Home రాష్ట్ర వార్తలు అతిపెద్ద వస్త్రపురి

అతిపెద్ద వస్త్రపురి

KCR

ఆజంజాహీని తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు
దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ కానున్నది
స్పిన్నింగ్ నుంచి దుస్తుల తయారీ వరకు అన్నీ ఇక్కడే
లక్ష మందికి ఉద్యోగాలు వలస కార్మికులు వెనక్కి రావాలి
తొలి రోజునే 22 కంపెనీలతో ఎంఒయులు
జూన్ నాటికి కాళేశ్వరం నుంచి ముందుగా వరంగల్‌కే నీరు
అసెంబ్లీలో పంచాయతీరాజ్ కొత్త బిల్లు, గడువులోపే ఎన్నికలు
ఆలోపే పంచాయతీలుగా తండాలు, గూడేలు
వరంగల్ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/ వరంగల్ : ‘పోరాటాల ఖిల్లా ఓరుగల్లు తెలంగాణ ఉద్యమంలో నాకు ఊపిరినిచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను. తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి అడుగు పెడతానని ప్రకటించి రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చాను. అజంజాహీ మిల్లును తలదన్నే టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌లో నిర్మించుకుంటామని ఉద్యమంలో చెప్పుకున్నా ము. ఆ కలను సాకారం చేసుకొని దేశంలోనే ఎక్కడా లేని విధంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది’ అని ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి వద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు, కాజీపేటలో ఆర్‌ఒబి, అర్బన్ జిల్లా మడికొండలో ఐటి పార్కు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పరకాల ఎంఎల్‌ఎ చల్ల ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ సూరత్‌లో చీరలు తయారీ చేసే పరిశ్రమ ఉంది, తిరుపూర్‌లో చడ్డీలు, బనియన్ల తయారీ కర్మాగారాలున్నాయి. షోలాపూర్‌లో దుప్పట్లు, చద్దర్లు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్‌లో ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్‌టైల్ పార్కులో ఈ మూడింటినీ ఒకేచోట తయారు చేయడం జరుగుతుందన్నారు. తెల్ల బంగారం పండే వరంగల్ జిల్లాలో స్పిన్నింగ్ నుంచి రెడీమేడ్ దుస్తుల వరకు తయారవుతాయన్నారు. వరంగల్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి వలసలు పోయిన చేనేత కార్మికులు వెనక్కి రావాలని సిఎం పిలుపుని చ్చారు.
లక్ష మందికి ఉద్యోగాలు : మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. పార్కు శంకుస్థాపన రోజునే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్త్రాలను తయారు చేసే 22 కంపెనీలు 3900 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందు కు ఒప్పందం (మొదటిపేజీ తరువాయి)
కుదుర్చుకున్నాయన్నారు. మొదటి సంవత్సరంలోనే ప్రత్యక్షంగా 27వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతోపాటు పరోక్షంగా మరో 50వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. టెక్స్‌టైల్ పార్కు కోసం భూములు కొల్పోయిన కుటుంబాల్లో ఇంటికొకరికి ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సింగిల్ విండో విధానం వల్ల 5017 పరిశ్రమలు
దేశంలో,ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రవేశపెట్టిన సింగి ల్ విండో విధానం వల్ల ఇప్పటి వరకు 5017 పరిశ్రమలను తెలంగాణలో నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు. వాటి ద్వారా 1లక్షా 7వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. వరంగల్‌కు టెక్స్‌టైల్ పార్కు వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ వచ్చిందన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నింటినీ వరంగల్‌లోనే ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు
వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధి తరువాత ఇక్కడ మామునూరులో విమానశ్రయం ఏర్పాటుకు ప్రత్యేక చర్య లు తీసుకుంటామన్నారు. రెగ్యులర్‌గా కాకున్నా విమానా లు నడిచే విధంగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా వరంగల్ కాజీపేట నుంచి దేశ నలుమూలకు వెళ్లే రైలు మా ర్గాలు ఉండడం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసే వస్త్ర పరిశ్రమకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అన్ని రకాలైన వస్త్రాలకు వరంగల్ దేశంలోనే పెద్ద మార్కెట్‌గా అభివృద్ధి చెందుతుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
శాసనసభ సమావేశాల్లో పంచాయతీరాజ్ కొత్త బిల్లు
వచ్చే శాసనసభా సమావేశాలలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన కొత్త బిల్లు ప్రవేశపెట్టే సాహసాన్ని ప్రభుత్వం చేయబోతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలకు నేరుగా బడ్జెట్ నుంచి నిధులు కేటాయింపు జరుగుతుందన్నారు. ఇందు కోసం ఏటా రెండు, మూడు వేల కోట్ల రూపాయల నిధులను బడ్జెట్ నుంచి కే టాయిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీకి 10లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు కేటాయించడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను గడువులోపే నిర్వహిస్తామని ముఖ్యమం త్రి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేస్తారనే ఊహాగానాలలో రాజకీయ పార్టీలు ఉన్నాయని, అలాంటిది ఏమీలేదని, ఏదేమైనా ఎన్నికలను మాత్రం షె డ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్నారు. ఈలోపే రాష్ట్రంలో ఉన్న తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏ ర్పాటు చేస్తామని, ఈసారి జరిగే శాసనసభా సమావేశాలలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రా ష్ట్రంలో 8వేల వరకు పంచాయతీలు ఉన్నాయని, తండాలు, గూడేలను పంచాయతీలుగా చేయడం వల్ల మరో నాలుగైదు వేల పంచాయతీలు పెరిగే అవకాశం ఉందన్నారు.
కాళేశ్వరం ద్వారా మొదట నీరు వరంగల్‌కే
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల సాగునీటి సమస్య పూర్తిగా తీరిపోనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొదట వరంగల్ జిల్లాకే నీళ్లు వస్తాయని, రెండు పంటలు పండుతాయన్నారు. దమ్మున్న రైతులు మూడు పంటలను పండించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అసంఘటితంగా ఉన్న రైతులను సమన్వయ సమితుల ద్వారా సంఘటితం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఐదు వేల కోట్ల రూపాయలతో 25లక్షల 80వేల గొర్రెలను పంపిణీ చేశామని, వెయ్యి కోట్లతో మ త్సకారులకు అభివృద్ధి నిధులు, ఎంబిసిలకు వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించామన్నారు. దేశంలో ఎక్కడ లేని వి ధంగా సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఐటి, చే నేత జౌళిశాఖ మంత్రి కెటిఆర్, ఆర్‌అండ్‌బిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, చేనేత, జౌళిశాఖ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ బాలమల్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎంపిలు అజ్మీర సీతారాంనాయక్, పసునూరి దయాకర్, బోయినపల్లి వినోద్‌కుమార్, శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎంఎల్‌సి కొండా మురళీధర్‌రావు, ఎంఎల్‌ఎలు అరూరి రమేష్, దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డిఎస్ రెడ్యానాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, డాక్టర్ తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.