Home కలం విమర్శకు కావలిసిన పరిజ్ఞానం

విమర్శకు కావలిసిన పరిజ్ఞానం

Untitled-2

పాండిత్యం లేనివాడు కవి అవుతాడని ఒక లోకోక్తి. కవిత్వం రానివాడు విమర్శకుడవుతాడని ఒక ఛలోక్తి. ఈ లోకోక్తి, ఛలోక్తిని బట్టి కవి, విమర్శకుడు గర్భవిరోధులుగా కనిపిస్తారు. నిజానికి కవితా, విమ ర్శా పెంపొందడానికి ఈ వైరుధ్యమే కారణం. కవిత గుణ దోషాలను బేరీజు వేసి కొన్ని విలువలు కడతాడు విమర్శకుడు. విమర్శ కుడిచ్చిన విలువల్ని ఆకళించుకు ని, తిరిగి కవిత పుడుతుంది. ఈ విధంగా కవిత, విమర్శ పరస్పర దోహదకారులవుతాయి.
ఇప్పుడు గుణదోష విచారణకే కాక, కేవల ప్రశంసకు, అభిశంసకు కూడా విమర్శ అన్న పేరు చలామణిలో ఉంది. అంతేకాదు ప్రబంధ వ్యాఖ్యానాలు, సాహిత్య పరిశోధనలు, వివర ణలు, సమీక్షలు వీటన్నింటికీ కూడా విమర్శ అన్న పేరు ఉంది.
సాహిత్య విమర్శపై ప్రాచ్య పాశ్చాత్యులు విపులంగా వివరిస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు. భామహుడు, వామనుడు, ఉద్భటుడు, జగన్నాథ పండితుడు, ఆనంద వర్ధనుడు, విశ్వనాథుడు మొదలైన భారతీయ లాక్షణికులెందరో సాహిత్య విశ్లేషణ చేసారు. అంతే కాకుండా ప్లాటో, అరిస్టాటిల్,రిచర్డ్ టి.ఎస్. ఇలియట్ మొదలైన పాశ్ఛాత్య విమర్శకులు ఎందరో ఉన్నారు.
విమర్శకు కావలసిన పరిజ్ఞానాన్ని గూర్చి ముదిగొండ వీరభద్రయ్యగారు సరళంగా అందించిన వివరణ- “ఒక రచనను చదివి చాలా బాగుంది అని అన్నా , ఆ రచనలోని కొన్ని భాగాలను చదివి బాగుంది అని అన్నా- ఆరచన మనకు ‘తెలిసి’నట్లు కాదు. రచన మనకు బాగుంది అని అనిపించినప్పుడు అందులోని ‘బాగు’ ఏమిటి? అది అందులో ఎక్కడ ఉంది? దాన్ని విడదీసి చూపడా నికి వీలుందా? లేదా పాలల్లోవెన్నలాగా అది ఈ రచన మొత్తంగా వ్యాపించి దాని జీవంగా ఉందా? దాన్ని మన మాటల్లో చెప్పడానికి వీలుందా? ఆ చెప్పడం మామూలు మాటల్లో చెప్పడం వల్ల కలిగే అధిక ప్రయోజనం ఏమిటి? మొదలైనవి మనకు తెలియాలి. స్థూలంగా చెప్పాలంటే విమర్శ అంటే ఈ ప్రశ్నలకు సమాధానమే” -(విమర్శ మౌలిక లక్షణాలు)
తెలుగులో ప్రాచీన కాలంలో విమర్శ లేదనే చెప్పాలి. కావ్యావతారికల్లోనూ, చాటు పద్యాల్లోనూ, లక్షణ గ్రంథాల్లోనూ ఆ తర్వాత వెలువడిన వ్యాఖ్యాన గ్రంథల్లోనూ విమర్శవంటిది కనిపిస్తుంది. అందుకే ఎస్.వి రామారావు మొదలైన విమర్శకులు ఈ విధంగా తెలిపారు. “ తెలుగు భాషలో సాహిత్య విమర్శనము ఆధునిక యుగమునందు అవతరించిన నూతన ప్రక్రియ. ప్రాచీనాంధ్ర వాజ్మయములో విమర్శనమున్నట్లు గోచరించుచున్నను అది నిక్కమైన సాహిత్య విమర్శనము కాజాలదు. తెలుగు సాహిత్య విమర్శ ప్రాదుర్భావము ఆధునిక యుగమునందే జరిగినట్లు స్పష్టీకరించవచ్చును. అప్పుడే విమర్శకునికి ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పడి విమర్శనము స్వస్వరూపముతో సాక్షాత్కరించినది.”
పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల 19వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కొత్త ప్రక్రియలు ఆవిర్భవించాయి. కావలి రామస్వామి, సి.పి. బ్రౌన్ , ములుపాక బుచ్చయ్య శాస్త్రి, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి మొదలైనవారు తెలుగు విమర్శనా రంగానికి సూత్రధారులనవచ్చు. తెలుగులో తొలి విమర్శకుడిగా కందుకూరి వీరేశలింగం పంతు లును చెప్పుకోవాలి. 1876లో ‘ వివేకవర్ధిని పత్రికలో కందు కూరి రచించిన ‘విగ్రహతంత్ర విమర్శనము’ మొదటి విమర్శ రచనగా పేర్కొంటారు. అదే విధంగా కవిత్వ విమర్శలో నూతన దృక్పథాన్ని కలిగించిన విశిష్ట విమర్శకుడు కట్టమంచి రామలింగారెడ్డిగారు.
సాహిత్య మనగా వస్తు సన్ని వేశానికి తగినట్లు శబ్ద సంపదను అమర్చి భాషాపరికరంతో భావానికి ఆకృతి తీర్చిదిద్దుట అన్ని అనుకొన్నట్లయితే ఆ అమరిక , ఆకృతి ఎట్లున్నవో వాటి బాగోగుల్ని పరిశీలించడమే విమర్శ అని తెలుస్తుంది.
సాహిత్య విమర్శ వలన పాఠకునికి మరియు రచయితకు కూడా ప్రయోజనం కలుగుతుంది. విమర్శ వలన పాఠకునికి రచ యిత యొక్క రచనలోని రసరహస్యములు, రచనాశిల్పమును, వ్యంగ్య విశేషాలను తెలుసుకొనవచ్చును. రచయితల పరంగా చూసి నపుడు విమృష్ట గ్రంథం ప్రాచీనమైనదైతే ఆ విమర్శ ఆ ప్రాచీన రచయితకు ఉపయోగపడకపోయినా అర్వాచీసులైన రచయితలకు మార్గదర్శకం అవుతుంది. అలాగే ఆ గ్రంథ రచయిత విమర్శకుని సమకాలీనుడైనచో- ఏ రచయితకైనా తన రచన తనకు ఉత్తమ మనిపించుట సహజము. కావున తన రచనను ఇతరులు చూసే దృష్టితో సమీక్షించుకునే అవకాశము అతనికి కలిగించి , ఆ విమర్శయందు సప్రమాణముగా నిరూపించిన లోటుపాట్లను తన తదుపరి రచనల్లో సవరించుకునే అవకాశం కలిగించడం ద్వారా సాహిత్య ప్రగతికి దోహదం చేసినట్లవుతుంది.
విమర్శకుడు ఒక ఆదర్శ పాఠకుడు మరియు నేర్పరియైన భావుకుడు కావున సామాన్య పాఠకుని మాటకంటే అది గుణ, దోషాల్లో దేనికి సంబంధించినదైనను అతని మాటకు ప్రచారమె క్కువ. అందుచేత విమర్శకుని బాధ్యత గురుతరమైనది. ఒక గ్రంథానికి అపకీర్తి తేవటం అతని లక్షం కాకూడదు. తాను లోకోత్తర సహృదయుడై ఉన్నదున్నట్లు కవి హృదయాన్ని సహృదయ పాఠకునికి అవగతము చేయుటయే అతని లక్షం కావలెను. కావున విమర్శ చేయవలెనన్న కొన్ని ముఖ్యాంశములకు సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరి.
విమర్శ చేసే ముందు ప్రతీది గతిశీలమైనదనీ ఇది సాహిత్యానికి కూడా వర్తిస్తుందనే విషయాన్ని విమర్శకుడు గ్రహించాలి. ప్రతి దానికి అనేక వివరాలతో వేవేల సంబంధాలు ఉంటాయి. బహు గ్రంథ పఠనం, కావ్యానుశీలనం విమర్శకునికి అవసరం. కవి కంటే కూడా విమర్శకునికి వ్యుత్పత్తి అవసరం. సాహిత్యం అంటేనే వివిధ ప్రక్రియల సమాహారమైనందున వివిధ సూత్ర, శాస్త్ర, తత్త్వ సంబంధమైన పరిజ్ఞానం అవసరం సాహిత్య విమర్శకునికి పాశ్చాత్య సాహిత్య మర్యాదలు, సామ్యవాద కాల్పనిక ఉద్యమాల స్వరూప స్వభావములు విమర్శకునికి అవగతమవ్వాలి.
దేశాటనము పండిత గోష్ఠుల వలన కూడా విమర్శకునికి ప్రయోజనం ఉంటుంది. ఏ రచననైనా పరిశీలించేటప్పుడు ఇతర భాషా వాజ్ఞయములందు ఆ ప్రక్రియలో వెలువడిన ఇతర గ్రంథాల కు సంబంధించిన పరిజ్ఞానం రచయిత నాటి సామాజిక సంబం ధాలను, రాగద్వేషాలను ఇష్టాఇష్టాలను అర్థం చేసుకోవాలి. కవి లేక రచయిత హృదయాన్ని రచన ద్వారా ఆశించిన ప్రయోజనాన్ని సానుభూతితో అవగాహన చేసుకోవాలి.
“విద్యానేవ విజానాతి, విద్వజ్జన పరిశ్రమ
నహివంధ్యా విజానతి, గుర్వీ ప్రసవ వేదనామ్‌” అన్నట్లుగా విమర్శకుడు కవి కావాల్సిన అవసరం లేదు. కానీ కవి పరిశ్రమను పడిన ప్రయాసను గుర్తించి అభినందించక విమర్శకుని కనీస కర్తవ్యం. కవి ఏది రాసినాడని కాదు. ఎందుకు రాసినాడని, ఎట్లా రాసినాడని విమర్శకుడు వేసుకోవలసిన ప్రశ్నకు మనకీయవలసిన సమాధానానికి లక్షం కావలెను.
తత్త దర్శిత మనేది కవికే కాదు. విమర్శకునికి కూడా ముఖ్యమై నది. కొన్ని సాహిత్య గ్రంథాలు మేడి పండులాగా వుంటాయి. అలాంటి వాటిని విమర్శించే సందర్భంలో విమర్శకుడు మోసపోక సత్య పథికుడై ఆ గ్రంథం యొక్క అంతరంగంలోకి తొంగి చూసి కావ్య పరమార్థాన్ని ఆవిష్కరింపగలగాలి. సాహిత్య విమర్శ అనేది సమగ్ర సుందరమైన ప్రజ్ఞాసహితమైన పఠన పద్ధతి. విమర్శకుడు పూర్తిగా పఠిస్తాడు. దానిలోని కథా నిర్మాణం, పాత్ర పోషణ, వర్ణనా నైపుణ్యాలను అనుసరిస్తాడు. కవి వ్యక్తం చేసిన శబ్దాల్ని వానిలోని అర్థాన్ని వ్యాఖ్యానించాలి.
సంప్రదాయికంగా ఆ భాషలో అర్థ గౌరవాన్ని నిరూపించే శబ్ద శక్తిని, రచనా పటిమను విమర్శకుడు వ్యాఖ్యానించాలి. విమర్శ అన్నది కావ్యానికొక అగ్ని పరీక్ష వంటిది.
కాళిదాసు “హేమ్నః సంలక్షతే హ్యగ్నౌవిశుద్ధిః శ్యామికా పివా” అన్నట్లు సాహిత్య స్వర్ణం యొక్క పారిశుద్ధ్యాన్ని మలినత్వాన్ని తేల్చాల్సిన బాధ్యత విమర్శకునిది. విమర్శకుడు తన అభిరుచి ప్రకారం విమర్శ చేసినప్పటికీ తన అభిప్రాయంతో శిష్టులు ఏకీభవిస్తున్నారోలేదో చూసుకోవాలి. అప్పుడే వర్తమా నంలో సాహిత్యం చైతన్యమవుతూ, భవిష్యత్తున నిత్య నూతనమై పరిణతి నొందగలదు.