Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

జ్వలించే జ్ఞాపకం

ph

అమరవీరుల స్థూపం రూపానికి సిఎం ఆమోదం 

ఏడంతస్థుల స్థూప భవనంలో కన్వెన్షన్ హాల్, ఆడియో విజువల్ థియేటర్, ఫొటో గ్యాలరీ, ఉద్యమ మ్యూజియం, రెస్టారెంట్ తదితరాలు ఉండేలా డిజైన్ రూపకల్పన
20 అడుగుల ఎత్తు జ్యోతి
లుంబినీ పార్కు ఆనుకొని ఉన్న మూడెకరాల స్థలంలో పాతిక మీటర్ల ఎత్తున నిర్మాణానికి వచ్చే నెలారంభంలో టెండర్లకు పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల స్థూపం డిజైన్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశల్లో అమరులైనవారి జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభు త్వం నగరంలో ఉన్నతమైన అమరుల స్థూపాన్ని నిర్మించాలని తలపెట్టింది. ఇందుకు రూ. 80 కోట్లను కూడా మంజూరు చేసింది. లుంబినీ పార్కుకు ఆనుకుని ఉన్న మూడెకరాల స్థలంలో సుమారు పాతిక మీటర్ల ఎత్తులో ఈ స్మారకాన్ని నిర్మించడానికి రంగం సిద్ధమైంది. గతంలో రూపొందించిన స్మారక స్థూపం నమూనాకు ఇటీవల స్వల్ప మార్పులు చేసిన తర్వాత సిఎం ఆమోదం లభించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి స్మారకస్థూపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు రోడ్డు భవనాల శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. తెలంగాణ శకటాన్ని రూపొందించిన ప్రముఖ ఆర్టిస్టు రమణారెడ్డి ఈ నమూనాను తయారుచేయగా తనికెళ్ళ ఇంటిగ్రెటెడ్ కన్సల్టెంట్లు అనే సంస్థ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించింది. ప్రస్తుతం పర్యాటకశాఖ వినియోగంలో ఉన్న ఈ స్థలాన్ని జిహెచ్‌ఎంసి ఇటీవల తన ఆధీనంలోకి తీసుకుంది. మొత్తం ఏడంతస్తులతో డిజైన్ చేసిన ఈ స్మారక స్థూపంలో ఒక కన్వెన్షన్ హాల్ (700 మంది కూర్చునేలా 715 చ.మీ. విస్తీర్ణం), ఆడియో విజువల్ థియేటర్ (150 మందికి సరిపోయేలా 152 చ.మీ. విస్తీర్ణం), ఫోటో గ్యాలరీ (60 చ.మీ.), ఉద్యమాన్ని ప్రతిబింబించే మ్యూజియం (60 చ.మీ.), రెస్టారెంటు తదితరాలు ఉంటాయి. సందర్శకుల తాకిడి గణనీయంగా ఉంటుందని భావించిన ఆర్కిటెక్ట్‌లు భూమి లోపల రెండు సెల్లార్ అంతస్తులను వాహనాల పార్కింగ్ కోసమే కేటాయించేలా డిజైన్‌ను రూపొందింది. డిజైన్ ప్రకారం నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాల కోసం రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆరు చోట్ల మట్టి సమూనాలను సేకరించి అనువుగా ఉన్నట్లు ధృవీకరించారు. వెలుగుతున్న జ్యోతి, ప్రమిద ఆకారంలో ఉండే ఈ స్థూపం భూ ఉపరితలం నుంచి 23 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. వెలుగుతున్న జ్యోతిలా ఉండే ఆకారం ఎత్తు సుమారు 20 అడుగుల కంటే ఎక్కువే ఉంటుంది. రాత్రివేళల్లో వెలుగుతున్నట్లుగా కనిపించేలా ప్రత్యేకమైన ఫైబర్‌తో తయారుచేసి ‘గ్లో సైన్’ దీప కాంతులను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాంగణంలో నీళ్ళ ఫౌంటెయిన్ మధ్యలో సుమారు 15 మీటర్ల ఎత్తులో స్థూపాన్ని, దానిపైన చివర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అమర్చేలా డిజైన్ రూపొందింది. ఈ స్థూపానికి ఇరువైపులా పది జిల్లాలకు ప్రతీకగా పది అమరుల స్థూపాలు కూడా ఉంటాయి. టాంక్‌బండ్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న బుద్ధ విగ్రహం, జాతీయ జెండా స్థూపం సైతం ఇక్కడికి కనిపించేలా డిజైన్ రూపొందింది. టెండర్లు ఖరారైన తర్వాత ఏడాదికాలం లోపే నిర్మాణం పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. అమరవీరుల త్యాగం నిత్యం స్ఫురణలో ఉండేలా జ్వలిస్తున్న జ్యోతి ఆకారం, ప్రమిద తరహాలో డిజైన్‌ను రూపొందించడం విశేషం.

Comments

comments