Home దునియా వీరుల వ్యథ!

వీరుల వ్యథ!

Indian-Army

భారత సైన్యం అంటే భారతీయులకు ఎంతో గౌరవం. మొత్తం 12 మిలియన్లు(12000000) సైనికులుంటారు మన సైన్యంలో. యుద్ధాలు జరిగి సైనికులు వీర మరణం పొందినప్పుడు మాత్రమే గుర్తుచేసుకుంటారు వారిని. బయట నుంచి చూసేవాళ్లకి ఫ్యాంటసీగా అనిపించే సైనికుని పాత్ర చాలా క్లిష్టతరమైంది. కత్తుల అంచుల మీద నడక వారిది. యుద్ధాలే రావక్కర్లేదు వారి ప్రాణం పోవడానికి. ప్రాణం పోకున్నా చేతులు, కాళ్లు సరిగా ఉంచుకుని ఆర్మీ నుంచి బయటకు వచ్చినవారు అదృష్టవంతులే అనుకోవాలి.

మిలిటరీ క్రమశిక్షణలో పైవాడు చెప్పిందే వేదం. అజమాయిషీలు, అధికార దర్పాల కింద సైన్యం నలుగుతుంటుంది. శారీరకంగా, మానసికంగా క్షోభ పడుతుంటారు. కుటుంబాలతో కలిసి ఉండగలిగిన ప్రదేశాలుంటాయి. కుటుంబాల్ని వేల మైళ్ల దూరంలో వదిలి చుట్టూ శత్రువుల నీడలతో ఆటలాడుతూ బతకాల్సి ఉంటుంది. అటువంటి భారత వీరజవానులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని పేద విద్యార్థుల మాదిరిగానే అతి నాసిరకమైన ఆహారంతో కడుపుమాడ్చుకొని సరిపెట్టుకుంటున్నారన్న సమాచారం ఆందోళనకరమైంది.

అతని ధైర్యానికి మెచ్చుకోవాలి
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ఈమధ్య ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. జవాన్ రైఫిల్ పట్టుకుని యూనిఫామ్‌లో ఉన్నాడు. వాళ్లకి పెట్టే తిండి ఏమాత్రం నాణ్యత లేదని, ఒక్కోసారి తిండి తినకుండా ఆకలితోనే తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుందని చూడటానికే బాగాలేని పప్పు, రొట్టెలు వీడియోలో చూపించాడు. ‘మాకు బ్రేక్‌ఫాస్ట్‌లో కేవలం ఒక పరాఠా, టీ ఇస్తారు అంటూ ఒక మాడిపోయిన రొట్టె, గ్లాసులో టీ చూపించాడు. ‘రోజుకు 11 గంటల పాటు నిలబడి డ్యూటీ చేయాలి. మధ్యాహ్న భోజనంలో పసుపు, ఉప్పు వేసి ఉడికించిన పప్పుతో రొట్టెలు పెడతారు. ఈ తిండి తిని జవాను ఎలా పని చేస్తాడు? మా కష్టాన్ని ప్రధాన మంత్రి పరిష్కరించాలి. మా సమస్యలు బయటి ప్రపంచానికి తెలీవు.’ అంటూ తమ కష్టాన్ని ప్రజలే ముందుకు తీసుకెళ్లి న్యాయం ఇప్పించాలన్నాడు. తప్పకుండా అతనికి వీడియో లీక్ చేసినందుకు శిక్ష పడుతుందని తెలుసు కాబట్టి బహుశా తాను ఇక్కడ ఉండకపోవచ్చని సూచనప్రాయంగా చెప్పాడు. అతని వీడియోని లక్షల మంది చూశారు. దానికి సంజాయిషీగా, ‘అతను అంతకు ముందే ప్రవర్తన సరిగా లేకపోవడంతో నాలుగుసార్లు శిక్ష పొందాడు.’ అని అతని గురించి యాదవ్ పై ఆఫీసర్ తెలిపాడు. ఆఫీసర్ చెప్పింది నిజమే అయుండవచ్చు కాని అతను వాస్తవ పరిస్థితులు బయట ప్రపంచానికి తెలపడంలో చూపిన ధైర్యం, చొరవ మాత్రం చెప్పుకోతగ్గవే. ఈ విషయం విన్న గృహ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూనియన్ హోమ్ సెక్రటరీని అత్యవసరంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నివేదిక తీసుకోమని చెప్పారు. అంతమాత్రాన వారి పరిస్థితులేం తారుమారు కావు.

నరకాన్ని భూమ్మీదే చూస్తారు
పాకిస్తాన్ సైన్యం భారతీయ సైనికుల మీద లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరపడం చాలా సాధారణం. చాలాసార్లు అక్కడ చనిపోయిన సైనికుడు ఎవరి తరపువారనేది పాకిస్తాన్, ఇండియా రెండువైపుల నుంచి మావాడే అని అధికారిక ధృవీకరణ జరగదు. కాల్పుల సంఘటనలు కేవలం ఇరువైపుల సైనికుల మీదనే జరగవు. మనవైపు ఏ పొలంలోనో పని చేసుకుంటున్న రైతు, ఇంట్లోనే ఉన్న గృహిణి, పౌరులు ఇలా ఎవరైనా ఈ కాల్పుల బారిన పడి చనిపోతుంటారు. పొరపాటున బార్డర్ దాటిన అమాయకులు కాని, డ్యూటీలో ఉన్న సైనికులు కాని పాకిస్తాన్ సైన్యానికి చిక్కారంటే ఇక నరకం అంటే ఏంటో భూమ్మీదే కనిపిస్తుంది వారికి. ఈమధ్యనే చందూ అనే అతన్ని భారత్ అభ్యర్థన మీదకు పాకిస్తాన్ విడిచిపెట్టిన విషయం మనం వార్తల్లో చూశాం. అటువంటి దృష్టిలోకి రాని సంఘటనలు అనేకం ఉంటాయి.

తిన్నందుకు శిక్ష
బయట చూసేవారికి అందమైన ప్రపంచంలాగా, దేశానికి సేవ చేసే అవకాశం కలిగినందుకు సైనికులు చాలా ఆనందంగా ఉంటారనుకుంటారు. కాని అది వాస్తవం కాదు. చిన్న చిన్న అతిక్రమణలకు కూడా వారికి కఠిన శిక్షలుంటాయి. బరేలీలో డ్యూటీలో ఉన్న సైనికుడు జీప్ డ్రైవ్ చేసుకుంటూ బజార్లో వెళ్తున్నాడు. దారిలో మొక్కజొన్న పొత్తులు కనిపించాయి. మధ్యాహ్నం సమయం. భోజన వేళ దాటింది. ఆకలేసి తినాలనిపించింది. జీప్ ఆపి అవి కొనుక్కుని తిని మళ్లీ జీప్ నడుపుకుంటూ ఆఫీస్‌కి వెళ్లాడు. కాని అతనికి తెలీంది ఒకటి జరిగింది. అతను డ్యూటీలో ఉండగా రోడ్డు మీద జీప్ ఆపి మొక్కజొన్న పొత్తులు తినడం క్రమశిక్షణను అతిక్రమించడం అనిపించి ఆ తప్పుకు అతనికి ఆఫీసర్ శిక్ష వేశాడు. ఇసుక బస్తా భుజాన వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు యూనిట్ ఆఫీసు మధ్యలో అతను నుంచోవాలి. ఆవిధంగా ప్రతిరోజూ అంటే ఆఫీసర్ మనసు కరిగి ఇక చాలు అనేవరకు అతను ఆ శిక్ష అనుభవించడం ఎంత కష్టమో చెప్పనక్కర్లేదు. అతని సహచరుల మధ్య అవమానం. ఆర్మీ క్వార్టర్లలోని కుటుంబానికి తెలుస్తుంది. అదొక బాధ. ఇంకొకతను డ్యూటీలో ఉండగా ఒక్క క్షణం కునుకు తీశాడు. అది పైవారి కళ్లలో పడింది. శిక్షగా లంగర్ హౌస్(వంటగది)లో బొగ్గు ఉండలు చేయాలి. ఆఫీసర్‌కి ఆ సమయంలో వచ్చిన కోపాన్నిబట్టి జూనియర్ ర్యాంకుల సైనికులకు ఏ శిక్ష అయినా వెయ్యచ్చు. అలాటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతాయి.

కోర్టు మార్షల్ చేస్తారు
సైనికులకు ఏడాదిలో రెండు నెలలు వార్షిక సెలవుంటుంది. ఒక నెల క్యాజువల్ సెలవుంటుంది. అవి పూర్తి చేసుకుని తిరిగి జాయిన్ అయ్యే సమయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం జరగకూడదు. అలా అయితే వారి రిజిస్టర్‌లో ఎర్ర ఇంక్ మార్క్ పడుతుంది. వారికి రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల మీద ఆ ప్రభావం ఉంటుంది. ఏదయినా అనివార్య కారణం వలన కొద్ది రోజులు ఆలస్యం అయితే ఆర్మీ జైలు శిక్ష అనుభవించాలి. చేతిలో అధికారం ఉన్న కల్నల్ తన యూనిట్‌లో ఉన్న సైనికుల మీద పూర్తి అధికారి. రాజు లాటివాడు. అతనికి ఏం అనిపిస్తే అది చేయగలడు. పై అధికారులు పెట్టే హింసను తట్టుకోలేక వారిని సైనికులు గన్‌తో కాల్చడం, వారి మీద తిరగబడటం కూడా సైన్యంలో చాలాసార్లు జరుగుతుంటుంది. సైనికుడు సైన్యంలో ఉండగా నేరం చేస్తే ఆర్మీ ప్రత్యేక కోర్టు అతని తప్పుకు కోర్టు మార్షల్ చేస్తుంది. అంటే అతని యూనిపాం, అతని ఆర్మీ బ్యాడ్జీలను స్వాధీనం చేసుకుని సైన్యం నుంచి ఇంటికి పంపేస్తుంది. తర్వాత నుంచి అతను ప్రభుత్వం నుంచి ఏవిధమైన లబ్ధి, సౌకర్యాలు పొందలేడు.

బోర్డ్ అవుట్ అవుతారు
సైనికులు కేవలం యుద్ధాలలోనే ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యం పొందడం ఉండదు. వారికి అన్ని వైపుల నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయి. కెప్టెన్ కపిల్ వినాయక్ అనే అతను కంటోన్మెంట్ ప్రాంతంలో వెళ్తుండగా మందు పాతర పేలి చనిపోయాడు. ముప్ఫైమంది ఉన్న ఆర్మీ బస్ వెళ్తోంది. ఆ ట్రక్‌కే బాంబ్ అమర్చి ఉంది. బస్‌లో ఉన్నవారిలో ఒక్కరే ప్రాణాలతో మిగిలారు. అందరూ చనిపోయారు. ఆవిధంగా ప్రాణాలు పోయేవారికి లెక్కలేదు. ఎంతమంది కాళ్లు, చేతులు, కళ్లు పోగొట్టుకుని జీవితం అంతా వైకల్యంతో బాధ పడతారు. అంగవైకల్యం పొందిన వారు శారీరకంగా ఆర్మీకి పనికిరారు అని ఒక ప్రత్యేక వైద్య బృందం ఖరారు చేస్తుంది. వారిని బోర్డ్ అవుట్ చేసి ఆర్మీ నుంచి పంపేస్తారు. వారికేం ప్రత్యేక పతకాలు, మెడల్స్ ఇచ్చి గౌరవించరు. లక్షల రూపాయల నగదూ ఇవ్వరు. సాధారణ పెన్షన్ కాక ఇంకొద్ది ప్రత్యేక పెన్షన్ ఇస్తారంతే. అంగవైకల్యంతో ఇంటికి వచ్చిన అతనికి ఇంకో పని దొరకదు. కుటుంబ పోషణ భారం అవుతుంది.

జీవితకాల ప్రభావం ఉంటుంది
గ్లేషియర్‌లలో(మంచు చరియల్లో) ఎప్పుడూ ఇన్ఫాంట్రీ సైన్యం కాపలా కాస్తుంటుంది. వారితో పాటు ఆర్టిలరీ, ఇంజినీర్లు, ఆహార, వైద్య, సిగ్నల్ సేవల కోసం కోర్‌లకు సంబంధించిన జవాన్లు ఉంటారు. మంచు చరియలు కూలి పోయి, మంచులో కూరుకుపోయి ఎంతోమంది జవాన్లు చనిపోతుంటారు. ప్రతి సైనికుడు తన జీవితకాలంలో ఒకసారి ఆ ప్రాంతాల్లో కొద్ది కాలం కోసం డ్యూటీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. గడ్డకట్టుకుపోయే చలిలో డ్యూటీ పూర్తి అయిన తర్వాత బతికి బట్ట కట్టినా కనీసం ఎనభై శాతం మంది శ్వాసకోశాల్లో లేదా గుండెల్లో నీరు చేరి మిలిటరీ ఆసుపత్రుల్లో చేరడం చాలా సాధారణం. పైగా జీవితకాలం పాటు వారి ఆరోగ్యం మీద ఆ కొద్దికాలం గ్లేషియర్లలో డ్యూటీ చేసిన ప్రభావం ఉంటుంది. అంత కష్టానికి ప్రతిఫలంగా జీతంలో కొద్ది పెంపు ఉంటుందంతే. మరి జీవితాంతం వారి అనారోగ్యానికి ఏవిధమైన కాంపన్సేషన్లు ఉండవు.

యుద్ధం కోసం శిక్షణ పొంది పనివాడుగా…
సైన్యంలో సహాయక్, సేవాదార్ వ్యవస్థ నడుస్తుంది. దాని వెనక ఒక చరిత్ర ఉంది. అప్పట్లో రోమ్‌లో ప్రతి ఒక్క నాగరీకుడు తనవంతుగా మిలిటరీకి సేవలందించాలి. సైన్యంలోకి చేరిన ప్రతి యువకుడు ‘నేను నా పైవారు వేసిన ప్రతి హుకుంకు తల వంచుతాను.’ అని ప్రమాణం చేస్తాడు. మౌర్య సైన్యంలో కూడా సేవాదార్లు ఉండేవారు. దానికి భారతీయ చరిత్రలో చాలా రుజువులున్నాయి. 1861 లో బ్రిటీషు పరిపాలనలో మొదటిసారిగా ఆర్డర్లీ వ్యవస్థ మొదలైంది. మిలిటరీలో జూనియర్ ర్యాంకులో ఉన్నవారు సీనియర్ ఆఫీసర్‌కి బట్‌మన్‌గా నియమితులవుతారు. జనరల్ డ్యూటీ వర్గంలో సైన్యంలో చేరినవారు ఆఫీసర్‌కు సేవలందిస్తారు. ఆఫీస్‌లో ‘రన్నర్’గా అందరికీ సహాయకులుగా పనిచేస్తారు.

దయనీయ స్థితి బాధాకరం
నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సహాయక్ వ్యవస్థ లేదు. కాని ఆర్మీలో సహాయక్ వ్యవస్థ ఇంకా ఉంది. ఆఫీసర్ యూనిఫాం ఇస్త్రీ చేసి, బెల్ట్, బూట్లను పాలిష్ చేసి,బ్యాడ్జీలను తోమి సిద్ధంగా ఉంచుతాడు. ఆఫీసర్ జీపుని నడుపుతాడు. ఆఫీసర్‌కి బాడీగార్డ్ అవుతాడు. బట్‌మన్ ఉద్యోగం అంటే బ్యాటింగ్ లాటిదే అని అంటారు. ఆఫీసర్‌కి సంబంధించిన సేవలు మాత్రమే చేయాలి. కాని అతని ఇంటివద్ద ఇతనికి పని ఉండకూడదు. కాని బట్‌మన్‌ను పనివాడుగా ఆర్మీ వ్యవస్థ వాడుకుంటుంది. అందరిలానే ఏడాదిన్నర పాటు కఠిన శిక్షణ పొందిన జవాన్ ఆఫీసర్ ఇంట్లో నేల తుడుస్తూ, వారు విడిచిన బట్టలు ఉతుకుతాడు. 2008 లో లాంస్ నాయక్ ఓమ్ ప్రకాష్ అనే భారత జవాను సైన్యంలో సహాయక్‌గా ఉండేవాడు. ఆఫీసర్ ఇంటి పనంతా చేస్తున్నాడన్న విషయాన్ని అతను తెలిపాడు. దాని గురించి పార్లమెంటులో చర్చ జరిగింది. ఆర్మీలో సహాయక్ వ్యవస్థను నిర్మూలించాలని వాదనలు జరిగాయి. ప్రపంచంలో చాలా దేశాలు సహాయక్ వ్యవస్థకు తిలోదకాలిచ్చేశాయి. ఇప్పటికే ఆర్మీలో చేరేవారు తక్కువ కావడం, సైనికుల కొరత ఎదర్కుంటుంది. మనోవ్యధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న జవాన్లు కూడా ఉంటున్నారు. మన వీర జవాన్లు ఇంతటి దయనీయ స్థితిలో ఉండటం బాధాకరం.

ఆర్మీ విభాగాలు

ఆర్మోర్డ్: యుద్ధ ట్యాంకర్లకు సంబంధించిన విభాగం. ఇందులో మొత్తం 63 రెజిమెంట్లు ఉంటాయి. కేవలం శత్రువులతో యుద్ధమే కాదు రాష్ట్రపతికి బాడీగార్డులుగా కూడా ఈ రెజిమెంట్‌కి చెందినవారే ఉంటారు.
ఆర్టిలరీ: భారత సైన్యంలో ఆరోవంతు ఆర్టిలరీదే. తుపాకులు, ఆయుధ సామగ్రి, రాకెట్ లాంచర్స్‌తో ఇది అతి పెద్ద విభాగం ఇది. 5000 అడుగుల ఎత్తున జరిగే యుద్ధానికి ఇది బాధ్యత వహిస్తుంది.
ఆర్మీ ఏవియేషన్ కార్ప్‌ః సామగ్రికి సరఫరాలు చేసే విభాగం.
ఇన్ఫాంట్రీ: వీళ్లు పూర్తి స్థాయి సైనికులు. యుద్ధంలో ముందుండేది వీళ్లే. ఇన్ఫాంటరీలు జండా ఎగరేసే వరకు విజయాన్ని ప్రకటించ లేదు సైన్యం.
సాంకేతిక విభాగాల ఇంజినీర్లు: అప్పటికప్పుడు వంతెనలు, బ్రిడ్జిలు కట్టేస్తారు. శత్రువులకు సంబంధించిన వంతెనలు, బ్రిడ్జిలను కూల్చేయగలరు. మద్రాస్ శాపర్స్, బెంగాల్ శాపర్స్, బాంబే శాపర్స్. నేషనల్ హైవే, ఎయిర్ ఫీల్డ్, బిల్డింగ్స్, బ్రిడ్జీలు కట్టడంలో వీళ్లకి సాటి లేరు.
సిగ్నల్స్ కార్ప్‌: మిలిటరీ కమ్యూనికేషన్స్ మీద పనిచేస్తుంది. డిఆర్‌డిఓ తో కలిసి ఇండియన్ ఆర్మీకి రకరకాల సాఫ్ట్‌వేర్‌లను, వ్యవస్థాత్మక ఏర్పాట్లను చూస్తుంది ఇది.
ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌: ఇండియన్ ఆర్మీ వాడే యాంత్రిక శక్తికి సేవలందిస్తుంది. ఆర్మోర్డ్ వారి ఆయుధాలను శుభ్రం చేస్తుంది. ఇండియన్ ఆర్మీకి ఇంజినీరింగ్ మద్దతునిస్తుంది.

– శ్రీదేవి కవికొండల