Search
Sunday 18 November 2018
  • :
  • :

మెడికల్ షాపుల మాయాజాలం

medical

* బిల్లులు లేకుండా మందుల విక్రయాలు.. ప్రభుత్వాదాయానికి గండి
* భారీగా జనరిక్ మందుల అమ్మకాలు
* డిస్కౌంట్‌ను నొక్కేస్తున్న వ్యాపారులు
* శాంపిల్స్, కాలంచెల్లిన మందుల అమ్మకాలు

మన తెలంగాణ/దుగ్గొండి : మండలంలో మెడికల్ షాపుల మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. మెడికల్ యాజామాన్యాలు బిల్లులు ఇవ్వకుండా మందులను అంటగడుతున్నారు. ఫలితంగా తమ టర్నోవర్‌ను తక్కువ చూపుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగనామం పెడుతున్నారు. బిల్లులు ఇవ్వకుండా మందులను విక్రయించి తాము విక్రయాలు జరుపలేదన్న రీతిలో సదరు అధికారులకు చూపుతున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అధికారులు అవేమి పట్టక, సదరు షాపు యాజమాన్యాలు ఇచ్చిన ముడుపులు పుచ్చుకుని వారు చూపిన టర్నోవర్‌కి పన్నులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెడికల్ షాపుల యాజమాన్యాలు తమ ఇష్టారీతిలో టర్నోవర్‌ను చూపుతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా చిల్లుపెడుతున్నారు.
భారీగా జనరిక్ మందుల అమ్మకాలు... మందుల వ్యాపారమంతా జనరిక్ మయంగా మారింది. బ్రాండెడ్ మందుల కొనుగోలు పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారడంతో వివిధ మందుల కంపెనీలో అదే ఫార్మూలాతో అతి తక్కువ ధరకు జనరిక్ పేరుతో మందులను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. బ్రాండెడ్ మందుల విక్రయాలపై మెడికల్ పెద్దగా లాభాలు ఉండకపోవడంతో మెడికల్ షాపు యాజమాన్యాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే జనరిక్ మందును విక్రయంపైనే ఆసక్తి చూపుతున్నారు. జనరిక్ మందులపై ఉన్న ఎంఆర్‌పికి మెడికల్ వ్యాపారులకు లభించే ధరకు భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటోంది. ఉదాహరణకు 100 రూపాయలు ఎంఆర్‌పి ఉన్న దానిని 20 రూపాయలకే అందిస్తున్న కంపెనీలు ఉన్నాయి. ప్రతీ దానిలో ఎంఆర్‌పి లో అత్యధికశాతం డిస్కౌంట్‌ను వినియోగదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏఒక్క దుకాణదారుడు వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వడం లేదు. ఆబ్రాండెడ్ మందుల ధరలతో సమానంగా ఈ మందులను విక్రయిస్తున్నారు. జనరిక్ మందుల గురించి తెలిసిన వారెవరైనా ప్రశ్నిస్తే మాత్రం డిస్కౌంట్ ఇస్తారు. లేదంటే రోగి జేబులకు చిల్లు తప్పదు.
శాంపిల్స్, కాలం చెల్లిన మందులు సైతం విక్రయాలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నిరాక్షరాస్యతను కొందరు మెడికల్ దుకాణాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ కంపెనీల ద్వారా మాత్రమే అందుతున్న శాంపిల్స్‌ను సైతం విక్రస్తున్నారు. ఈ మందును డాక్టర్లు మాత్రమే రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉచితంగా అందచేయాల్సి ఉంటుంది. కానీ మెడికల్ దుకాణాల్లో సైతం ఈ శాంపిల్స్ విరివిగా లభ్యమౌతున్నాయి. వాటని రోగులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని మెడికల్ షాపుల యాజమానులు ఏకంగా కాలం చెల్లిన మందులను సైతం అంటగుడుతున్నారు. తెలివిగా తయారీ ఎక్స్‌పేర్ తేదీ లేనివైపు కత్తిరించి ఇస్తున్నారు. కొన్నింటిపై ఏకంగా ముద్రలు వేసి విక్రయిస్తున్నారు.
ఫార్మాసిస్టులు లేకుండా మెడికల్ షాపులు
లాభార్జనే ద్యేయంగా మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకున్న కొందరు వ్యక్తులు ఇతరుల భీఫార్మసీ, డీఫార్మసీ దృవపత్రాలను అద్దెకు తీసుకుని దుకాణాలను నడుపుతున్నారు. కొన్ని షాపులకు ఫార్మసి ధృవపత్రాలు లేకుండా నడుపుతున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఫార్మాసిస్టు మాత్రమే మెడికల్ షాపును నిర్వహించాలి. కానీ ఈ నిబంధన ఎక్కడ అమలు కావడం లేదు. ఇప్పటికైనా అదికారులు మామూళ్ల మత్తును వీడి వినియోగదారుడికి మేలు జరిగేలా చూసి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుకోవాలని నిబందనల ప్రకారం మెదలని షాపులను మూసివేయాలని , శాంపిల్స్, కాలం చెల్లిన మందులు అమ్ముతున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments