Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వరంగ బ్యాకుల నష్టాలు 87,000 కోట్లు

 banks

201718 ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయిన 19 పిఎస్‌బిలు

 నష్టాల్లో తొలి స్థానంలో పిఎన్‌బి, రెండో స్థానంలో ఐడిబిఐ బ్యాంక్ 

 రెండు బ్యాంకులకు మాత్రమే లాభాలు

న్యూఢిల్లీ: కుంభకోణాలు, మోసాల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) లేదా మొడి బకాయిలు ప్రతి ఏటా పెరగుతూ పోతున్నాయి. వీటి కారణంగా త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను ప్రకటించాల్సిన పరిస్థితి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (201718) ప్రభుత్వరంగ బ్యాంకుల(పిఎస్‌బిల) మొత్తం నష్టాలు అంతా ఇంతా కాదు.. ఏకంగా రూ.87,000 కోట్లను దాటాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మోసానికి పాల్పడిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి) వాటానే అత్యధికంగా రూ.12,283 కోట్లు ఉండడం గమనార్హం. పిఎన్‌బి తర్వాత ఐడిబిఐ బ్యాంక్‌కు భారీ నష్టాలు వచ్చాయి. మొత్తం 21 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రెండు బ్యాంకులు.. ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్‌లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. ఇండియన్ బ్యాంక్ అత్యధికంగా రూ.1,259 కోట్ల లాభాన్ని, అలాగే విజయా బ్యాంక్ రూ.727 కోట్లు లాభాన్ని ఆర్జించింది. మిగతా 19 ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.87,357 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని బ్యాంకులు విడుదల చేసిన త్రైమాసిక గణాంకాలు చెబుతున్నాయి. 201617 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 పిఎస్‌బిలు కలిసి అత్యంత తక్కువగా రూ.474 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. ఆ తర్వాత వరుసగా నష్టాలను నమోదు చేస్తూ వస్తున్నాయి. నష్టాలు చవిచూసిన బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి స్థానంలో ఉంది. దీనికి కారణం వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఈ బ్యాంకులో రుణాల పేరిట రూ. 14వేల కోట్లకు పైగా మోసం చేయడమే.. కుంభకోణం నేపథ్యంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో పిఎన్‌బి రూ. 12,282.82కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే బ్యాంక్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,324.8కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం విశేషం. పిఎన్‌బి తర్వాత రూ. 8,238 కోట్ల నికర నష్టంతో ఐడిబిఐ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ ఈ బ్యాంక్ రూ. 5,158.14 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇక దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ నష్టాలను మూటగట్టుకుంది. రూ. 6,547 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బిఐ రూ.10,484 కోట్ల నికర లాభాన్ని పొందడం గమనార్హం. కుంభకోణాలు, మోసాలతో బ్యాంకులకు మొండిబకాయిలు పెరిగి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.
2017 డిసెంబరు నాటికి బ్యాంకింగ్ రంగంలో రూ. 8.31లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. అయితే 21 పిఎస్‌బిలలో 11 బ్యాంకుల మొండి బకాయిలు పెరగడంతో బలహీనపడ్డాయి. వీటిని రిజర్వు బ్యాంక్ పిసిఎ(తక్షణ దిద్దుబాటు చర్య) పరిధిలోకి చేర్చింది. మూడు రోజుల క్రితం ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమైన కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ మొండి బకాయిల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒత్తిడి రుణాల వేగవంత పరిష్కారం కోసం ఎఆర్‌సి(అస్సెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ) ఏర్పాటుపై రెండు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిఎన్‌బి(పంజాబ్ నేషనల్ బ్యాంక్) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహ్తా ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
ఎన్‌పిఎ నుంచి పిఎన్‌బి రూ.8 వేల కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ దివాలా కింద దాదాపు రూ.8 వేల కోట్లను పొందవచ్చని పంజాబ్ నేషనల్ బ్యాంక్ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొండి బకాయిల నుంచి ఈ మొత్తాన్ని అందుకుంటామని పిఎన్‌బి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రుణాల ఎగవేతదారుల నుంచి నిధులను రాబట్టే పనిలో బ్యాంకులు బిజీగా ఉన్నాయి. ఇందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన దివాలా చట్టం బ్యాంకులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
మార్చి ముగింపు నాటి క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో పిఎన్‌బి నికర నష్టం రూ.13,417 కోట్లుగా ఉంది. నీరవ్‌మోడీ, మెహుల్ చౌక్సీల రూ.13 వేల కోట్ల భారీ కుంభకోణం కారణంగానే ఈ త్రైమాసికంలో పిఎన్‌బి భారీగా నష్టాలను నమోదు చేసింది. పిఎన్‌బి కుంభకోణంతో గతేడాది త్రైమాసికంలో నమోదైన రూ.5,753.3 కోట్ల నష్టం కంటే ఇది మూడు రెట్లు పెరిగింది. అలాగే మొండి బకాయిల కేటాయింపులు కూడా మూడు రెట్లు పెరిగాయి. ఈ కేటాయింపులు రూ.3,908.3 కోట్ల నుంచి రూ.10,080.9 కోట్లకు చేరాయని బ్యాంక్ తెలిపింది.

Comments

comments