Home తాజా వార్తలు బిసి కోటా సాధిస్తాం

బిసి కోటా సాధిస్తాం

ktr

పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రిజర్వేషన్ల సాకుతో కోర్టుకు వెళ్లారు
హైకోర్టు చెప్పినట్లు చేస్తే బిసిల వాటా తగ్గిపోతుంది
సుప్రీంకోర్టుకు వెళ్తాం
ఆగస్టు 2 నుంచి పాలకవర్గాల పొడిగింపా? ప్రత్యేకాధికారుల పాలనా? అనే దానిపై మంత్రివర్గంలో నిర్ణయిస్తాం
సమీక్ష అనంతరం ఈటల

మన తెలంగాణ/ హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని ఆర్థికమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో పం చాయతీరాజ్ మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఉపసంఘం చైర్మన్ పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్, పోచారం, తుమ్మల నాగేశ్వర్‌రావ్, ఇం ద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయ తీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై చర్చించారు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని ఉపసంఘం నిర్ణయించింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అణగారిన, బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తుందన్నారు. తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, అందుకే తాము కూడా ఆ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. ఇది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. పంచాయతీల పాలకవర్గాల గడువు ఆగస్టు ఒకటితో ముగుస్తుందని రెండో తేదీ నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉండడంతో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గెలుపుపై భయం ఉన్న వారు, ఆశలు అడుగంటిపోయిన వారు ఎన్నికలను అడ్డుకోవడానికి రిజర్వేషన్ల సాకుతో కోర్టుకు వెళ్లారన్నారు. పైగా గెలుపుపై భయంతో టిఆర్‌ఎస్ ఈ నాటకం ఆడిస్తోందన్న ప్రచారం చేస్తున్నారని, అతి తక్కువ కాలంలో ఎక్కువ ఎన్నికలను ఎదుర్కొని అఖండ విజయాలు సాధించామన్నది గుర్తుంచుకోవాలన్నారు. టిఆర్‌ఎస్ సత్తా ఏమిటో జిహెచ్‌ఎంసి ఎన్నికలతోనే తేటతెల్లమైందని చెప్పారు. తాము స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకే తండాలను సైతం గ్రామపంచాయతీలుగా మార్చడంతో పాటు మరిన్ని కొత్త పంచాయతీలను కూడా ఏర్పాటు చేసామన్నారు. వీటిలో ప్రజాపాలన నిర్ణీత గడువులో ప్రారంభించాలని ఎన్నికల ప్రక్రియను మొదలుపెడితే కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లాయన్నారు. అయినా సరే వీలైనంత త్వరగా కేసు నడిచేలా చేయడంతో పాటు నిపుణులైన న్యాయవాదులను నియమించి రిజర్వేషన్లను సాధిస్తామని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్ల విషయంలో దేశ వ్యాప్తంగా ఒకే చట్టం ఉందని, బిసిల పరిస్థితి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుందని చెప్పి వారికి రిజర్వేషన్లు కేటాయించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు అప్పగించిందన్నారు. కోర్టు చెప్పిన ప్రకారం వెళితే బిసిలకు గతంలో కల్పించిన రిజర్వేషన్లు కూడా బాగా తగ్గిపోతాయన్నారు. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్నది కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమేనని, రాజకీయ పరం గా కాదని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించి బిసిలకు వీలైనంత ఎక్కువ రిజర్వేషన్లు సాధించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాలను పొడగించడమా లేక ప్రత్యేకాధికారులను నియమించడమా అన్న దానిపై ముఖ్యమంత్రితో చర్చించాక నిర్ణయం ఉంటుందనని చెప్పారు. అనగారిన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తామన్నారు.