Home కలం భక్తికవుల మానవతావాదం

భక్తికవుల మానవతావాదం

Sant-Ravidas

భారతదేశ తాత్విక ఉద్యమాల్లో, భక్తికవులదొక అధ్యాయం. డా॥ బి.ఆర్.అంబేడ్కర్ ఉత్తేజం పొందినవారిలో భక్తికవులు ముఖ్యులు. వారి తండ్రి కబీర్ శాఖవారు. సంత్వ్రిదాస్ కూడా కబీర్ వంటివాడే. బౌద్ధం అశోకుని కాలం వరకు భారతదేశంలో ప్రధాన తత్వంగా వెలుగొందింది. సౌభ్రాతృత్వాన్ని, స్వేచ్ఛ, ప్రేమ, జ్ఞానం, సమానతాభావన ఆనాడు వ్యాప్తిచెందాయి. భారతదేశంలోనే గాక చైనా, బర్మా, సిలోన్, టిబెట్, మలేషియా దేశాలకు కూడా బౌద్ధం విస్తరించింది. అశోకుడు 84 వేల స్థూపాలను నిర్మించటం ద్వారా బౌద్ధం చారిత్రక నేపథ్యాన్ని రూపొందించుకుంది. హర్షవర్ధనుడు కూడా బౌద్ధాన్ని వ్యాప్తిచేశాడు.
క్రీ.శ. 1030కంతా అటు హిందూ, ఇటు ముస్లీం హింసావాదాల వలన బౌద్ధానికి మనుగడ లేకుండాపోయింది. ఈ దశలో అణగారిన కులాలకు బాసటగా నిలిచిందే భక్తి ఉద్యమం. నిజానికి బౌద్ధం అంతరించాక అది ఇస్లాం యుగంగా ప్రకటించ బడింది. డా॥ బి.ఆర్.అంబేడ్కర్ బౌద్ధాన్ని నాశనం చేయడంలో హిందూ హింసావాదం పాత్ర ఎంత వుందో ముస్లిం సామ్రాజ్యవాదం పాత్ర కూడా అంతే ఉందని చెప్పారు. బ్రాహ్మణవాదం బౌద్ధాన్ని పారద్రోలడంలో కర్కశపాత్రను నిర్వహించింది. అయితే ఈ పరిణామాల మధ్య భక్తి కవుల పాత్ర అద్వితీయమైంది. ఉత్తర భారతదేశంలో ఏర్పడిన ఈ నిర్గుణ భక్తిశాఖ, సామాజిక ఐక్యత, భావావేశ అభివ్యక్తి, మత సహన సౌభ్రాతృత్వాలను పురికొల్పాయి. అంతేకాక హిందూ బ్రాహ్మణవాదంలో వున్న వర్ణ, కులాధిపత్యాన్ని భక్తికవులు వ్యతిరేకించారు. ఇందులో సంత్‌రావిదాస్ పాత్ర అద్వితీయమైంది. బౌద్ధం తరువాత వృత్తికారులను, శ్రామికులను, దళితులను భక్తికవులే ఆకర్షించారు. దళితులు ముఖ్యంగా భక్తికవుల గానానికి ముగ్ధులయ్యారు. సంత్వ్రిదాస్ అస్పృశ్యతకు వ్యతిరేకంగా, కులానికి వ్యతిరేకంగా, గొంతెత్తి బోధించాడు. ఆయన నిర్గుణభక్తి ఉద్యమంలో క్రింది కులాల నుండి పైకులాల వరకు అందరూ చేరారు. దేవుడి ముందు అందరూ సమానులే అని భక్తి ఉద్యమకారులు ఇచ్చిన పిలుపుకు బ్రాహ్మణ పురోహితవర్గం కకావికలైంది. దేవుణ్ణి ముందుకు పెట్టుకొని వీరుచేసిన పోరాటం క్రింది శ్రేణుల్లో కదలికను తెచ్చింది. రవిదాస్, కబీర్, నానక్ వంటి వారి సందేశాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చాయి. దేవుడే అందరు మానవుల సృష్టికర్త అయితే, ఆ దేవుడి ముందు అందరూ సమానులే కదా అని వీరు నిలదీశారు. సుఖభోగాల పురోహిత వర్గానికి భిన్నంగా వీరి నియమనిష్టలతో జీవించారు. వీరి నిరాడంబరత జనాన్ని ఆకట్టుకొంది. మనిషిలో వ్యక్తిత్వం లేనిదే రాణించలేడని వీరు ఆచరించి నిరూపించారు. ముఖ్యంగా సంత్వ్రిదాస్ ఆథ్యాత్మిక సన్యాసిగానే శూద్రుల్లో, వృత్తికారుల్లోను, అస్పృశ్యుల్లోను తన భక్తి ఉద్యమాన్ని నడిపించాడు. వారి సాంఘిక విముక్తి కోసం ఎలుగెత్తాడు. లక్షలాది మంది సాంఘికంగా, కులపరంగా అణగద్రొక్కబడిన ప్రజలు ఆయనను అనుసరించారు. అది రవిదాస్ పంత్‌గా ప్రసిద్ధిచెందింది. బెనారస్‌లో పుట్టిన ఒక చమార్‌గా ఆయన ప్రకటించుకొన్నాడు. తన అనుచరులకు దేవుణ్ణి చేరడానికి మధ్యవర్తులు అక్కరలేదు అని ప్రకటించాడు. భక్తి మార్గం ఒక్కటే దేవుడి దగ్గరకు చేర్చుతుంది అని కూడా నివేదించాడు.
సంత్ రవిదాస్ 1450లో పుట్టి 1520 వరకు జీవించి ఉంటాడని చరిత్రకారులు భావిస్తున్నారు. సామాన్య జనమేకాక, కృష్ణుని ఆరాధకురాలైన అంత:పురవాసి మీరాబాయి ఆకర్షితు రాలైంది. ఎందరో సంప్రదాయ బ్రాహ్మణులు సైతం రవిదాస్‌ను వెంబడించారు. ఈయన పదాలు బనారస్ దాటి ఉత్తర ప్రదేశ్, బీహార్, పంజాబ్, గుజరాత్‌కు ఆనాడు ప్రవహించాయి. కబీర్ సంత్ రవిదాస్‌ను అభినందించారు. పంజాబ్‌లోని శిక్కులు వారి మత బోధనల్లో రవిదాస్ పదాలు చదువుతారు. గురుగోవింద్ సాహెబ్ మీద రవిదాస్ ప్రభావం బలంగా పడింది. పంజాబీలోని కవుల మీద, పాటగాళ్ళ మీద, సన్యాసుల మీద, భక్తుల మీద రవిదాస్ ప్రభావం నిశితంగా వుందంటే ఆయన పదాల్లోని శక్తి, వాదనాపటిమ ఎంత శక్తివంతమైనవో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక దళితుల్లో పుట్టి భక్తికవిగా, ఒక ప్రవక్తగా ఎదగడానికి ఆయన చేసిన పోరాటం ఈనాటికీ దళితులకు ఒక స్ఫూర్తి. హిందూమతంలో బయటవుండి యుద్ధం ఎంత కష్టమో లోనవుండీ యుద్ధం అంతే కష్టం. ఆయన కవితల్లోని సందేశం, ప్రేమ, శాంతి సమానతలు ఇప్పటికి ప్రజల హృదయాల్లో, మెదడుల్లో అద్భుతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. 1900 సంవత్సరం అలహాబాద్‌లో మొదట రవిదాస్‌వాణి ప్రచురించబడింది. అప్పటి నుండి రవిదాస్ మీద అనేక సంకలనాలు, పరిశోధనలు వస్తూనే వున్నాయి. పరిపూత ప్రవర్తనతో ఆయన చాలా గౌరవాన్ని సమకాలీనంలో పొందినట్లు తెలుస్తుంది. అదే గౌరవం ప్రజల మీద ఆయనకు చివరిదాక వుంది. రవిదాస్ అనుచరులుగా వచ్చిన ప్రియాదాస్, అనంతదాస్, చేతన్‌దాస్ గొప్ప ప్రచారం చేశారు. ఆయన జీవితం మీద పరిశోధించిన రామానందుని శిష్యుల్లో ఒకరని రవిదాస్‌ను గూర్చి భావిస్తున్నారు. కహన్‌సింగ్ అభిప్రాయంలో ఈయన కబీర్ కాలంలోనే వున్నాడు. మన చరిత్రకారులు సమాజాన్ని పునాది నుండి మార్చిన సామాజిక విప్లవకారుల్ని, వైతాళికులను నిర్లక్ష్యం చేశారు. సామ్రాజ్యాధినేతలనే వారు కొనియాడారు. గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం నుండి రవిదాస్ మీద పరిశోధనలు జరిపిన దర్శన్‌సింగ్ ఇలా అన్నారు. 1415 నుంచి 1575 వరకు రవిదాస్ యుగంగా భావించవచ్చును. సంత్వ్రిదాస్ కాలం మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆచార్య పృథ్వీసింగ్ ఆజాద్ ఒక అభిప్రాయం చెప్పారు. ఈయన బాబూ జగ్జీవన్‌రావ్‌ుకు దగ్గరవాడు. ఈయన అభిప్రాయంలో సంత్వ్రిదాస్ 151 సంవత్సరాలు బ్రతికాడు. అనగా క్రీ.శ. 1433 నుండి 1584 వరకు అని, అయితే ఇంత దీర్ఘకాలం రవిదాస్ జీవించి వుండటం అసాధ్యమని మిగిలిన పరిశోధకులు తేల్చారు. అనేక చర్చల తరువాత సంత్ రవిదాస్ కబీర్‌కు, సమకాలికుడని పరిశోధకులు తేల్చారు. డా॥ కలాసింగ్ బేడీ రామానందుడి కాలాన్ని క్రీ.శ. 1400 నుండి 1470 వరకని, కబీర్‌కాలం క్రీ.శ. 1398 నుండి 1518 వరకని తేల్చారు. డా॥ ఎ.ఎల్.శ్రీవాత్సవ కబీర్ క్రీ.శ. 1440 నుండి 1510 వరకని చెప్పారు. ఏదిఏమైనా 1445 నుండి 1575 వరకు జీవించారు అనేదాన్ని ఎక్కువమంది అంగీకరించారు. గురుఅర్జున్‌దేవ్ ‘ఆదిగ్రంథ్’ సంకలనంలో సంత్ రవిదాస్‌వి 49 పదాలు చేర్చారు. అతడు ఈ గ్రంథాన్ని క్రీ.శ. 1599-1604 మధ్యకాలంలో కూర్చారు. ఈ గ్రంథం చాలా విలువైనది. ఈ నలభై పదాలు చరిత్రకారులకి రవిదాస్ చారిత్రక మత, రాజకీయ, సాంఘిక అంశాలు అభివ్యక్తికి నేపథ్యంగా ఉపకరిస్తున్నాయి. రవిదాస్ వైష్ణవ మతాచార్యుడైన రామానందభక్తుడు. రవిదాస్ పదాల్లో నామదేవ్, కబీర్, త్రిలోకన్, సదనసేన అనే వారు పేర్కొనబడ్డారు.
కబీర్ కూడా తన శ్లోకాల్లో రవిదాస్ గురించి ప్రస్తావించారు. మీరాబాయి రాణారత్నసింగ్ కుమార్తె జోన నిర్మించిన రావ్‌జోధాజీ మనుమరాలు 1498లో మెర్టా జిల్లాలో కుద్కీ గ్రామంలో జన్మించింది. మీరా చిన్నతనంలో భర్తను కోల్పోయింది. తన కుటుంబంలో జరిగిన వరుస మరణాలు, దు:ఖకర సంఘటనల వలన ఆమె హృదయం కలచివేయబడింది. తీర్ధయాత్రలను చేస్తూ, కాశీవిశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్న చిత్తడ్ రాణి మీరాబాయి సంత్ రవిదాసు గొప్పతనాన్ని విని, వారి గుడిసె వద్దకు స్వయంగా వచ్చి, వారి నిరాడంబర జీవితాన్ని చూసి, ప్రణమిల్లి, తనని శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. మీరాబాయి కోరిక మేరకు రవిదాసు భార్యతో చిత్తౌడ్ వెళ్ళాడు. రవిదాస్‌ను చిత్తౌడ్ బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి మీరాబాయి సత్కరించింది. రవిదాసుకు కాశీ మహారాజు, మహారాణి కూడా శిష్యులయ్యారు. రవిదాసు జీవితాంతం తన చర్మకారవృత్తిని అవలంభిస్తూనే అత్యంత నిరాడంబరమైన పేద జీవితాన్ని గడిపారు. రవిదాసు ప్రజాకవి. వారి తత్వాలకు వారి కాలంలోనే శూద్రులలో లక్షలాదిమంది అనుయాయులయ్యారు. రవిదాస్ అనుచరురాలుగా మీరాబాయి తన పదాల్లో పేర్కొంది. చాలామంది మేధావులు మీరాబాయి కృష్ణుని భక్తురాలుగా చెప్పుకొంటారు. ఆమె నిర్గుణభక్తి శాఖకు సంబంధించింది. మీరాబాయి ప్రభావం మొత్తం భారతదేశం మీద బలంగా ఉంది. స్త్రీలు తాత్వికులుగా, వేదాంతులుగా, గాయనీమణులుగా ముందుకు రావడం ఈ యుగంలో ఎక్కువగా జరిగింది. అందులో మీరాబాయి రూపం, స్వరం, గానం, వర్తన సముజ్వలమైనవి. సంత్ రవిదాస్ నుండి ఆమె ఉత్తేజం పొందడం ఒక చారిత్రక ఘటన. బుద్ధుడి నుండి ఆమ్రపాలి సచలితమైంది. లిచ్ఛలి వంశం ఆహ్వానాన్ని కూడా కాదని ఆయన ఆమ్రపాలి గృహాన్ని దర్శించి ఆమెకు ధర్మబోధ చేశాడు. స్త్రీ కదలిక వేరు. ఆమె పంచేద్రియాలను అదుపు చేయదలచు కొంటే తప్పక చేయగ లుగుతుంది. బౌద్ధం ప్రభావం భక్తికవుల మీద ఉంది. బౌద్ధంలో ధర్మ సూత్రాలలో వున్న సిద్ధాంత సారమంతా రవిదాస్ సూత్రాల్లో ఉంది. ఐసా బాహు రాజ్ మై జహా మిలై సబన్ కో అక్న్ చోట్ బడో సబ్ సవ్‌ు బసై రైదాస్ రహె ప్రసన్న్ ఎక్కడైతే అందరికీ భోజనం లభిస్తుందో, ఎవరు ఆకలితో నిద్రపోరో, ఎక్కడ ఎక్కువ తక్కువల అసమానతలు లేకుండా ప్రజలు జీవిస్తుంటారో అలాంటి సమాజాన్ని, అలాంటి పాలనా వ్యవస్థని రవిదాస్ కోరుకుంటు న్నాడు. మానవులందరు సమానంగా సుఖశాంతులతో జీవిస్తుం టారో అప్పుడే రవిదాసు కూడా ప్రసన్నంగా ఉంటాడు. మానవతా సౌగంధ్యాన్ని విరజిమ్మే సూక్తుల్ని ఆయన చెప్పారు. రవిదాస్ ఆత్మగౌరవం కలిగిన బోధకుడు. ఆయన తాను చెప్తున్న మాటలలో రవిదాస్ చెప్తున్నాడు అని సంబోధిస్తాడు. రవిదాస్ జాతి మత్‌పూబాయి, కా జాత్ కా పాల్ బ్రాహ్మణ్ ఖత్రీ, బైస్, సూద్, సబన్ కీ ఇన్ జాత్ కులం గురించి ఎవరు ఎవర్ని అడగకుండా ఉండటమే శ్రేష్టమైన విషయం. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరు మానవ కులానికి చెందినవారు. మానవతయే పరమధర్మం. సంత్ రవిదాస్ కులనిర్మూలనను ప్రబోధించాడు.
బౌద్ధ ఉద్యమ ప్రభావం భక్తికవుల మీద బలంగా ఉంది. భక్తికవులు మానవతావాదాన్ని, సాంస్కృతిక విప్లవాన్ని, సేవా గుణాన్ని, ప్రజల్లో ప్రజ్వలింపచేశారు. మనిషిలో దాగున్న ప్రేమ, కరుణను ప్రజ్వలింపచేశారు. శాంతిని, క్రాంతిని, ప్రశాంతిని తమ జీవన విధానం ద్వారా పంచారు. ఈనాడు హిందూ మతోన్మాదం హింసావాదంతో దళితులను, మైనార్టీలను అణిచివేస్తుంది. వారి హక్కులను కాలరాస్తుంది. కత్తి చేయలేని పనిని సున్నితమైన మాట చేస్తుందని, ప్రేమ పూర్వకమైన ఆచరణ చేస్తుందని భక్తికవులు నిరూ పించారు. రవిదాస్, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, జాషువ ఈనాడు సాహితీవేత్తలకు ఆదర్శం కావాలి. కవిత్వంలో సందేశంతో పాటు శిల్పం ఉండాలి. రాజ్యాన్ని ఎదిరించగల ధీశక్తి కావాలి. వీరెవ్వరు రాజస్థానాల్లో పనిచేసినవారు కారు. అందుకే నన్నయ్య, తిక్కన, శ్రీనాధుడు, పెద్దన గొప్ప కవులే కాని సందేశకులు కాలేక పోయారు. బౌద్ధ ఉద్యమ ప్రభావంతో అంబేడ్కరైట్లు, మార్క్సిస్టులు సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా భక్తికవుల బోధనలను స్వీకరించి మానవతావాదానికి పతాకలెత్తాల్సిన చారిత్రక సందర్భం ఇది. చరిత్ర ఆచరణశీలురుదే. ఆ మార్గంలో నడుద్దాం.