Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

ఆధునిక యంత్రాలతో కూలీల సమస్యకు చెక్

The Introduction of paddy stitching machines by Minister Pocharam

మైలార్‌దేవుపల్లి: వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీర్చేందుకు ఆధునిక యంత్రాలతో వరి నాట్లు వేసే యంత్రాలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం యంత్రాలతో వరినాట్లు వేసే విధానాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి మంత్రి పరిశీలించారు. రాజేంద్రనగర్‌లో వరి పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను వర్శిటీ ఉపకులపతి డా॥ వి. ప్రవీణ్‌రావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథితో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులతో కలిసి, ముందుగా ఆయన మ్యాట్‌పై నారు పెంచే విధానాన్ని, నారు పెంచడానికి కావాల్సిన సన్నద్దతను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం వరినాట్లు వేసే యంత్రాలను మంత్రి నడిపి వాటి పనితీరును వివిధ కంపెనీల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మనుషులతో నాట్లు వేసే కన్నా, యంత్రాలతో నాట్లు వేయడం వల్ల సమయం, ఖర్చు కూడా ఆధా అవుతుందని మంత్రి అన్నారు.

ప్రస్తుతం కూలీల కొరత వ్యవసాయ రంగానికి, రైతులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని, వరి పంటలలో యాంత్రీకరణ పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తొందన్నారు.  వరినాట్లు వేయడంలో యాంత్రీకరణ అవసరం ఎంతో పెరిగిందని, అలాగే యంత్రాలపై నాట్లు వేసేందుకు అవసరమైన రీతిలో నారుమడులు పెంచడంపై రైతులలో అవగాహన పెంచాలని సూచించారు. రైతులకు నచ్చిన కంపెనీల నుంచి యంత్రాలను కొనుగోలు చేసుకొనే వెసులుబాటును కల్పిస్తామన్నారు.  కంపెనీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు డా॥ జగదీశ్వర్, వరి పరిశోధనా కేంద్రం హెడ్ డా॥ ప్రదీప్, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో రైతులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

comments