Home లైఫ్ స్టైల్ మందిని ముంచుతున్న మందుల పరీక్షలు

మందిని ముంచుతున్న మందుల పరీక్షలు

 • నిరుపేదలు, దళిత బహుజనులే బలి పశువులు

Medical-Middle-Class

క్లినికల్ ట్రయల్స్ (ఔషధ ప్రయోగాలు) ప్రజల ఆరోగ్యం కాపాడడానికి చేసేవి. అంతేగాని ప్రజల ప్రాణాలు తీసేవి కాకూడదు. ఇవి పత్యేక అనగా ఎమర్జన్సీ పరిస్థితులను సైతం ఎదుర్కోగల వసతులున్న క్లినిక్‌లు లేదా అసుపత్రులలో మాత్రమే జరగాలి. అది కూడా మొదట లేబ్ ( lab) ఆ తర్వాత జంతువులపై ప్రయోగాలు జరిగాక క్లినికల్ ట్రయల్ జరగాలి.
అసలు ఈ క్లినికల్ ట్రయల్స్ ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం. 1747 సం॥లో జేమ్స్‌విండ్ (Father of clinical trials) బ్రిటిష్ నేవీలో ఉన్న స్కర్వీ (విటమిన్ C లోపం) పేషెంట్ల ఆహారం విషయంలో ఒక ప్రయోగం చేశాడు. వారి ఆహారానికి వివిధ రకాల సప్లిమెంట్లు (తోడు పదార్థాలు ) (వెనిగర్, సముద్రపు నీరు, నిమ్మ- నారింజ, సిడార్ వగైరాలను కలిపి ఇచ్చాడు. నిమ్మజాతి పండ్ల రసాన్ని సప్లిమెంటుగా తీసుకున్న వారు ఆ రోజుల్లో స్కర్వీ తగ్గి తమ తమ పనులు చేసుకోడానికి సిద్ధమయ్యారు. కాని అప్పట్లో ఈ పండ్ల రసాలు చాలా ఖరీదైనవయినందువల్ల వాడుకలోకి రాలేదు. 50 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ నేవీలో నిమ్మరసాన్ని వారి ఆహారానికి తప్పని సరి సప్లిమెంటు చేశారు. ఈ కారణంగానే అమెరికన్లు బ్రిటిష్ వారిని ‘లైమీ’ ‘(limeys)’ అని పిలవ నారంభించారట. అలా ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా ఈ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.
అలా మొదలయిన మందుల పరిశోధన 1800 సం॥ నుంచి అనేక దశలుగా అభివృద్ధి చెందింది. ఈ పరిశోధనలో placebo అనేదాన్ని 1863 లో ప్రారంభించారు. 1946 సంవత్సరంలో నూతన (Modern) క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 1019 రకాల మందులపై పరిశోధనలు జరిగాయి. 1948 సంవత్సరంలో స్ట్రెప్టోమైసిన్ అనే టిబి మందుపై పరిశోధన జరిగింది. ఇలా అనేక సంవత్సరాలుగా జరుగుతూ అభివృద్ధి చెందుతున్న ఈ పరిశోధనా కార్యక్రమాన్ని సవ్యంగా జరిగేలా చూడ్డానికి అనేక రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్‌లైన్స్ జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ ఏర్పరచుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి :

1వ దశ : క్లినికల్ ట్రయల్స్‌లో లేబ్ టెస్టులు, జంతువుల మీద ప్రయోగాలు జరిగిన తర్వాతే ప్రమాదం లేదని కొంత అవగాహన కలిగాకే 1వ దశ ప్రయోగానికి వెళ్లాలి. ఆరోగ్యవంతులైన కొద్ది మంది (100 మంది) వాలంటీర్లపై ప్రయోగిస్తారు. దీనిలో మందు ప్రమాదకారి అవునో కాదో, సైడ్ ఎఫెక్టులున్నాయా (వ్యతిరేక ప్రభావాలు) లేవా అని తెలుసుకుంటారు.
2వ దశ : కొంచెం పెద్ద (500 మంది వరకు) పేషంట్లపై ప్రయోగిస్తారు. దీనివల్ల ఫలానా జబ్బుపై ఈ ప్రయోగించిన మందు ఎలా పని చేస్తుంది (efficacy) అనేది తెలుస్తుంది.,
3వ దశ : పెద్ద గ్రూపుపై (5000 మంది వరకు) మందును ప్రయోగిస్తారు. మందును ఏ పద్ధతిలో వాడాలి, ఇంతకు ముందున్న మందులకంటె దీనికున్న ప్లస్ పాయింట్ ఏమిటి, సేఫ్‌గా ఎలా వాడాలి, మార్కెట్‌కి చేరే ముందు అనుమతి పొందడానికి దీనిలో పరిశోధన జరుగుతుంది.
4వ దశ : మందును వివిధ రకాలైన ప్రజా సమూహాలపై, ఎక్కువ సంఖ్య ప్రజలపై ప్రయోగిస్తారు. దీనివల్ల ఈ మందు ఎంత సురక్షితం, ఎంత బాగా పని చేస్తుందో గమనిస్తారు. దీర్ఘకాలం ఉపయోగించడంవల్ల వచ్చే చెడు ప్రభావాలు (SIDE EFFECTS) కూడ తెలుసుకుంటారు. విస్తృతంగా

వాడినందువల్ల ఉండే ప్రయోజనాలను కూడా గమనిస్తారు.

ఈ ప్రయోగాలు ప్రారంభించే ముందు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.

 1. పరిశోధనలో పాల్గొనే వారు స్వచ్ఛందంగా వచ్చిన వారై ఉండాలి.
 2. అన్నింటి కంటె ముఖ్యమైనది వీరు ఈ ప్రయోగం గురించిన మంచి – చెడు, అపాయాలు అన్ని తెలిసిన వారై ఉండాలి. అంటే వారి వద్ద నుంచి తెలిసి తెలిపిన అంగీకార పత్రం (Informed consent) తీసుకోవాలి. తప్పకుండా వివరాలు అన్నీ తెలిపిన తర్వాతే వారి అంగీకారాన్ని తెలిపే పత్రం మీద సంతకం తీసుకోవాలి. విడియో తీసిన అంగీకారం (VIDEO CONSENT) ఉంటే ఇంకా మంచిది.
 3. పరిశోధనలో పాల్గొనే వారు మధ్యలో ఎప్పుడయినా విరమించుకునే వెసులుబాటు ఉండాలి.
 4. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పరిశోధన జరిపే ప్రొఫెషనల్స్ (డాక్టర్లు, పారామెడికల్ వర్కర్లు) సరయిన, పూర్తి శిక్షణ పొంది ఉండాలి.
 5. ఈ పరిశోధనలను పర్యవేక్షించేందుకు (నైతికతా నిర్ధారణ సంఘం) ఎథికల్ కమిటీలో పూర్తి అవగాహన కలిగిన స్పెషలిస్టులుండాలి. ఈ

కమిటీలన్నీ రిజిస్టరు చేసుకుని ఉండాలి.
పైన చెప్పిన రూల్స్, రెగ్యులేషన్స్ అభివృద్ది చెందిన దేశాల్లో ఖచ్చితంగా అమలు జరుగుతుండగా మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం.
దేశంలో 1970 దశకంలోనే ఈ ప్రయోగాలు ప్రారంభం అయ్యాయి. వందల వేల మంది బీదవాళ్లు, దళితులు, మైనారిటీలు ఈ ప్రయోగాల్లోకి లాగబడ్డారు. వారి మీద ప్రయోగం జరుగుతోందన్న విషయం కూడ వారికి తెలియదు. వారు చదువుకున్న వారు కాదు. ఫలానా ప్రయోగం జరుగుతోందని దాని వల్ల ఉండే ప్రమాదాలు, అపాయాల గురించి వారు చదివి తెలుసుకోలేరు. వారికి అర్థమయ్యే భాషలో తెలియజెప్పే వారు ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన కొన్ని క్లినికల్ ట్రయల్స్ గురించి తెలుసుకుందాం.

 1. క్వినాక్రైన్ అనే మందు గర్భసంచి కుండే ఫాలోపియన్ ట్యూబ్‌లను శాశ్వతంగా మూసేసి ఇక పిల్లలు కలిగే అవకాశం లేకుండా చేస్తుంది. ఈ మందు గురించిన వివరాలు మహిళలకు తెలియజెప్పకుండానే వేల మందిపై మహిళలపై ప్రయోగించారు.
 2. 1980లో గవర్నమెంట్ డాక్టర్లే గ్రామాలలో నివసించే స్త్రీలపై ఇంజక్షన్ రూపంలో ఉండే గర్భనిరోధక మందును ప్రయోగించారు. కాని ఈ మందును ఎలుకలపై ప్రయోగించినప్పుడు గడ్డలు (TUMOURS) ఏర్పడ్డాయి. ఈ విషయం ఆ స్త్రీలకు తెలియచేయకుండా, వారి అనుమతి లేకుండా వారిపై ప్రయోగించడం జరిగింది.
 3. 1991-1999 సం॥ రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన లెప్రసీ వాక్సీన్ ట్రయల్ డబుల్ బ్లైండ్ పద్ధతిలో జరిగింది. అంటే రెండు గ్రూపులుగా విభజించబడ్డ జనంలో ఒక గ్రూపుకి Placebo, ఇంకో గ్రూపుకి వాక్సీన్ ఇచ్చారు. కానీ ఈ విషయం ఈ ప్రయోగంలో పాల్గొంటున్న జనానికి తెలియనే తెలియదు.
 4. 1990లో 1100 మంది స్త్రీలకు సెర్విక్స్ ప్రీకేన్సరస్ స్టేజీలో ఉన్నట్టు నిర్ధారణ జరిగినా ఈ విషయం వారికి తెలియకుండా, వైద్యం చేయకుండా ఈ జబ్బు ఎలా పెరుగుతుందోనని పరిశోధించారు.
 5. 2001 లో జాన్ హాప్కిన్స్‌కు చెందిన పరిశోధకుల ఉదంతం మరోలా ఉంది. జంతువులపై ప్రయోగించకుండానే అది హానికారి అవునో కాదో నిరూపించబడని ఒక కేన్సర్ మందుని కేరళలో డజను మందిపైగా పేషంట్లపై ప్రయోగించి పట్టుబడ్డారు. ఈ పరిశోధకులు ఈ పేషంట్ల దగ్గర నుంచి అన్ని తెలిసి ఇచ్చే అవగాహన పూరిత అంగీకార పత్రాన్ని కూడా తీసుకోలేదు.
 6. 2003లో 400 మంది స్త్రీలకు సంతానోత్పత్తిని పెంచే మందు అని చెప్పి batrozole అనే మందుని ప్రయోగించారు. కాని ఈ మందు గర్భంలోని పిండానికి హాని కలిగించే కేన్సరు మందు అని FDA తెలియజేసింది.
 7. 2009 -2010 సం॥ల్లో ఖమ్మం జిల్లాలో 16000 మంది 9-15 సం॥ రాల మధ్య వయస్సులో ఉన్న ఆదివాసీ అమ్మాయిలకు, గుజరాత్ రాష్ట్రంలో అదే కేటగిరికి చెందిన 14000 మంది అమ్మాయిలకు HPV (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వాక్సీన్ ఇవ్వడం జరిగింది. 2010లో వీరిలో వంద మంది అమ్మాయిలకు ఫిట్స్ వచ్చాయి. అంతేకాకుండా కొందరికి కడుపు నొప్పి, తలనొప్పి, మూడ్‌లో తేడా, బహిష్టులో తేడాలు, అధిక రక్తస్రావం, తిమ్మెర్లు లాంటివి గమనించారు. ఇక్కడ కూడా అవగాహనపూరిత అంగీకార పత్రాన్ని తీసుకోలేదు. తల్లిదండ్రుల నుంచి వేలి ముద్రలు తీసుకున్నారు. విచిత్రం ఏమిటంటే దీనికి పోషకురాలు, పూచీదారు PATH అనే సంస్థ. ఇది బిల్ గేట్స్‌కు చెందిన సంస్థ. ఇలా చెప్పుకుంటూపోతే నిన్న, మొన్నటి వార్తల వరకు ఎన్నో అకృత్యాలు ఈ క్లినికల్ ట్రయల్స్‌లో జరుగుతూ వస్తున్నాయి. ఒక NGO (ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థ) నివేదిక ప్రకారం 2005 నుంచి 2013 వరకు జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో 3458 మంది ప్రాణాలు కోల్పోయారు. కాని అధికారిక ప్రకటనల్లో 89 మందిని మాత్రమే గుర్తించారు. ఈ పరిశోధనల్లో అన్నీ కలుపుకొని 506 (చావు కాకుండా ) చెడు ప్రభావాలను ఈ NGO గుర్తించింది. కాని వీటికి సరయిన వైద్యం చేయడంగాని, నష్టపరిహారం ఇవ్వడంగాని జరగలేదు. గత ఏభై ఏళ్లుగా ఈ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనలకు ముందు తీసుకోవాల్సిన అవగాహన పూరిత అంగీకార పత్రం లేనేలేదు. పరిశోధనకు ముందు పేషెంట్ల ఆరోగ్య స్థితి గురించిన పూర్తి టెస్ట్ చేసి రికార్డు చేయడం లేదు. ట్రయల్ మొదలయ్యాక వారి స్థితి గతులు, వారి ఆరోగ్యంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనే పూర్తి వివరాల రికార్డు లేదు. ఒకవేళ ఏదైనా ఊహించని అనారోగ్య పరిస్థితి లేక మరణం సంభవిస్తే దానికి కారణాలు తెలుసుకునే పరిశోధనా వ్యవస్థ లేదు. పరిశోధన ప్రారంభించిన తర్వాత క్రమం తప్పకుండా పేషెంట్లను పర్యవేక్షించే పరిస్థితి లేనందున అబద్ధపు డాటాని రికార్డు చేసే స్థితి. మరణం సంభవిస్తే పోస్టుమార్టం కచ్చితంగా చేసి, చావుకు కారణం తెలుసుకునే విధానం లేదు. పై పరిస్థితులు జనం ముఖ్యంగా బీదలు, దళిత బహుజనుల జీవించే హక్కును, ఆరోగ్యంగా ఉండే హక్కును కాలరాస్తున్నాయి.
  చాలా కాలంగా వైద్య రంగంలో అనైతికంగా జరుగుతున్న ప్రయోగాల గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజులు మేధావులు చర్చిస్తారు, హడావుడి చేస్తారు. తర్వాత హడావుడి తగ్గుతుంది. మళ్లీ మరికొన్ని ప్రయోగాలు, నష్టం (ప్రాణ) జరిగితేనే తిరిగి చర్చ, హడావుడి…
  ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకునేలా ప్రజలు ఉద్యమించకుంటే మనం ఈ ప్రయోగాలకు పనికొచ్చే బలిపశువులు (గినీ పిగ్స్) గా మిగిలిపోతాం.