Home మెదక్ భగీరథం పరుగెత్తాలి

భగీరథం పరుగెత్తాలి

  • డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ సిద్ధం కావాలి
  • డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకోవాలి
  • కుంటి సాకులు వినేది లేదు, ఉదాసీనతను ఉపేక్షించం
  • మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

Harish-Rao

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంటింటికీ నల్లా నీరందించే మిషన్ భగీరథ కార్యక్రమం ఎట్టి పరిస్థితిలోనూ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో శనివారం నాలుగు గంటలకుపైగా వివిధ అంశాలపై ఆయన మూడు జిల్లా ల కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న డబుల్ బెడ్‌రూమ్, మిషన్ భగీరథ పనుల్లో అలసత్వం, ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వారీ గా, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలా లు, గ్రామాల వారీగా మంత్రి సమీక్షించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపిలు కె.ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, రామలింగారెడ్డి, చింతాప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దిన్, భూపాల్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లు మాణిక్యరాజ్, వెంకట్‌రాంరెడ్డి, భారతి హోళికేరి, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో మైక్రో లెవల్ సమీక్షా సమావేశంలో పలు అం శాలపై మంత్రి దిశా నిర్దేశనం చేశారు. కొన్ని చోట్ల ఆయా పథకాలు నత్త నడకన సాగుతుండటం పట్ల మంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయా అధికారులు పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. పని తీరు మార్చుకోకపోతే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పదిహేను రోజులకోసారి ప్రభుత్వ పథకాల ప్రగతిని సమీక్షించి అవి వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ముగ్గురు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డిసెంబర్ చివరి కల్లా భగీరథ పూర్తి చేయాలంటే నిరంతరం మానిటరింగ్ అవసరమని అన్నారు. పనుల జాప్యానికి గల కారణాలు నిర్మొహమాటంగా కలెక్టర్ల దృష్టికి తీసుకొని రావాలని ఆర్‌డబ్లుఎస్ అధికారులను కోరారు. నవంబర్ కల్లా అన్ని గ్రామాల్లో ఓహెచ్ ఎస్‌ఆర్‌లకు తాగునీటి సరఫరా కనెక్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను సిఎం సవాలుగా తీసుకొని లక్షాలను విధించినందున వాటికి అనుగుణంగా పనులు కొనసాగించాలన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, అం దోల్, నర్సాపూర్, మెదక్, సిద్దిపేట, హుస్నాబాద్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం పథకం పురోగతిని మైక్రో లెవల్‌లో సమీక్షించారు. కొన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం పథకం పురోగతి ప్రారంభం కాలేదని మంత్రి అన్నారు. ఇప్పటికే టెండర్లు పిలిచిన నియోజకవర్గాల్లో ఆ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. టెండర్లు పెండింగ్‌లో ఉన్న ప్రాంతాల్లో వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు.