Search
Saturday 22 September 2018
  • :
  • :

జియో ఆలోచన ఇషాదే..

ambani

* ఇంట్లో నెట్‌వర్క్ సరిగ్గా లేదంటూ నా కుమార్తె ఫిర్యాదు
* అలా కొత్త టెక్నాలజీ వైపు అడుగులు
* 4జి వోల్ట్‌తో జియో ఆవిర్భవించింది: ముఖేష్ అంబానీ

లండన్ : బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన టెలికామ్ సంస్థ జియో దేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ సంస్థ ఆవిర్భావం వెనుకు అసలు కారణం ఆయన బహిర్గతం చేశారు. 2011 సంవత్సరంలో తన కుమార్తె ఉషా ఆలోచనతోనే జియో పుట్టిందని.. ఈ సంస్థను ప్రారంభించిన రెండేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద డాటా వినియోగం దేశంగా భారత్ అవతరించిందని ముఖేష్ అన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ అర్సెలర్ మిట్టల్ బోల్డ్‌నెస్ కార్యక్రమంలో ‘డ్రైవర్స్ ఆఫ్ చేంజ్’ అవార్డును రిలయన్స్ అందుకుంది.  ఈ కార్యక్రమానికి ముఖేశ్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జియో కోసం రిలయన్స్ భారతీయ మొబైల్ మార్కెట్‌లో 31 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని తెలిపారు. ‘నా కుమార్తె ఇషా 2011లో జియో ఆలోచననకు  బీజం వేసింది. ఆ సమయంలో ఇషా సెలవుల నిమిత్తం అమెరికా నుంచి భారత్ వచ్చింది. ఓ రోజు ఇంట్లో తన కోర్సుకు సంబంధించిన వర్క్ చేసుకుంటోంది. అప్పుడు డాడీ మన ఇంట్లో ఇంటర్నెట్ అధ్వాన్నంగా ఉందని చెప్పింది’ అని ముఖేష్ గుర్తుచేసుకున్నారు. అయితే భవిష్యత్తులో ప్రపంచం డిజిటల్ టెక్నాలజీతోనే నడుస్తుందని ఇషా, ఆకాశ్ నాకు చెప్పారు. కొత్త ప్రపంచం ప్రతి అంశం డిజిటల్‌లోనే నడుస్తాయని వారు వివరించారు. అలా వారి ఆలోచనల నుంచే ఈ జియో వచ్చింది. 2016 సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన జియో ఇప్పుడు భారత్‌లో గేమ్ ఛేంజర్‌గా మారింది. 2జి నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడానికి భారతీయ టెలికాం రంగానికి 25 ఏళ్లు సమ యం తీసుకుంటే.. 4జి ఎల్‌టిఇ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి జియోకి కేవ లం మూడేళ్లే పట్టిందన్నారు. 5జి నెట్‌వర్క్ కూడా త్వరలో రానుందని ముఖేశ్ అంబానీ చెప్పారు. 2016లో జియోను ప్రవేశపెట్టి.. ఉచితంగా సిమ్ కార్డులు ఇవ్వడంతో పాటు అతి తక్కువ ధరలకే ఉచిత కాల్ సేవలు, డేటా అందిస్తున్నామని అన్నారు. త్వరలో జియో కొత్త డేటా కనెక్ట్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నట్లు ముఖేశ్ తెలిపారు.  దీని ద్వారా మన ఇంటికే కాకుండా, వివిధ వ్యాపారాలకు, కార్లకు నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. 1జి మొబైల్ నెట్‌వర్క్‌కు అమెరికా నాంది పలికింది. ఆ తర్వాత యూరప్ 2జిని తీసుకురాగా, చైనా 3జి నెట్‌వర్క్‌తో ముందడుగు వేసింది. జియో ప్రపంచంలోనే అతిపెద్ద 4జి ఎల్‌టిఇ నెట్‌వర్క్‌ను స్థాపించిందని ముఖేష్ వివరించారు. ఇది 2019లో 4జిలో భారత్‌ను లీడర్‌గా నిలుపనుందని అన్నారు. భారతదేశంలోని ప్రతిభావంతులైన యువత ఉన్నారని వారితో 2028 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారవుతుందని అన్నారు.

Comments

comments