Home ఎడిటోరియల్ అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం

అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం

sampadakeyam

తమ ముంబయి బ్రాంచిలో రూ.11,346 కోట్లు దగా జరిగిందని కనుగొన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసిన ప్రకటన దేశ ప్రజలను నివ్వెరపరిచింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐ తర్వాత ఇదే అతిపెద్ద బ్యాంక్. బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎలు మొండిబాకీలు) రూ.10లక్షల కోట్లకు చేరి బ్యాంకింగ్ వ్యవస్థ దివాలా అంచుకు చేరిన దశలో ఈ కుంభకోణం మరింత దిగ్భ్రాంతికరం. వేలకోట్లకు పడగలెత్తిన వజ్రాలవ్యాపారి నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు కాగా పిఎన్‌బి సీనియర్ అధికారులు కొందరికి కూడా ఇందులో పాత్ర ఉంది. దేశ, విదేశాల్లో వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్న ఈ మోడీ కంపెనీలు పిఎన్‌బి బ్రాంచిలో కరెంట్ అక్కౌంట్లు మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే ఆ కంపెనీల తరఫున లోపాయికారి పద్ధతుల్లో వారు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (పూచీకత్తు పత్రం) సంపాదించారు. ఇది బ్యాంకులో డబ్బు జమచేయకుండా డిడి సంపాదించి దాని ఆధారంగా విదేశాల్లోని వివిధ బ్యాంకు బ్రాంచీలనుంచి నగదు తీసుకోవటం లాంటిది. ఆ లేఖ ఆధారంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్‌బ్యాంక్ విదేశీ బ్రాంచీలు నీరవ్ మోడీకి రుణాలు ఇచ్చాయట. ఆ పూచీకత్తు లేఖ ఇచ్చిన అధికారి రిటైర్మెంట్ తదుపరి అవే కంపెనీలు కొత్త పూచీకత్తు పత్రాలకై బ్యాంకును సంప్రదించినపుడు ఈ లోపాయికారి భాగోతం బయటపడింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుపై సిబిఐ, ఇడి రంగంలో దిగాయి. పర్యవసానంగా నాలుగు ప్రసిద్ధ వజ్రవ్యాపార కంపెనీలు గీతాంజలి, గిన్నీ, నక్షత్ర, నీరవ్‌మోడీ దర్యాప్తు ఎదుర్కొంటున్నట్లు చెప్పబడుతున్నది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో గత ఆరేళ్లుగా ఇటువంటి లోపాయికారి వ్యవహారాలు జరుగుతున్నాయట. అధికారులతో కుమ్మక్కుతో ఇలాంటి రుణం పొందినవారు సకాలంలో తిరిగి చెల్లిస్తుంటే ఆ భాగోతం మరుగున ఉంటుంది. అధికారులు వారి కమిషన్‌తో సంతోషపడుతుంటారు. నీరవ్ మోడీ తమ వంతు 10శాతం మార్జిన్ మనీ చెల్లించటంలో విఫలం కావటంతో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఇది అతనిపై 10 రోజుల్లో రెండవకేసు. 2017లో రూ.280కోట్ల 70లక్షలకు మరో పిఎన్‌బి బ్రాంచిని దగా చేసిన కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. మరో ప్రభుత్వరంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇద్దరు ఢిల్లీ వ్యాపారులు తమ బ్యాంకును రూ.6వేలకోట్లకు దగాచేసిన కేసును 2015లో వెలుగులోకి తెచ్చింది. దిగుమతులకు ముందుగా చెల్లింపుల నిమిత్తం వ్యాపారులు, బ్యాంక్ అధికారుల కుమ్మక్కుతో ఇటువంటి విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు జరుగుతుంటాయట! 2.3 బిలియన్ డాలర్లతో ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీ వ్యవస్థాపకుడైన నీరవ్‌మోడీ మూడు ఖండాల్లో లండన్, న్యూయార్క్, లాస్‌వెగాస్, హవాయి, సింగపూర్, బీజింగ్, మకావ్, భారత్‌లో ముంబయి, ఢిల్లీలో దుకాణాలు నడుపుతున్నాడు. తాజా దగాకోరు వ్యవహారం బయటపడ్డాక, రూ.5వేలు కోట్లు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నానని మోడీ చెప్పినట్లు వార్తలొచ్చాయి.
2017 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.230కోట్ల 11లక్షల లాభం ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ మోసకారి భాగోతం బయటపడటంతో నష్టాల్లోకి జారుకుంటుంది. పిఎన్‌బితోపాటు ఇండియన్ బ్యాంక్, కెనరాబ్యాంక్, బరోడా, విజయాబ్యాంకులు మాత్రమే ఎంతో కొంత లాభం ప్రకటించాయి. ఎస్‌బిఐ సహా మిగతా 16ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తంమీద రూ.18,947కోట్ల 59లక్షల నష్టం ప్రకటించాయి. ట్రెజరీ ఆపరేషన్స్ నుంచి ఈసారి లాభాలు రాకపోవటం ఇందుకొక కారణంకాగా, మొండి బాకీల రద్దు కొరకు అధిక కేటాయింపు ప్రధాన కారణం.
కింగ్‌ఫిషర్ అధినేత విజయమాల్యాకు ఎస్‌బిఐ నాయకత్వంలో బ్యాంకుల
కన్సార్టియం రూ.9వేల కోట్ల రుణమిచ్చిన కేసుకు ఈ వజ్రాల వ్యాపారి కేసు పూర్తిగా భిన్నమైంది. అది ప్రత్యక్ష రుణం కాగా ఇది లోపాయికారి భాగోతం. బ్యాంకుల నిర్వహణను కట్టుదిట్టం చేసేందుకు ఎన్ని వ్యూహాలు అమలు జరుపుతున్నా ఇటువంటి మోసాలు జరుగుతున్నాయంటే లొసుగులు ఇంకా చాలానే ఉన్నాయని విదితమవుతున్నది. బ్యాంకర్ల ప్రతాపమంతా సామాన్యులపైనే. కార్పొరేట్లు ఎగనామం పెడుతున్న లక్షల కోట్ల భారం మోయవలసిందీ పన్ను చెల్లింపుదారులే!