Home రాష్ట్ర వార్తలు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ విఫలం

మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ విఫలం

MILIAN-MARCH

భగ్నం చేసిన పోలీసులు
కోదండరామ్, తదితరులు అరెస్టు

మన తెలంగాణ/ హైదరాబాద్ : మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను పోలీసులు భగ్నం చేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు హైదరాబాద్‌లోకి ప్రవేశించే అన్ని రహదారులను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ముఖ్య నాయకుల నివాసాలు, ప్రజా సంఘాల కార్యాలయాలు, ప్రధాన కూడళ్ళ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి, భారీస్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. నగరానికి వచ్చే అన్ని ఆర్‌టిసి, ప్రైవేటు వాహనాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ జెఎసి ఛైర్మన్ ఫ్రొఫెసర్ ఎం.కోదండరామ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశలవారీగా అరెస్టుల పర్వం కొనసాగింది. తెలంగాణ జెఎసి, సిపిఐ, న్యూ డెమొక్రసీ, ‘తెలంగాణ ఇంటి పార్టీ’, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై శనివారం జరపతలపెట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎలాగైనా జరిపేందుకు నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ట్యాంక్‌బండ్‌తో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో 40 వేల మంది పోలీసులను మోహరించారు. సభకు తరలివస్తున్న వేలాది మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కక్కడే నిర్భంధించి అరెస్టుచేశారు. హైదరాబాద్‌కు దారితీసే రోడ్లపై వందలాది పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. పోలీసుల నిర్భందకాండకు నిరసనగా అనేక ప్రాంతాలలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేయగా, మరికొన్ని ప్రాంతాలలో రాస్తారోకో, ధర్నాలకు బైఠాయించడంతో ఉద్రిత్త పరిస్థితులు తలెత్తాయి. జెఎసి ఛైర్మన్ కోదండరామ్‌ను తార్నాకలో ఆయన నివాసం దగ్గరే అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ట్యాంక్‌బండ్‌కు బయలేదేరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెకంటరెడ్డిని హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్ వద్దనే అడ్డుకుని అరెస్టు చేశారు. టియుఎఫ్ నేత విమలక్కను చిక్కడపల్లిలో అరెస్టు చేశారు. ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఆయనను మరో ప్రాంతానికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో 90 శాతం మందిని సాయంత్రం ఆరు గంటల తరువాత వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.
కోదండరామ్ నివాసం వద్ద కర్ఫ్యూ వాతావరణం : తార్నాకలోని కోదండరామ్ నివాసానికి వెళ్లే ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచే వందలాది మంది పోలీసులు ఆయన నివాసంతో పాటు సమీప ప్రాంతాలను దిగ్భంధం చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అనుమతించలేదు. దీంతో ఆ ప్రాంతం కర్ఫూ వాతావరణాన్ని తలపించింది. కోదండరామ్‌ను కలిసిఏందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేశారు.
ఇది ప్రజాస్వామ్యమా& నిరంకుశత్వమా ? : కోదండరామ్
సిఎం కెసిఆర్‌కు ఢిల్లీలో ధర్నా చేసేందుకు స్వేచ్ఛ ఉండొచ్చు కాని, తమకు మాత్రం రాష్ట్రంలో ధర్నా, నిరసనలు తెలిపే హక్కు ఉండకూడదా అని తెలంగాణ జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రశ్నించారు. ప్రశ్నించేవారి పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందన్నారు. ప్రస్తుత పాలనలో తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకోవడమే నేరమైందన్నారు. తార్నాక వద్ద కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, ఏ కార్యక్రమం చేపట్టినా అడుగడుగునా ఆటంకాలు, నిర్భందాలు, అరెస్టులు కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్య భారతదేశంలోనే ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహించడం వల్ల అధికార పీఠాలు కదులుతాయా? లేక భూమి బద్దలవుతుందా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో మనుషులను మాత్రమే అరెస్టు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో మనుషులతో పాటు గృహాలను కూడా ముందస్తు అరెస్టులు చేయడం కొత్తగా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పోరాటం ద్వారా సాధించిన తెలంగాణలో ఇన్ని నిర్భందాలు ఉంటాయని తాము ఉహించలేదన్నారు.
నైతిక విజయం : చాడ
టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసినా మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమం నైతికంగా విజయం సాధించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ కార్యాలయం మఖ్ధుంభవన్ నుంచి మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌కు బయలుదేరిన చాడ వెంకటరెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు వంద మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, కార్యవర్గసభ్యులు ఇ.టి.నరసింహా, డాక్టర్ డి.సుధాకర్, మంద పవన్, పుస్తకాల నరసింగ్‌రావు, ప్రజా సంఘాల నాయకులు కె.శివరామకృష్ణ (ఎఐఎస్‌ఎఫ్), ఎం.అనిల్ కుమార్ (ఎఐవైఎఫ్), పోటు కళావతి ఉన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో సిఎం కెసిఆర్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా నియంతృత్వ పాలన సాగిస్తున్నారన్నారు.