Home ఎడిటోరియల్ అసోంలో పౌరసత్వ సమస్య

అసోంలో పౌరసత్వ సమస్య

edt

అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది.ఇప్పుడు ఎన్నార్సీలో 40 లక్షల మంది పౌరులు కాదని ప్రభుత్వం తేల్చేసింది. అంటే ఈ 40 లక్షల మంది దేశం లేని ప్రజలు. ప్రపంచంలో ఇంత పెద్ద సంఖ్యలో దేశం లేని ప్రజలున్నది ఇప్పుడు భారతదేశంలోనే. పౌరుల జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన పడనవసరం లేదని హోంమంత్రి రాజ్‌నాథ్ అంటున్నారు. ‘దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు చాలినంత సమయముంది’ అని పేర్కొన్నారు. ఎన్నా ర్సీ కేంద్రాల్లో ఫిర్యాదు చేయొచ్చనీ.. అదీ కాకపోతే విదేశీ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసుకోవచ్చని సూచిస్తోంది. అయితే ట్రిబ్యునల్ తీర్పులు ఎన్నా ళ్ల కొస్తాయో చెప్పలేని పరిస్థితి. ‘తుది జాబితాలో లేని వారిని మేం భారతీయులుగానో, భారతీయేతరులుగానో పిలవడం లేదు. వీరిపై వెంటనే ఓ నిర్ణయానికి రాలేం’ అని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్ స్పష్టం చేశారు. కాని పౌరులు కాని వారిని దేశం నుంచి గెంటేయాలని, వెళ్ళకపోతే కాల్చి పారేయాలని బిజెపి నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్నార్సీ ముసాయిదా విడుదలపై పార్లమెంటులో విపక్షాలను నిరసన తెలిపాయి. కాంగ్రెస్, తృణమూల్, ఎస్పీ సహా పలువురు విపక్ష సభ్యులు రాజ్యసభలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్సార్సీ ముసాయిదా నుంచి 40 లక్షల మందిని తప్పించడంపై పశ్చిమబెంగాల్ సిఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘సొంతగడ్డపై భారతీయులే శరణార్థులయ్యారు’అని పేర్కొన్నారు.
జాతీయ పౌర జాబితాలో పేరు లేని ఈ 40 లక్షల మందికి ఇప్పుడు పౌరులుగా హక్కులుండవు. ఓటు వేసే అవకాశం ఉండదు. వారిపై దాడులు పెరిగే అవకాశాలున్నాయి.మూకహత్యలు ఒక మామూలు వ్యవహారంగా మారిపోయిన నేపథ్యంలో, మూకహత్యలు పెరుగుతున్న వాతావరణంలో ఈ 40 లక్షల మంది ప్రజలు ఇప్పుడు దిక్కుతోచక బిక్కుబిక్కు మంటూ గడిపే పరిస్థితి నెలకొంది. కామరూప్ జిల్లాలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ ముహమ్మద్ అజ్మల్ హక్ పౌరసత్వం నిరూపించుకోవాలని 2016లో నోటీసు పంపించింది. బంగ్లాదేశ్ నుంచి ఆయన అక్రమంగా వచ్చాడని పోలీసు రిపోర్టు తర్వాత ఈ నోటీసు ఇచ్చారు. అజ్మల్ హక్ భారతసైన్యంలో 1986లో చేరారు. 2016లో రిటైరయ్యారు. 30 సంవత్సరాలు సైన్యంలో సేవలందించిన మాజీ సైనికాధికారికే పౌరసత్వం నిరూపించుకోక తప్పలేదు. ఆయన ఊరిలో మరో 40 మందికి కూడా నోటీసులు వెళ్ళాయి. వారంతా భారత పౌరులేనని అజ్మల్ హక్ అన్నారు. తాను ముస్లిం కావడం వల్లనే ఈ వేధింపులు ఎదురవుతున్నాయని భావించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చాలా బాధపడుతూ చెప్పాడు. సైన్యం నుంచి రిటైరయిన మరో హవల్దార్ మహీరుద్దీన్ అహ్మద్ అతని భార్య ఇద్దరు అక్రమ బంగ్లాదేశీలని ముద్రవేశారు. మహీరుద్దీన్ అన్నయ్య రిటైర్డ్ సెషన్స్ జడ్జి. విచిత్రమేమంటే మహీరుద్దీన్ తండ్రి పేరు లిస్టులో ఉంది, సోదరుల పేర్లున్నాయి. కాని ఇతని పేరు లేదు. ఎంత నిర్లక్ష్యంగా ఈ జాబితా తయారైందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు, చదువుకున్నవారు, ఆర్మీలో ఉన్నవారికి కూడా వేధింపులు తప్పనప్పుడు సాధారణ ప్రజలు, కూలీనాలి ప్రజలు తమ పౌరసత్వం నిరూపించుకునే పత్రాలు దాఖలు చేయడం సాధ్యమా? నవంబర్ 29, 2016న అర్ధరాత్రి మోర్జినా బీబీని అక్రమ బంగ్లాదేశీ అని అరెస్టు చేశారు. డిటెన్షన్ సెంటరు పేరుతో ఉన్న జైల్లో పారేశారు. జులై 2017న ఆమె తన పౌరసత్వాన్ని నిరూపించుకుని బయటపడగలిగింది. ఆమెకు నష్టపరిహారం ఎవరివ్వాలి? ఆమె అదృష్టవశాత్తు పౌరసత్వం నిరూపించుకోగలిగింది. నిరూపించుకోలేక అలమటిస్తున్నవారెంతమంది? అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలున్న అస్సాం నటుడు ఆదిల్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు కూడా వేధింపులు తప్పలేదు. ఆదిల్ హుస్సేన్ అన్న ప్రముఖ లాయర్, మాజీ శాసనసభ్యుడు మునవ్వర్ హుస్సేన్ కూడా అనుమానస్పదుడే అయ్యాడు. మొదటి ముసాయిదాలో భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబ సభ్యుల పేర్లే లేవు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మేనల్లుడు జియావుద్దీన్ అలీ అహ్మద్, ఆయన భార్య అకిమా బేగం, వారి కుమారులు హబీబ్ అలీ, వాజిద్ అలీల పేర్లు లేవు. ఎన్నార్సీలో పేర్లు లేనివారిలో బిజెపి ఎమ్మెల్యే దిలీప్ పాల్ భార్య అర్చనా పాల్ పేరు కూడా ఉంది. అంటే ఆమె అనుమానాస్పద ఓటరు కింద ప్రస్తుతం పరిగణించాలి. పొరబాట్లు జరగవచ్చని, తర్వాత అభ్యంతరాల్లో తన భార్య పేరు కూడా సిటిజన్ షిప్ రిజిష్టరులో వస్తుందని పాల్ అన్నారు. ఆయన బిజెపి ఎమ్మెల్యే కాబట్టి బహుశా తేలికగా ఈ పని చేయించుకోవచ్చు. కాని కూలీనాలి, బడుగు ప్రజలు ఏం చేయాలి? కాంగ్రెస్ ఎమ్మెల్యే అతావుర్ రహ్మాన్ మజర్ భయ్యా, ఎఐయుడిఎఫ్ నాయకుడు సమీముల్ ఇస్లాం ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా లేవు. సాయిరా బాను ఇండ్లలో పనిపాటలు చేసుకుని బతుకుతుంది. ఆమె పేరు, ఆమె కుమార్తె పేరు జాబితాలో ఉన్నయి కాని భర్త పేరు లేదు. ఇద్దరు కొడుకుల పేర్లు లేవు. ఈ నిరుపేద కుటుంబం ఫారినర్స్ ట్రిబ్యునల్ లో పోరాడి విజయం సాధించగలదా? నిజానికి ముస్లిములు అస్సామ్ లోకి వలస రావడం అన్నది 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి కారణం బ్రిటీషువారి విధానం. అధిక పంటలు పండించడానికి బెంగాల్ కు చెందిన ముస్లిములు వ్యవసాయక్షేత్రాలలో కష్టించి పనిచేసే రైతులని అస్సాం లో అందుబాటులో ఉన్న విశాల భూభాగాలను సాగు చేయడానికి తరలించారు. ఇరవయ్యో శతాబ్దం మొదటి దశాబ్దాలలో ఈ వలసలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. 1951 నాటికి అస్సాంలో ముస్లిం జనాభా 24 శాతానికి చేరుకుంది. స్వాతంత్య్రం తర్వాత అస్సాంకు ముస్లిములు వలస వెళ్ళడం అన్నది దాదాపు లేదని చెప్పాలి. అంతకు ముందు అస్సాం తరలి వచ్చిన బెంగాలీలు తమ మాతృభాషను కూడా వదిలేసి అస్సామీ మాతృభాషగా స్వీకరించారు. కాని అస్సాంలో ముస్లిములను బెంగాలీలని వేధించడం కొనసాగుతూ వచ్చింది. అస్సాం ఉద్యమకాలంలో ఊచకోతలు జరిగాయి. ఫిబ్రవరి 14, 1983లో దరాంగ్ జిల్లాలోని చౌల్ఖువాలో 500 మంది చంపబడ్డారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన నెల్లిలో 3,300 మంది ఊచకోత జరిగింది. హతమైనవారిలో పిల్లలు, మహిళలే ఎక్కువ. 2012లో జరిగిన ఖోఖ్రాజార్ హింసాకాండకు కూడా ఇదే సాకు. ఇప్పుడు చాలా సాధుస్వభావిగా కనిపిస్తున్న ఎల్. కె. అద్వానీ అప్పుడు ఖోఖ్రాజార్ హింసాకాండ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ భారతీయులకు, విదేశీయులకు మధ్య జరిగిన ఘర్షణగా పేర్కొన్నాడు. ఎన్నార్సీలో అక్రమ బంగ్లాదేశీలను గుర్తించి ఆ తర్వాత ఏం చేస్తారు? అస్సాం ఆర్ధిక మంత్రి హిమంత బిస్వాస్ చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై బంగ్లాదేశ్ తో మాట్లాడుతుందట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాటలే చెప్పారు. అక్రమ బంగ్లాదేశీలను బంగ్లాదేశ్ పంపేస్తామన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ కూడా ఇదే చెప్పారు. అక్రమ బంగ్లాదేశీలను సరిహద్దులు దాటిస్తామన్నారు. కాని ద్వైపాక్షిక చర్చల్లో అక్రమ బంగ్లాదేశీల గురించి మాట్లాడి ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్ స్నేహాన్ని కోల్పోయే పరిస్థితిలో లేదని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. బంగ్లాదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రోహింగ్యా శరణార్ధులను పెద్ద సంఖ్యలో ఆశ్రయమిచ్చిన బంగ్లాదేశ్ వారిని వెనక్కి పంపించాలని భావిస్తోంది. ఇప్పుడు 40 లక్షల మందిని అక్రమ బంగ్లాదేశీలుగా ముద్రవేసి వారిని బంగ్లాదేశ్ స్వీకరించాలని అడిగితే భారతదేశంతో స్నేహం ఉన్నప్పటికీ హసీనా ప్రభుత్వం ఒప్పుకుంటుందా?