Home పెద్దపల్లి వొడాఫోన్ సిమ్ స్కాంలో ప్రధాన నిందితుడి అరెస్టు

వొడాఫోన్ సిమ్ స్కాంలో ప్రధాన నిందితుడి అరెస్టు

The main Accused in Voda Sim scam was arrested
ధర్మారంలో సంతోష్ సమక్షంలో పోలీస్ బృందం విచారణ
వివరాలు సేకరించిన క్లూస్‌టీం
భారీగా వచ్చిన జనం
మన తెలంగాణ/ధర్మారం : ఆధార్, వేలిముద్రలు సేకరించి వొడా సిమ్ స్కాంలో ప్రధాన నిందితుడిగా పోలీస్ కస్టడిలో ఉన్న పాత సంతోష్‌ను శుక్రవారం ధర్మారం తీసుకవచ్చిన ప్రత్యేక పోలీస్ బృందం, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. వొడా సిమ్‌లు టార్గెట్ కోసం వేలాది ఆధార్ కార్డ్‌లతో సహా వేలిముద్రలు సేకరించేందుకు స్థావరంగా ఎంచుకున్న ధర్మారంలోని పాత సంతోష్ ఇంటిలోని వెనుక వైపున ఉన్న బంగ్లాతో అనువణువున శోధించారు. సంతోష్ కాల్చివేసిన వేలాది సిమ్‌లతో పాటు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, వెలిముద్రల కోసం ప్రత్యేకంగా తెప్పించిన మిషన్‌తో పాటు సామాగ్రిని, డాక్యుమెంట్లను క్లూసి టీం బృందం సేకరించారు. సంతోష్ సమక్షంలోనే ప్రతి వస్తువును సీజ్ చేసిన అనంతరం గణేష్ నగర్‌లోని సంతోష్, వొడాఫోన్ దుకాణంలోని కంప్యూటర్ సిపియు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేడారంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లగా మూసి వుండడంతో వెనుదిరిగిన ప్రత్యేక పోలీస్ బృందం, క్లూసీ టీం ధర్మారం స్టేషన్‌కు అక్కడి నుండి హైద్రాబాద్ తరలించారు. సంతోష్‌ను మీడియాకు చిక్కకుండా ప్రత్యేక పోలీస్ బృందం జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా క్లూసి టీం ఇన్స్‌పెక్టర్ బాల్‌రెడ్డి విలుకర్లతో మాట్లాడుతూ పోలీస్ కస్టడిలో ఉన్న సంతోష్ ఇస్తున్న సమాచారం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. సంతోష్ కీలకమైన సమాచారం అందించాడని, దర్యాప్తు వేగంగా జరుగుతుందని బాల్‌రెడ్డి స్పష్టం చేశారు. సంతోష్ ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున రాగా ఎస్‌ఐ నేలాల దేవయ్య, పిసిలు రాజేశ్, వెంకటేష్‌లు జాగ్రత్తలు చేపట్టి ప్రత్యేక పోలీస్ బృందానికి సహకరించారు.