Home ఎడిటోరియల్ కార్మికుల కవచానికి తూట్లు

కార్మికుల కవచానికి తూట్లు

Labour-Cartoon

దేశంలో అమలులో ఉన్న అన్ని కార్మిక చట్టాలస్థానే కేవలం నాలుగు కార్మిక కోడ్‌ల(నియమావళులు)ను తేవాలని కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సంకల్పించింది. వాటిలో మొదటిది వేతనాల కోడ్. 1936 వేతనాల చెల్లింపు చట్టం, 1948 కనీస వేతనాల చట్టం, 1965 బోనస్ చెల్లింపు చట్టం, 1976 సమాన ప్రతిఫలం చట్టాలను కలగలిపి వేతన కోడ్ రూపొందించదలచారు. ప్రస్తుతం గల కార్మిక ప్రయోజనాలు ఏమైనా ఉంటే అవన్నీ ఈ సంస్కరణ వల్ల తుడిచిపెట్టుకుపోతాయని యూనియన్లు ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రతిపాదనను అవి గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ‘జాతీయ కనీస వేతన వ్యవస్థ’ వంటి హామీలు నెరవేరకపోవడంతో కార్మికుల ఆందోళన సవ్యమైనదే అని న్యూస్ క్లిక్ సంస్థ అభిప్రాయపడింది. దేశంలో కార్మికుల పట్ల యాజమాన్యాలు అనుసరిస్తున్న నిర్లక్షాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం వారిని మరింత అభద్రతలోకి నెట్టే సంస్కరణలు తేవడాన్ని కార్మిక సంఘాలు నిరసిస్తున్నాయి.
అహ్మదాబాద్‌లో ‘అడ్వాన్స్ డైస్టఫ్ ఇండస్ట్రీస్’ అనే పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి కేంద్రంలో ఇటీవల ఐదుగురు ‘రోజువారీ కార్మికులు’ మరణించారు. ఆ కేంద్రాన్ని శుభ్రపరిచే పనిలో విషవాయువులకు గురవడంవల్ల వారు మరణించడంతోపాటు మరి ఇద్దరు కూలీలు ప్రమాదకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఆ పని సబ్ కాంట్రాక్టర్ ద్వారా వారికి పురమాయించబడింది. వారికి ఎటువంటి భద్రతా సౌకర్యం ఉండదు. వారి రక్షణకు తగిన జాగ్రత్తలూ తీసుకోరు. ట్యాంక్ నుండి మంటలు వెలువడుతున్న సమయంలోనే కార్మికులను పనిలోకి దింపారు. ఆ మంటలను ఆర్పేసే కృషి ఏమీ చేయకపోవడం గమనార్హం. ఆ పరిశ్రమను పారిశ్రామిక భద్రతా వ్యవహారాల డైరెక్టర్ సకాలంలో తనిఖీ చేశారా అన్న ప్రశ్నకు జవాబు లేదు. కార్మికుల భద్రతను గాలికి వదిలేసి కేవలం ఖర్చులు మిగుల్చుకోడానికి యాజమాన్యాలు ఆత్రపడుతున్నాయని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
చత్తీస్‌గఢ్ భాటాపారాలో అంబుజా సిమెంట్ కర్మాగారంలో ఇటీవల ఇద్దరు కార్మికులు ఒక ప్రమాదంలో మరణించారు. అది లాపర్జ్ హోల్సిమ్ గ్రూపుకు చెందిన కర్మాగారం. వారు మిల్లు క్రషర్లను తనిఖీ చేస్తుండగా అవి హఠాత్తుగా పని చేయడం ప్రారంభించడంతో ఆ ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించారు. ఈ ప్రమాదంలో మరి ముగ్గురు కార్మికులకు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై అంతర్జాతీయ కార్మిక సంఘాల ఫోరం ‘ఇండస్ట్రీ ఆల్’ స్పందించి కేసు ను కంపెనీ దృష్టికి తెచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని కంపెనీ తెలిపింది. అటువంటి ప్రమాదాలకు కార్మికులదే బాధ్యత అన్నట్టు కంపెనీ యాజమాన్యం పేర్కొంది. 2013లో అదే కర్మాగారం లో భవనంకూలి ఐదుగురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. సమ్మె కాలానికి కార్మికుల వేతనాలు కోతకోయడం యాజమాన్యాలకు మామూలు. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టు అలా వేతనాల కోతలు తప్పని ఆదేశించింది. ఒకనొక సమ్మెలో అధ్యాపకులు, ప్రభుత్వ సిబ్బందికి అనుకూలంగా ఆ హైకోర్టు తీర్పునిచ్చింది. సమ్మె కాలానికి వేతనం కోత కోయకపోతే ప్రతి శనివారం విధులకు హాజరై పని చేస్తామని కార్మికులు హామీని ఇచ్చారు. పాత పెన్షన్ పథకం కొనసాగించాలని కోరు తూ ప్రభుత్వ విద్యాసంస్థల సిబ్బంది ఇటీవల సమ్మె చేశారు. 7వ పే కమిషన్ సిఫార్సులపై తీసుకున్న చర్యలు అక్టోబర్ 13లోగా వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మహారాష్ట్రలో 2లక్షలమంది అంగన్‌వాడీలు చాలాకాలం నుండి సమ్మె చేస్తున్నారు. సిబ్బందికి రూ.1500, హెల్పర్లకు రూ.1000 చొప్పున జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినా వారు సమ్మతించడం లేదు. కనీస వేతనం రూ.7000 ఇచ్చి తీరాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారి సమ్మెను భగ్నం చేయడానికి ప్రత్యామ్నాయ కార్మికులను ఎంపిక చేయవలసిందిగా జిల్లా అధికారులను ప్రభుత్వం కోరుతోంది. రైతుల రుణమాఫీ ప్రకటించినందువల్ల తమ వద్ద నిధులు లేవని కూడా ప్రభుత్వం సాకుచూపుతోంది.
నైవేలీ లిగ్నైట్ కర్పొరేషన్ (ఎన్‌ఎల్‌సి)గని త్రవ్వకం కార్యకలాపాల వల్ల భూములను కోల్పోయిన కార్మికుల కుటుంబాలలో సగం మందికి ఉద్యోగాలు కల్పించాలని సంస్థను మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఎన్‌ఎల్‌సి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రిట్ పిటిషన్‌పై కోర్టు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చింది. కొత్తగా కాంట్రాక్ట్ కార్మికులను తీసుకోడానికి సంబంధించిన టెండర్‌ను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కార్మికులు కోరారు. అంతర్జాతీయంగా కూడా కార్మికుల పరిస్థితి అంత బాగా లేదు. ఫ్రాన్స్ అంతటా కార్మిక సంస్కరణల చట్టాలను నిరసిస్తూ సమ్మెలు చేస్తున్నారు. అధ్యక్షుడు మాక్రోన్ ఈ తీవ్ర సంస్కరణల చట్టాలను తెచ్చారు.
మయన్మార్ నాయకురాలు అంగ్ సాన్ సూకీకి గతంలో ఇచ్చిన అవార్డును బ్రిటన్ కార్మిక సంఘాల్లో అతిపెద్దదయిన ‘యూనిజన్’ ఇటీవల ఉపసంహరించింది. ఆ దేశంలో రోహింగ్యాల అణచివేత వలన తలెత్తిన మానవ హక్కుల సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అనేక బ్రిటన్ సంస్థలు ఆమెకు గతంలో ఇచ్చిన అవార్డులను వెనక్కి తీసుకోవాలని సంకల్పించాయి. ఆమె రాజకీయ ఖైదీగా ఉన్న కాలంలో ఇచ్చిన అవార్డులు అవి.
ఐ ఫోన్ విప్లవం వచ్చాక తొలి 10 ఏళ్లలో కార్మిక హక్కులను కాలరాయడం కూడా తీవ్ర స్థాయిలో జరిగిందని కొందరు కార్మికులు వాపోయారు. ఆధునికత, అణచివేత పక్కపక్కనే కొనసాగుతున్నట్లు వారు చెప్పారు. ఉదాహరణకు ప్రపంచంలోని అతిపెద్ద చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్ కాన్‌లో 2010లో17 మంది కార్మికుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. వారి ఆత్మహత్యలు ఆపడానికి చిత్తిశుద్ధితో పని చేయకుండా పైపై చర్యలను ఫాక్స్ కాన్ తీసుకుంది. మితిమించిన దోపిడీయే ఆత్మహత్యలకు హేతువు కాగా కార్మికులు భవనాల పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యలు చేసుకోకుండా భారీ నెట్లను యాజమాన్యం అమర్చింది. ఐదేళ్లకిందట అమెరికాలోని చికాగోలో టీచర్స్ యూనియన్‌కు చెందిన 10,000మంది అధ్యాపకులు పోరాటం జరిపారు. చికాగో పాలనా యంత్రాంగంపై పోరాటంలో ఆ యూనియన్ గెలిచింది. ప్రపంచం ఒక ప్రక్క ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ఉరకలు వేస్తున్నా, మరో ప్రక్క కార్మిక లోకంలో దోపిడీ, అసమానతలు, అభద్రత పేట్రేగుతూ మానవ జాతి సాధించిన పురోగతిని వెక్కిరిస్తున్నాయి.

– వెంకట్ టి, శ్రీవిద్య తాడేపల్లి,
థామస్ మాన్యుయల్