Home కలం మా కుటుంబ హితుడు

మా కుటుంబ హితుడు

C-NA-RE

మనుషుల మధ్య బంధాలు రక్తసంబంధ మైనవి కొన్ని, స్నేహ సంబంధమైనవి కొన్ని, సామాజిక సంబంధం కలిగినవి కొన్ని సహ జీవనం చేస్తుంటాయి. వీటి మధ్య తళుక్కున మెరిసి మురిపించే పరిచయాలు ఉంటాయి. ఆత్మీయ సన్నిహితతత్వాలూ ఉంటాయి. దశాబ్దాల తరబడి స్నేహభావమో, ప్రేమభావనో, గురుత్వభావనో, భాతృత్వభావనో ఏదో ఒక సంబంధం ఉన్నప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని ఏ కొలమానాలతోనూ చూడలేము.సినారె గారి పరిచయాన్ని ఏవిధంగా వ్యక్తపరచాలో?
1994 జనవరి 7 రవీంద్రభారతి కిక్కిరిసి ఉన్నది. వేదికపైన ప్రధాని పి.వి. నరసింహారావుగారు ఉన్నారు. సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉన్న దేవులపల్లి రామానుజారావుగారి పోట్రయిట్ ఆవిష్కరణ సభ, సంతాప సభ అది, మామయ్య కొండపల్లి శేషగిరి రావుగారు వేసిన నిలువెత్తు తైలవర్ణ చిత్రావిష్కరణ జరిగాక, డా॥సి నారాయణరెడ్డిగారి గంభీరోపన్యాసం “ చిత్రకళాసాధన నిత్యనూత నంగా ఉండాలని, వర్తమానంలో జీవించే చిత్రకళా సంప్రదాయం అమృతం వంటిదనీ చెప్తూ “ఇంతకడివెడు పాలపై మీగడలాగా రాజులూ రాజ్యాలు కాలగర్భంలో కలిసినా, శతాబ్దాల చరిత్ర సంస్కృతికి సజీవసాక్షాలుగా కళాఖండాలు మిగిలాయని ” వివరిం చారు. “భాష , కవిత్వం కంటె ముందు చిత్రకళ ఆవిర్భవించింది. ఆదిమానవులు తమ మనోభావాలను చిత్రాలుగా గీసి వ్యక్తపరిచే వారనీ చెప్పారు. నిశ్శబ్దంగాఉన్న ఆ సభలో చప్పట్ల మోత మ్రోగేలా-
“ఎన్నిసార్లు చెక్కితే ఒక శిల్పం; ఎన్ని సార్లు తీర్చితే ఒక చిత్రం.
కబుర్లేవో చెప్పకే ఓ కాలమా; ఎన్నిసార్లు చస్తే ఒక జీవితం” అని కవిత్వాన్ని ఆశువుగా చెప్పారు. పి.వి.గారు, శేషగిరిరావు ఆనం దడోలికల్లో మునిగిపోయారు. వందలాది ప్రేక్షకులు రెండు చేతులు ధ్వనిస్తూనే ఉన్నారు. ఆనాటి సభా విశేషాలు ఇప్పటికీ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. తమ ఉపన్యాసాన్ని ముగిస్తూ “సాంస్కృతిక వ్యవహారాల పట్ల ప్రజలలో ఆదరణా పెరగాలనీ, అందుకు అందరూ కృషి చేయాలనీ ముగించి, ఆవేదికపై నున్న శేషగిరిరావుపై అభిమా నాన్ని సినారె ప్రదర్శించారు. అప్పుడు దాదాపు అన్ని టి.వీ ఛానెళ్ళు ఈ విశేషాలను విశేషంగా ప్రసారం చేశాయి.
శేషగిరిరావుగారికి చిత్రకళతో పాటు సాహిత్యంపై మక్కువ. స్నేహపరిమాళాలు పరుచుకునే ఆ ప్రాంగణమంతా కవితా పుష్ప మాలికలను సాహితీ కళామ తల్లి కంఠానవేసేవారు. మామామగారికి 50 ఏళ్ళు వచ్చినప్పుడు 1974లో ‘సరసరేఖాచిత్ర సాహిత్యమును గూర్చు నీదు కుంచియకభివాదమయ్య / అప్సరసల భువిని కవతరింపగజేయు మాంత్రికా నీకు నమస్సులయ్య/విమల వేదాంత సద్వీధుల విహరించుబ్రహ్మజ్ఞ నీకివే ప్రణతులయ్య / అమల సంగీత సుధాంబోధిలో తేలు ఆర్యాపర్యానీకు ఐదు పదులు’
అంటూ “సాధు సంఘ విధేయ శేషగిరిరాయ” అని చివరి పాదంలో చెప్పినదీ కవిత్రయం ఆ ఆశుకవులు దాశరథి కృష్ణమా చార్యులు డా॥ బిరుదురాజు రామరాజు, డా॥ సి.నారాయణ రెడ్డి గార్లు ఈ పద్యాన్ని దాదాపు 1985ల ప్రాంతంలో ఒకసారి రామరాజు గారు ఒక పోస్టల్ కార్డుపైన వ్రాసి పంపారు. ఆ పద్యాన్ని ఎన్నిసార్లు చదివానో దానితో బొమ్మల్ని అనుసంధానం చేసి కళామ తల్లి ఒడిలో పెరిగినవాళ్ళం. ఇక సినారె గారు దగ్గరి వారుగా కేమౌతారు. ఈ నడుమ ఎన్ని మజిలీలు! ఎంత వడపోత! చిన్ననాడు చివుర్లేసిన కవిత్వం గల పదిహేనేళ్ళుగా అట్లా నాతో కలిసి నడుస్తూ చేసిన ప్రయాణంలో సినారె గారితో కలిగిన పరిచయం వేరు. సాహితీ ఆరాధకుల పరిచయం. పుట్టుక నుండి చావు వరకు గట్లు, మెట్లు దాటినా తిర్యక్కుల్లాంటి భావాలు మీటినా బ్రతుకు కలల కలశం జీవిత ప్రాశస్థాన్ని తెలుపుతుంది. 2007లో మామయ్యపై వారి సహస్ర పూర్ణ చంద్రోదయ ఉత్సవం చేసినప్పుడు me, mytime, myart, అనే ఒక కార్యక్రమాన్ని చేశాము. మేడమీద వారి చిత్ర కళాప్రదర్శన నిర్వహించి వచ్చిన ప్రముఖుల మాటల్ని రికార్డు చేయించి డాక్యుమెంటరీలో పెట్టాం. అందులో సినారె గారు “ఆ రోజుల్లో ఆయన మీద నేను, దాశరథి సరదాగా కవితలు ఆశువుగా చెప్పేవాళ్ళం. చెరిగిపోని పంక్తి ఒకటి నాకు ఇంకా గుర్తున్నది” అంటూ సరస కవితావిధేయ శేషగిరిరాయ” అని చెప్పి, “ ఆయన కవిత్వ ప్రేమికుడు కేవలం చిత్రకారుడేగాక, సాహిత్యజ్ఞానం కలిగిన టువంటివాడు. ఆయన పాకాల ప్రకృతి ఒడిలో , ప్రకృతి బడిలో కౌమరదశలోనే చిత్రకళాపాఠాలు నేర్చుకున్నాడు. అధ్యయనం వల్ల శిక్షణ వల్ల పాండిత్యం వస్తుంది. వైదుష్యం వస్తుంది. ప్రతిభ ఒంట బటుతుంది. పాండిత్యం, అభ్యాసంతో దాన్ని మెరుగులు దిద్దుకుం టాం. శేషగిరిరావుకు ఇది వర్తిస్తుంది.” అన్నారు సినారె. శేషగిరి రావు గారి జీవిత చరిత్రలో ‘ఆత్మీయస్పర్శ’ గా!
తర్వాత ఆ సి.డి ఆవిష్కరణ సభ కళాభవన్‌లో జరిగినప్పుడు ఆపద్యాన్ని నాచేత చదివించారు. జీవిత చరిత్ర పుస్తకానికి ముందు మాట రాసిన సినారెగారు ఆ పుస్తకావిష్కరణ సభత్యాగరాయగాన సభలో జరిగినప్పుడు ఆ వేదికపై సినారె, వరవరరావు, వెలుదండని త్యానందరావు, కోవెల సంపత్‌కుమారాచార్యులు గార్లు అందరూ, పుట్టినింటికి, మెట్టినింటికీ కీర్తిని తెస్తున్నందుకు నన్ను అభినందిం చారు. “తెలంగాణలో పుట్టి జాతీయ స్థాయిలో యశోవిరాజితులైన అగ్రేసర చిత్రకారులు, నాకు సన్నిహిత మిత్రులు డా॥ కొండపల్లి శేషగిరిరావుగారు, నాలాగే నిజాం సర్కారు హయాంలోనే పాఠశాల విద్యను ఉర్దులో అభ్యసించారు.” అని రాస్తూ “గీత నా ప్రాణపల్లవి / కాంతి కల్పనా క్రాంతిపథము” అని కవిత్వం కూడా రాసిన శేషగిరిరావు గారి కవితాత్మను గురించి, అగ్రజులు దాశరథి, రామరాజుగార్లు నేనూ అతనిపైన ఆశువుగా ఒక సీస పద్యాన్ని ఆవిష్కరించాం. ఇది నా విద్యార్థి దశలోని మాట. శేషగిరి రావుగారి బహుముఖ మౌలిక చిత్రకళా ప్రతిభను గుర్తిస్తూ ఎందరో మహనీ యులు, ఎన్నెన్నో సంస్థల వారు సత్కరించారు. బిరుద ప్రదానం చేశారు. వాటిలో ఒకటి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా వున్నప్పుడు గవర్నర్ ద్వారా బహుకరింపజేసిన ప్రతిష్టాత్మక ‘హంసఅవార్డు’ . అని రాస్తునే ఈ నాలుగు మాటల్లో వున్నది శేషగిరిరావు పట్ల నాకున్న ఆత్మీయ స్పర్శ మాత్రమే” అన్నారు. సినారె టి.వి. ఇంటర్వూలలో తమ అభిమాన చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు అని చెప్పేవారు. “ఎక్కడున్నావు మిత్రమా/“ఒక్క మాటైనా చెప్పకుండా”/ అజ్ఞాత గగనాల్లో ఎగిరిపోయావా?” అని తమ కవి మిత్రుని మరణానికి సినారె బాధ పడిన ఈ పంక్తులు ఇక్కడ అన్వయించు కుంటే, ఆ దివ్యలోకాల్లో చిత్రాలు వేయాలని పోయిన ఆయన, సభాధ్యక్ష పదవులకు వెలుగులు సమకూరుస్తూ కవి సమ్మేళనాలు చేయాలని పోయిన ఈయన. అక్కడ ఆ పాత మధురాల పాటలు, కవితలు, రచనలు అందించిన ఆ పాత మిత్రులను కలుసుకునే ఉంటారు. భావమూర్తులకు కవితల మూర్తులకు, అశ్రునివాళి.