Home నిర్మల్ ఘనంగా ఈద్ ఉల్ ఫిరత్

ఘనంగా ఈద్ ఉల్ ఫిరత్

 The holy Ramadan celebrations were with great honor

హాజరైన రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న

పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలను ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం రాత్రి నెలవంక కనబడటంతో సందడి వాతావరణం నెలకొంది. శనివారం జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చి సాంప్రదాయ పద్ధతిలో నమాజ్ చేశారు. ఈ సందర్బంగా మత పెద్ద రంజాన్ సందేశాన్ని వినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గత 30 రోజుల నుండి నియమనిష్టలతో ఉపవాస దీక్షలు(రోజా) చేపట్టి శనివారం పండ గ నాటికి ఈ ఉపవాస దీక్షలు విరమించజేశారు. అలాగే రంజాన్ వేడుకలకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థన కోసం ఈద్‌గాంలో గల దర్గాలో భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే ముస్లిం సోదరులు కులమతాలకు అతీతంగా ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు. వివిధ మసీద్‌ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్‌గాం దర్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకలకు రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా ఎస్‌పి శశిధర్‌రాజు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దర్గాకు వచ్చిన మంత్రిని, మున్సిపల్ చైర్మన్, ఎస్‌పిలకు ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికి అలాయ్‌బలాయ్ చెప్పుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ హిందు, ముస్లింలు సోదరభావంతో మెలగాలని, ఇలాగే ప్రతీ పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ముస్లింల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మసీదుల వద్ద రంజాన్ పండగను పురస్కరించుకొని పటిష్టమైన భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రార్థనలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని ఆయన అన్నారు. అనంతరం ప్రార్థనలో చిన్నారులకు మిఠాయి తినిపించి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, డిఎస్‌పి మనోహార్‌రెడ్డి, రూరల్ సీఐ జీవన్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ : పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం రాత్రి నెలవంక కనబడటంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. శనివారం జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రంలోని ఈద్గా మైదానానికి ముస్లీంలు పెద్ద ఎత్తున తరలివచ్చి సాంప్రదాయ పద్ధతిలో నమాజ్ చేశారు. ఈ సందర్బంగా మత పెద్ద రంజాన్ సందేశాన్ని వినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈద్గా పరిసర ప్రాంతం మొత్తం కోలాహలంగా, రద్దీగా మారింది. రంజాన్ పండగను పురష్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానం వద్దకు మంత్రి జోగు రామన్న చేరుకొని ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ముస్లీం సోదరులు మంత్రిని ఆలింగనం చేసుకుని పండగ ఆనందాన్ని పంచుకున్నారు. రంజాన్ ప్రార్థనలు జరిపే ఈద్గాలు, మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేశా రు. మరోవైపు ప్రార్థనల సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌పి విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు డిఎస్‌పి నర్సింహా రెడ్డి, ప్రత్యేకంగా భద్రతలను పర్యవేక్షిస్త్తూ ఈద్గాతో పాటు అన్ని మసీదుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, సిసి కెమెరాలు, డేగ కన్నులతో పోలీసుల పహారా కాశారు. ఈ సందర్బంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ రంజాన్ మాసంలో పవిత్ర ఖురాన్ అవతరించిందని పేర్కొన్నారు. దివ్య ఖురాన్‌లోని సారాంశాన్ని అందరు గ్రహించాలని సూచించారు. నెలరోజుల పాటు రోజు వ్రతంలో ఉపవాస దీక్షలను ఆచరించటం వలన మనుషుల్లో మార్పు వస్తుందన్నారు. రంజాన్ మాసంలో చేసే ప్రార్థనల వలన మనసును అదుపులో ఉంచుకోవటంతో పాటు, మనో నిగ్రహం పెరుగుతుందన్నారు. ఈ సందర్బంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ముస్లీం సోదరులందరికి రం జాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. ముస్లీం సోదరులందరు ఆనందోత్సాహాల మధ్య రంజాన్ వేడులకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా అందరూ పండుగలను జరుపుకోవటం మన సాంప్రదాయమన్నారు. ముస్లీం ల అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, గతంలో ఎన్నడు లేని విధంగా సిఎం కేసిఆర్ ముస్లీంల అభివృద్దికి వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. అన్ని మతాల ప్రజలు కలిసికట్టుగా బంగారు తెలంగాణకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.