Search
Friday 21 September 2018
  • :
  • :

‘రియాల్టీ’కి రెక్కలు

life

భాగ్యనగర చరిత్ర ఆనాడు ఈనాడు ప్రపంచ స్థాయిలో చెప్పుకోతగినదే. నిజాం వైభవానికి సాక్షంగా నిలిచిన నగరంలో తరాలు మారుతున్నకొద్దీ కొత్తమలుపులు తిరిగి కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి నగరం హబ్‌గా మారుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు పెరుగుతుండటంతో నివాస సౌకర్యాలు విస్తరిస్తున్నాయి. వివిధ  ప్రాంతాలకు సులువుగా రాకపోకలు సాగించడానికి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.  విద్య, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి కనిపిస్తోంది. గృహనిర్మాణాలకు సంబంధించి ఇటీవల అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. దేశం మొత్తంమీద ఇతర నగరాలకన్నా హైదరాబాద్ ఒక్కటే ఎలాంటి ఇబ్బందులు లేని ప్రశాంత నగరంగా వర్థిల్లుతోంది. దేశంలోని ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా సాగుతుండగా, హైదరాబాద్‌లో మంచి బూమ్ కనిపిస్తోంది. దేశంలోని ప్రధానమైన ఏడు నగరాల్లో హైదరాబాద్ మాత్రమే రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో 2013 నుండి 2017 వరకు సరాసరిన  32  శాతం వృద్ధి కనిపించింది. ప్రత్యామ్నాయ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ హైదరాబాద్ చెప్పుకోతగిన స్థానంలో ఉంది. ఈ రంగంలో రానురానూ వృద్ధి చోటుచేసుకుంటోంది. దేశం మొత్తంమీద ప్రత్యామ్నాయ రెసిడెన్షియల్ రియాల్టీ రంగంలో  54.3 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు ఉండగా ఇందులో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ 25 శాతం భాగస్వామ్యం వహిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో రియల్ ఎస్టేట్ హౌసింగ్, మైక్రోయూనిట్లు, సీనియర్ హౌసింగ్ తదితర అభివృద్ధి నిర్మాణాలు దేశంలోని టైర్ 1 నగరాల్లో విస్తరించాయి. ప్రగతిదాయకమైన చక్కని పరిపాలన, అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వానికి కీర్తి తెచ్చిపెట్టాయి. హైదరాబాద్ మెట్రోరైలు, రోడ్ల అభివృద్ధి, కారిడార్లు ఇవన్నీ ఆస్తిపాస్తుల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎక్కడైతే ఐటి కంపెనీలు విస్తరించి ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ రెక్కలు తొడుగుతోంది. అలాగే నగర శివారు ప్రాంతాల్లో కొత్త జిల్లాలు ఆవిర్భవించడంతో శంషాబాద్, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, ప్రాంతాలు బంగారు భవిష్యత్‌కు సూచికలుగా మారాయి. మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్  2018 ప్రకారం హైదరాబాద్ వరుసగా నాలుగేళ్లుగా అగ్రస్థానంలో ఉంటోంది. నేరాల సంఖ్య తగ్గుదల, ఆహ్లాదరకరమైన వాతావరణంలో దేశంలోని అన్ని నగరాలకన్నా హైదరాబాద్ పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకుంటుంది.

పి.వెంకటేశం

Comments

comments