Home తాజా వార్తలు అదే తడబ్యాటు…

అదే తడబ్యాటు…

 Indian batsmen failed miserably in the first Test

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత బ్యాట్స్‌మెన్ లార్డ్ టెస్టులోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించారు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అయితే 107 పరుగులకే కుప్పకూలారు. ఫాస్ట్ పిచ్‌లపై తాము ఆడలేమనే విషయాన్ని మరోసారి ఆచరణలో చూపించారు. సొంత గడ్డపై పరుగుల వరద పారించే భారత ఆటగాళ్లు విదేశాల్లో మాత్రం చేతులెత్తేయడం అనవాయితీగా వస్తోంది. కేవలం ఉప ఖండం పిచ్‌లపై మాత్రమే భారత బ్యాట్స్‌మెన్ మెరుగ్గా రాణిస్తున్నారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డపై జరిగే మ్యాచ్‌లలో తక్కువ స్కోరుకే చేతులెత్తేస్తున్నారు. లార్డ్ మైదానంలో అండర్సన్, వోక్స్, స్టువర్ట్ బ్రాడ్‌ల బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తారని భావించిన బ్యాట్స్‌మెన్ చెత్త ఆటతో నిరాశే మిగిల్చారు. ఓపెనర్లతో సహా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. టయిలెండర్లు సైతం నిరాశ పరిచారు. ప్రారంభం, చివర్లో అండర్సన్ దెబ్బ తీయగా, మధ్యలో వోక్స్ హడలెత్తించాడు. వీరి విజృంభణతో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం మూటగట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది. కనీసం 150 పరుగుల స్కోరును కూడా చేయక పోవడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కడం కష్టమనే చెప్పాలి. ఏదైన అనూహ్యం జరిగితే తప్ప లార్డ్ టెస్టును కాపాడు కోవడం కోహ్లి సేనకు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఈసారి కూడా…

తొలి టెస్టులో ఓపెనర్ల వైఫల్యం భారత్‌ను వెంటాడింది. దీంతో రెండో మ్యాచ్‌లో వారు మెరుగైన ప్రదర్శన ఇస్తారనే నమ్మకంతో జట్టు యాజమాన్యం ఉంది. ఈసారి లోకేస్ రాహుల్, మురళీ విజయ్‌లను ఓపెనర్లుగా దించారు. భారీ ఆశలతో బరిలోకి దిగిన విజయ్, రాహుల్‌లు నిరాశ పరిచారు. విజయ్ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే విజయ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. విజయ్ ఔట్ కావడం ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి. తర్వాత లోకేష్ రాహుల్‌ను కూడా అండర్సన్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ మళ్లీ కోలుకునే పరిస్థితి కనిపించలేదు. ఇక, తొలి టెస్టులో చోటు కోల్పోయినా చటేశ్వర్ పుజారాకు లార్డ్‌లో అవకాశం లభించింది. అయితే అతను అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు.

చేజేతులా రనౌటై వికెట్‌ను పారేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను బాగానే ఎదుర్కొన్న పుజారా అనవసర పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. అతని వికెట్ ఆట తీరును మార్చేసిందని చెప్పాలి. ఒకవేళ పుజారా క్రీజులో పాతుకుపోయి ఉంటే ఇన్నింగ్స్ పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో. ఇక, తొలి మ్యాచ్‌లో విఫలమైన అజింక్య రహానె ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మెరుగైన ఆటను కనబరుస్తానని చెప్పిన రహానె తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అతను రాణించి ఉంటే టీమిండియా స్కోరు కచ్చితంగా 200 పరుగులు దాటేదే. ఇక, తొలి మ్యాచ్‌లో అసాధారన పోరాట పటిమను కనబరిచిన కెప్టెన్ విరాట్ కోహ్లి లార్డ్‌లో నిరాశ పరిచాడు. అతని వైఫల్యం భారత బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. కోహ్లి నిలదొక్కుకొని ఉన్నట్లయితే భారత్‌కు మెరుగైన స్కోరు సాధించడం అసాధ్యం అయ్యేది కాదు. ఇక, చివర్లో అశ్విన్ 29 పరుగులు చేయడం వల్లే భారత్ స్కోరు వంద దాటింది. లేకుంటే మరింత తక్కువ స్కోరుకే భారత్ పరిమితమయ్యేది.

తీరు మారితేనే…

ఇక, సుదీర్ఘ సిరీస్‌లో భారత్ మెరుగైన ఫలితాలు సాధించాలంటే బ్యాట్స్‌మెన్ తమ తీరును మార్చుకోక తప్పదు. ఫాస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని ముందుకు సాగాలి. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, వోక్స్, కరన్‌ల బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొవాలి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్లు సమర్థంగా రాణించారు. అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. వోక్స్ కూడా విరాట్ కోహ్లి వికెట్‌ను పడగొట్టి తనవంతు పాత్ర పోషించాడు. కాగా, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు భారత బ్యాట్స్‌మెన్ తమ ఆట తీరును మార్చుకోవాలి. వీరిపై ఎదురు దాడి చేయడమే ఒక్కటే సరైన మార్గం. ధైర్యంగా ముందుకు వెళితే వీరిని ఎదుర్కొవడం కష్టమేమి కాదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా బౌలర్లతో పోల్చితే అండర్సన్, బ్రాడ్, వోక్స్‌లు అంత ప్రమాదకర బౌలర్లు ఏమీ కారు. వీరి బౌలింగ్‌లో అంతగా వేగం ఉండదు. అయినా భారత బ్యాట్స్‌మెన్ తడబాటు గురవ్వడం బాధాకరమే. ఇక, రానున్న మ్యాచుల్లోనైనా భారత ఆటగాళ్లు తమ ఆటను మెరుగు పరుచుకోవాలి. లేకుంటే మరోసారి ఇంగ్లండ్ గడ్డపై అవమానకర ఓటములు తప్పవు.