Home బిజినెస్ ఉపఖండంలోనే భారీ వేదిక

ఉపఖండంలోనే భారీ వేదిక

 తొలిసారిగా మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీ కార్యక్రమం దేశానికే గర్వకారణం

ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికామ్ మార్కెట్‌గా భారత్

‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా

IND-Mobile-Congressన్యూఢిల్లీ : భారత్ తొలిసారిగా మొబైల్ ఇంటర్నెట్, టెక్నాలజీ కార్యక్రమాలకు ఆతిథ్యం వహించడం ఎంతో గర్వించదగిన విషయమని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా అన్నారు. బుధవారం ఢిల్లీలో ప్రగతి మైదాన్ వద్ద ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసి)ను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ, ఉప ఖండంలో మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీ రంగాలకు ఇది భారీ వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ప్రస్తుతం 1.2 బిలియన్ వినియోగదారులతో ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికామ్ మార్కెట్ అని అన్నారు. గత నాలుగేళ్లలో ఈ రంగంలో పెట్టుబడులు 220 శాతం పెరిగాయని అన్నారు. టెలికామ్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షలు ఉపాధి అవకాశాలు ఏర్పడినాయని అన్నారు. 100 కోట్ల మంది భారతీయులు వరల్డ్ వైడ్ వెబ్‌కు కనెక్ట్ కావడం భారత్‌కు అతిపెద్ద అవకాశమని అన్నారు. ప్రజల జీవితాల్లో డిజిటల్ తప్పనిసరిగా మారిందని అన్నారు. 5జి దిశగా కూడా భారత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం నిధులను కూడా కేటాయించిందని అన్నారు. టెలికాం పరిశ్రమ డిజిటల్ ఇండియా ప్రొగ్రామ్‌కు వెన్నుముకగా ఉందని సిన్హా తెలిపారు. 2020 కల్లా 6 ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమిస్తుందన్నారు. తొలిసారి భారత్ మొబైల్, ఇంటర్నెట్, టెక్నాలజీ ఈవెంట్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి టెలికామ్ కార్యదర్శి అరుణ సుందర రాజన్, టెలికామ్ పరిశ్రమ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు. ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, మనం డిజిటల్ విప్లవాన్ని కోల్పోమని.. ఐటీ పాలసీ, కొత్త ఇకామర్స్ పాలసీఖరారు చేశామని, కొత్త ఐఒటి పాలసీ త్వరలో తెస్తామని అన్నారు. డిజిటల్ వృద్ధికి దోహదం చేస్తూ.. డిజిటల్ ఇండియాను విజయవంతం చేస్తున్న మొబైల్ కంపెనీల సహకారాన్ని అభినందించారు.
ఒకే వేదికపై ఆ ముగ్గురు దిగ్గజాలు
టెలికాం మార్కెట్‌లో విపరీతమైన పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఒకరిని మించి మరొకరు వ్యూహాలతో తరచూ పోటీ పడుతూ కస్టమర్లకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ఒకరినొకరు విమర్శించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే వీరు మీడియా ముఖంగా పోటీ పడడమే తప్ప ప్రత్యక్షంగా కలుసుకునే సందర్భాలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు జరిగే మొబైల్ కాంగ్రెస్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, ఐడియా అధినేత కుమార్ మంగళం బిర్లాలు ఒకే వేదిక పైకి వచ్చారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఈ సదస్సులోనే వొడాఫోన్ గ్రూప్ సిఇఒ విట్టోరియో కొలవో, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, టెలికాం మంత్రి మనోజ్ సిన్హాలు కూడా పాల్గొన్నారు. బుధవారం నుంచి సెప్టెంబర్ 29 వరకు ఈ సదస్సు జరుగనుంది.