Home అంతర్జాతీయ వార్తలు 13 బ్రిలియంట్

13 బ్రిలియంట్

int

మీరు ఎంతమంది..? 13 బ్రిలియంట్

థాయ్‌లాండ్ గుహ నుంచి క్షేమంగా బయటపడిన జూనియర్ టీం
9రోజుల ఉత్కంఠకు తెర
ప్రాణాలకు తెగించి కాపాడిన సహాయక సిబ్బంది

బ్యాంకాక్ : అదో పెద్ద గుహ.. కటిక చీకటి.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అందులోనే 9రోజులు.. అన్నం లేదు..మురికి నీళ్లే గతి. బతుకుతామో..లేదా ఏదైనా వరద తాకిడికి కొట్టుకుపోతామో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో గడపడమంటే దానంత దుర్ఘతి మరోటి ఉండదు. 12మంది బాలురతో పాటు వారి ఫుట్‌బాల్ కోచ్ మొత్తం 13మంది(వైల్డ్‌బోర్ టీమ్)కి ఎదురైంది ఈ దురదృష్ట ఘటన. థాయిలాండ్‌లోని ఉత్తర ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకుంటూ ఆ బాలల పరిస్థితిని తలుచుకుంటూ యావత్ ప్రపంచం ఇప్పుడు పాపం పసివాళ్లు అని విచారం వ్యక్తం చేస్తోంది. ఎట్టకేలకు గుహల్లో చిక్కుకుపోయిన 12 మంది బాలురు, వారి 25 ఏళ్ల పుట్‌బాల్ కోచ్ క్షేమంగా ఉన్నారని సోమవారంనాడు రాత్రి సమాచారం అందడంతో అంతా హమ్మయ్యా అనుకున్నారు. వారంతా ప్రాణాలతోనే ఉన్నారని చియాంగ్ రాయ్ ప్రావిన్స్ గవర్నరు ఒక ప్రకటనలో వెల్లడించారు. వారందర్నీ థాయిలాండ్ నావికాదళానికి చెందిన గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బంది క్షేమంగా తీసుకొచ్చే పనిలో ఉన్నారన్నారు. వారందరికీ ఆహారంతో పాటు సాయం వచ్చిన వైద్యుడ్ని పంపిస్తున్నామని చెప్పారు.
అసలు అక్కడికి ఎందుకు వెళ్లారు.
11 నుంచి 16 ఏళ్ల వయస్సుగల 12 మంది బాలురు, వారి కోచ్‌తో పాటు గుహలు చూడటానికి జూన్ 23న వెళ్లారు. విపరీతంగా వర్షాలు కురవడంతో ఊహించని రరీతిలో వరదనీరు పోటెత్తింది. అంతా ‘తామ్ -లువాంగ్ -నాంగ్‌నాన్’ అనే గుహలో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు థాయ్ నావికాదళంతో పాటు అమెరికా ఆస్ట్రేలియా, బ్రిటీషు, చైనా నుంచి 30మంది నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గల్లంతైన వారి జాడ పసిగట్టేందుకు ఉపగ్రహ వ్యవస్థను సైతం ఉపయోగించారు. ఆదివారానికి థాయిలాండ్ నావికాదళం ఓ కీలకమైన ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి గుహ రెండుగా చీలిపోయింది. లోపలికి కిమీ దూరం ఉన్నట్లు గమనించిన సహాయక సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లు, తాళ్ల సాయంతో అందులోకి ప్రవేశించారు. అదే క్రమంలో కొంతదూరం వెళ్లారు. బురదనీరు అడ్డంకిగా మారడంతో దాన్ని దాటుకుని వెళ్లారు. వారి గుసగుసలు చెవిన పడుతుండడంతో భద్రతా సిబ్బంది. ‘మీరు ఎంత మంది ఉన్నారు? అని బ్రిటీష్ భద్రతా సిబ్బందిలోని ఒకరు పెద్ద గొంతుకతో గట్టిగా అరిచారు. దానికి ‘13 బ్రిలియంట్’ అని ఓ చిన్న గొంతుక నుంచి సన్నగా సమాధానం వచ్చింది. ఆ వాయిస్ ఎటువైపు నుంచి వచ్చిందో అటు వైపు టార్చిలైట్ వెలుతురు పడింది. ఎర్రటి టీ షర్టులు ధరించిన ఈ ఫుట్‌బాల్ జట్టు దీనంగా చూస్తూ కనిపించారు. తమను ఆదుకునేందుకు కొంత మంది వచ్చారన్న సంతోషం వారి మోములో కనిపిస్తున్నా బిగ్గరగా దాన్ని వ్యక్తం చేయగలిగేంతా ఆసరా వారిలో లేదు. జట్టు దగ్గరికి చేరుకున్న తర్వాత ‘మీరు చాలా గ్రేట్ అండ్ వెరీ స్ట్రాంగ్’ అని బ్రిటీషర్ వారిని అభినందించారు.
దానికి చిన్నారులంతా ‘మీకు చాలా థాంక్యూ. మేమంతా చాలా హ్యాపీ’ అన్నారు. ఆ తర్వాత 13మంది బృందానికి ఒక టార్చిలైట్ చేతికిచ్చి, ఆ సహాయకుడు తన చేతిలో ఒక టార్చ్ పట్టుకుని గుహ నుంచి బయటి ప్రపంచం వైపు కదిలారు.