Home కలం ‘ఆకుపచ్చనిదేశం’ సందేశం

‘ఆకుపచ్చనిదేశం’ సందేశం

Aakupacchani-Desham

“కొత్త శతాబ్దం వచ్చింది / ఇప్పుడు బలమున్న వాడే బతు కుతు న్నాడు / నా భూమి, నా నేల నా అడవి అన్న సెంటి మెంట్లు మరిచి పోవాలి / అడవుల్లో చెంచులు అమాయకులు / అప్పుడే పుట్టిన బిడ్డల్లాంటి వాళ్లు/ వాళ్లకు నచ్చజెప్పండి అడవిని మర్చిపొ మ్మని/ వాళ్ల కోసం ఇళ్లు కట్టిస్తున్నాము/ ఇంకా ఫండ్స్ తెప్పిస్తాను/ గాంధీ, నెహ్రూ, కమ్యూ నిస్టులు, సోషలిస్టులు అవన్నీ మర్చిపోండి”… (ఆకు పచ్చని దేశం: పుట 138)
డా॥ వి.చంద్రశేఖర రావు రచించిన ‘ఆకుప చ్చని దేశం’ నవలలో అలల సుందరం మాటలివి. ఇరవ య్యవ శతాబ్దం చివరి దశాబ్దంలో రచయితగా దూసుకొచ్చిన చంద్రశేఖర రావును తలచుకోగానే నాకు గురజాడ అప్పారావు గుర్తుకు వస్తారు. గురజాడ సంఘ సంస్కరణను ఆహ్వానిం చారు. సంఘ సంస్కరణోద్యమాన్ని ఆమోదించారు. అదే సమయంలో సంస్కర్తలలోని అశాస్త్రీయ ధోరణులను ఎత్తిచూపారు. సంఘసంస్కరణోద్య మంలో దొంగలు చొరబడడాన్ని ఎత్తిచూపారు. చంద్రశేఖరరావు కూడా గురజాడలాగే విప్లవ దళితా ది ఉద్యమాలను గౌరవించారు. ఆ ఉద్యమాలలోని స్వార్థపరులను విమర్శించారు. ఆయన కథలలో, ఆయన నవలలో గత మూడు దశాబ్దాల భారతీయ సామాజిక పరిణామాలు విమర్శనాత్మకంగా, కవితాత్మకంగా ప్రతిబింబిస్తాయి. ఆయన స్వయం గా వైద్యులు అయివుండి 60 నిండకముందే కన్ను మూయడం తెలుగు సాహిత్యానికి చాలా నష్టం. నమ్మకం ఉన్నదానిని ఆరాధానాత్మకంగా రచించ డం సులభం. నమ్మినదానిని విమర్శనాత్మకంగా రచించడం కష్టం. చంద్రశేఖర రావు ఈ కష్టమైన పనిని నిజాయితీగా చేశారు.
డా॥ చంద్రశేఖర రావు రచించిన మూడు నవలలో ‘ఆకుపచ్చని దేశం’ ఒకటి. చంద్రశేఖర రావు ‘జీవని’ కథా సంపుటం వచ్చే నాటికి వాస్తవికవాద రచయితగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన రూపపరంగా ప్రయోగాలలోకి వెళ్లిపో యారు. తిరిగి ‘ఆకు పచ్చని దేశం’లో వాస్తవిక వాద రచనా పద్ధతికి వచ్చారు.
ప్రకాశం జిల్లాలో మార్కాపురం దగ్గర ఉన్న నల్లమల అడవులలో వెలిగొండ ప్రాజెక్టు కడుతూ రాష్ట్ర ప్రభుత్వం అడవిలోపల నివసించే ఆదివాసీలు – చెంచులను అడవిలోంచి మైదాన ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. వెలిగొండ ప్రాజ క్టు వల్ల 15 గ్రామాలు, కొన్ని చెంచు గూడాలు మునిగిపోతాయి. వాటిలో నివసించే ప్రజల్ని బయ టకు తీసుకురావడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నం, దానికి చెంచుల ప్రతిఘటన – ఇదే ఆకుపచ్చని దేశం నవలలో వస్తువు.
ఈ నవల ప్రధానంగా మూడు అంశాలను చిత్రించింది. అవి 1) ప్రపంచీకరణ మొదలయినాక ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు కుదిరిన చుట్టరికం. 2) అభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రజల హక్కులను ప్రభుత్వం హరించడం. 3) ఆదివాసీ జీవిత ప్రతిఫలనం. డా॥ వి. చంద్రశేఖర రావు మార్కాపురం ప్రాంత వాసి. వెలిగొండ ప్రాజెక్టు కోసం అక్కడి ప్రజలకు ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తున్న సమయంలో ఈయన కొందరి స్నేహితులతో కలిసి అడవిలో చెంచుగూడాల్ని తిరిగి అక్కడి జీవితాన్ని అధ్యయ నం చేసి ఈ నవల రాశారు. వీర నరసింహం శ్రీశైలం అడవులలో పుట్టిన చెంచు పిల్లవాడు. అతని తల్లి చామంతి. బిడ్డను పోషించ లేక తారురోడ్డు మీద వదిలేసి పోతుంది. అతడు ఎలాగో పెరిగి పెద్దవాడై ఉస్మానియా విశ్వ విద్యాల యంలో పిహెచ్‌డి చేస్తాడు. అక్కడ అతనికి మోహిని అనే అమ్మాయి పరిచయమై అతనికి భార్య అవుతుంది. మోహిని ఎం.ఎల్ పార్టీ కార్యకర్తగా పనిచేసి, పార్టీని వదిలేసి ఫెమినిస్టుగా మారి మనోహర్ అనే జర్నలిస్టు పరిచయం అయ్యాక ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టుకుంటుంది. లోకం ఎరుగని వీరనరసింహం లోకం తెలిసిన మోహిని జంట అయ్యారు. అప్పడు రాష్ట్ర ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతంలోని అడవులలో నివసించే చెంచులను అడవిలోంచి బయటకు తీసుకొచ్చే పనిని స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పింది.అలా చేస్తే మోహినికి 10 లక్షల రూపాయలు వస్తాయి. మోహిని తాను పోకుండా చెంచు జాతికే చెందిన వీరనరసింహంకు అంతా నేర్పి పంపిస్తుంది. ప్రజల కళ్లను ప్రజల చేత్తోనే పొడిచే రాజనీతికి స్వచ్ఛంద సంస్థలు చేయూత నివ్వడం ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వం ఒకవైపు స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు ఇచ్చి ప్రజల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ప్రాజె క్టు ప్రాంతంలో చెంచు జాతికి చెందిన వాళ్లనే ప్రజా ప్రతినిధులను చేసి వాళ్లనే ఆ ప్రజల మీదికి ఉసిగొ ల్పుతుంది. ఈ రెండూ విఫలం అయినప్పుడు తన సైన్యాన్ని తుపాకులతో దించి చావకొట్టిస్తుంది. ఈ రాజనీతిని రచయిత ఈ నవలలో వాస్తవికంగా ఆవిష్కరించారు.
వీరనరసింహం మోహిని పంపితే నల్లమల అడవుల్లోకి వచ్చాడు. అడవిలో అడుగు పెట్టింది మొదలు అతను అడవి మనిషి అయిపోయాడు. ఆ అడవి అతనిని మార్చివేసింది. అక్కడి మనుషుల తీరు, వాళ్ల ఆరోగ్యాలు, వాళ్ల జీవిత విధానం, ఆహార వేష భాషలు, వీరనరసింహంను తన బాల్యం లోకి లాక్కుపోతాయి. అడవిలో పరిచయం అయిన పెద్దముంతయ్య ద్వారా ఆయన అక్కడి మను షులను అర్థం చేసుకుంటాడు. సాధారణంగా ఒక మనిషి చనిపోతే అందరమూ గగ్గోలు పెడతాం. కానీ అడవిలో చావులు సాధారణం అని అతనికి అర్థం అవుతుంది. నవలలో నవమణి అనే పెద్దామె ఆమె కొడుకు అలల సుందరం తల్లి చనిపోతే ఏడ్వడానికి కూడా రాడు. పాలక వర్గం తల్లీ బిడ్డల్ని విడదీసిన దుర్మార్గం ఇది. సుందరం పాలక వర్గం ఏజెంటుగా మారిపోయిన వైనం ఈ నవలలో రచయిత వాస్తవికంగా చిత్రించారు. అడవిలో వీర నరసింహం పనిచేసే క్రమంలో అది తన నివాస స్థానమని, తన తల్లి అక్కడే ఉన్నదని కనుక్కో గలుగుతాడు. ఒక్కసారి ఆయనకు తాను ప్రభుత్వమూ, స్వచ్ఛం ద సంస్థలూ పన్నిన వలలో తగులుకొన్నా ననీ జ్ఞానం కలుగగానే, అతను ఆ పనిలోంచి విరమించుకొంటాడు. చెంచులతో మమేకం అయిపోతాడు. చెంచుల తరఫున పోరాటం చేస్తా డు. చెంచులు తిన్నది తాను తింటాడు. వాళ్లు పస్తులుంటే తాను పస్తు లుంటాడు. వాళ్లు దెబ్బలు తింటే తాను దెబ్బలు తింటాడు. వీర నరసింహం నల్లమల అడవులలో తనను తాను ప్రజల మనిషిగా మలచుకుంటాడు.
‘ప్రజల మనిషి’ నవలలో కంఠీరవం అనే చిన్నపిల్లవాడు ఇంటి నుంచి బయటికి వచ్చి సమాజాన్ని అర్థం చేసుకుంటూ ప్రజలలోంచి నాయకుడిగా ఎదిగినట్లు ఈ నవలలో వీర నరసింహం కూడా నల్లమల అడవులలో చెంచుల జీవితాన్ని అర్థం చేసుకొనే క్రమంలోనే వాళ్లకు నాయకుడిగా ఎదుగుతాడు. బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి రాసిన ‘ఎవరిదీ అడవి?’, పి. కేశవ రెడ్డి రాసిన ‘అతడు అడవిని జయించాడు’, వి.ఆర్.రాసాని రాసిన ‘వలస’, దేశపాండే రాసిన ‘అడవి’ వంటి నవలల్లో మనకు అడవుల రూపు రేఖలు, అటవీ జీవులు విశేషాలు అర్థమవుతాయి. అలాగే ఈ నవలలో అడవుల సౌందర్యం, అక్కడి ప్రజల దైనందిన దీనాతిదీనమైన జీవితాలు కనిపి స్తాయి. ‘అడవులతో అతుక్కుపోయిన సంస్కృతి చెంచులది’ అంటాడు రచయిత. ఆ సంస్కృతిని పాలకులు అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయడంపట్ల ఈ నవలలో నిరసన వుంది.
వీరనరసింహం మొదట్లో పాలకులు, స్వచ్ఛంద సంస్థలు చెప్పిన మాటలనే చెంచులకు వల్లిస్తాడు. ‘చెంచు తెగ బతకాలంటే నాగరికులతో కలవడం తప్పనిసరి’ అని చెబుతాడు. సుదీర్ఘంగా ఆయన చెప్పిందంతా విన్న పెద్ద ముంతయ్య అదంతా బయటివాళ్లు చెప్పేది కదా అనే సరికి వీర నరసింహంకు తెలియవస్తుంది. చెంచు జాతిలో పుట్టిన వీరనరసింహం బయట పెరగడంవల్ల ఆహారంలేకుండా రోజుల తరబడి జీవించగలిగే తెగ తనదేనన్న విషయం తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆయన తన తల్లిని కలుసుకున్నా ఆమె అతన్ని తన కొడుకు అని గుర్తించలేకపోవడం ఈ నవలలో పెద్ద విషాద సందర్భం.
ఈ నవలలో కలల ప్రసక్తి మాటిమాటికి వస్తుంది. చెంచులకు వచ్చే కలలు వాళ్లు భావి సంకే తాలుగా విశ్వసిస్తారు. ఈ రచయిత ఈ కలల్ని కథాకథనం కోసం ఉపయోగించుకొన్నారు. అలాగే చెంచు తెగలో పుట్టిన సుందరంకు అలలు సుందరం అని పేరుపెట్టడంలో ఒక వైచిత్రి ఉంది. గాలి వాటు గా, అవకాశవాదిగా ప్రవర్తించే సుందరంకు తగిన పేరది. అంతేకాదు సముద్రం వంటి చెంచు జాతి ప్రజల మీద ఊరేగే మనిషి అని కూడా అర్థం వస్తుంది.
ప్రభుత్వం సంపన్నుల కోసం జరుగుబాటున్న వాళ్ల కోసం మూలవాసులైన చెంచులను శాసిస్తుంటే చెంచులు ఆహార సేకరణ దశలోనే వుండడం అనే వైరుధ్యాన్ని ఈ నవల బాగా ఆవిష్కరించింది. ప్రభుత్వం తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని, తమని ప్రజా ప్రభుత్వమని ప్రచారం చేసుకుం టుంటే చెంచులకు ప్రభుత్వం ఒకటి ఉంటుందని విషయం తెలియదు. గిరిజన అభివృద్ధ్ది సంస్థ అంటూ ఒకటి పని చేస్తున్నా, చెంచులు ఆ దశలోనే ఉన్నారంటే మన ప్రభుత్వాలు ఎంత బాగా ప్రజలకు చేరువ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నల్లమల అడవులలో నివసించే చెంచుతెగ ప్రజలలోని ఐక్యత ఈ నవలలో రచయిత చాలా ఆసక్తికరంగా చిత్రించారు. చెంచులు ఎక్కువగా మాట్లాడరు. అసలు మాట్లాడరన్నా ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ల తెగ పెద్ద ఒక సైగ చేశారంటే వాళ్లు అంతా ఒకే రకంగా ప్రవర్తిస్తారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా, ఎంత భయపెట్టినా, హింసించినా, ఎన్నెన్ని రకాలుగా ఆశలు చూపినా చెంచులు చివరికి అడవిలోకే వెళ్లిపోతారు. పెద్ద ముంతయ్య పోలీసులు తమ జాతిని చిత్ర హింసలు పెడుతుంటే చూసి భరించలేక ఒక తుపాకిని లాక్కొనిపోయి నెట్టుతో పొడుచుకొని చనిపోతాడు. ఒక యువకుడు అతడి శవాన్ని భుజాన వేసుకొని అడవిలోకి నడిచిపోతే చెంచులంతా అతనిని అనుసరిస్తారు. గోచి పాతరలకు , చింకి పాతరలకు పరిమితం అయిన చెంచులను నికృష్టమైన జీవన విధానం ఉంది. వాళ్ల ఆహారం, వాళ్ల వైద్యం, వాళ్ల ఆట పాటలు చెంచులు జీవితాన్ని గురించి ఏమీ తెలియని వారికి ఈ నవల చాలా తెలియజేస్తుంది. స్వార్థం , కుళ్లు, కుతంత్రంలేని చెంచుల నిర్మల హృదయాలను చంద్రశేఖర రావు ఈ నవలలో చాలా విజ్ఞానాత్మకంగా, నిజాయితీగా చిత్రించారు.
‘అది చెంచుల రాజ్యం’ అనే జ్ఞానాన్ని ఈ నవల కలిగిస్తుంది. చంద్రశేఖర రావు వచనం చాలా ఆర్ద్రంగా వుంటుంది. కవితాత్మకంగా ఉంటుంది. ఈ నవల పాఠక లోకాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. పఠనీయత ఈ నవలకు ప్రాణం. చంద్రశేఖర రావు ఇంతలోనే మరణించకూడని రచయిత. ఆయన మరణం దురదృష్టం. ఆయనకు నివాళి.