‌లో పేర్కొనలేదని బెంచ్ కూడా ప్రశ్నించింది. రాజకీయంగా సంబంధం ఉన్న వ్యక్తి పిల్ వేయవచ్చు. అయితే ఆ విషయాన్ని పిల్‌లో చెప్పకపోవడం ఎంతమాత్రం సరికాదు.. అని కూడా తేల్చి చెప్పింది.

కలెక్టరేట్ కోసం మొదటి రెండు ప్రతిపాదనల్ని పక్కకు పెట్టి మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి చేసిన సిఫార్సులకు అనుగుణంగా మూడో ప్రత్యామ్నాయమైన కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని భూముల్ని సేకరించడం చెల్లదంటూ మాజీ మంత్రి, అసెంబ్లీ బహిష్కృత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను కూడా హైకోర్టు బెంచ్ కొట్టివేసింది. సూర్యాపేట జిల్లా ఏర్పాటుకు ముందే మున్సిపల్ చైర్మన్ భర్త శ్రీసాయి డెవలపర్స్ పేరుతో భూమి కొన్నారని, జిల్లా కలెక్టరేట్ కోసం భూసేకరణ చేయాలనే నిర్ణయానికి అటూ ఇటూగా ఆ భూముల్ని కొనలేదని హైకోర్టు తేల్చింది. పైగా, మున్సిపల్ చైర్మన్ భర్తకు చెందిన భూములు ఎనిమిది ఎకరాల్ని మాత్రమే సేకరిస్తే మిగిలిన 17 ఎకరాలు ఇతరులవేనని హైకోర్టు పేర్కొంది. ఈ ప్రజాహిత వ్యాజ్యాల వెనుక వేరే ఉద్ధేశాలు ఉన్నాయని స్పష్టం అవుతోందని బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది. మున్సిపల్ చైర్మన్ భర్త కొనుగోలు చేసిన భూములకు విలువలు పెరిగేందుకే కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలో భూముల్ని సేకరించారనడంలో అర్ధం లేదని స్పష్టం చేసిం ది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఈ విధంగా రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మార్చేందుకు పిటిషనర్లు ప్రయత్నాలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.. అని హైకోర్టు బెంచ్ తీవ్ర ఆక్షేపణ తెలియజేసింది. సుదీర్ష వాదప్రతివాదనలు ముగియడంతో ఈ నెల 7న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.