Home తాజా వార్తలు భారమనుకునే ఈ ఘోరం?

భారమనుకునే ఈ ఘోరం?

murder

మానసిక వికలాంగులైన మేనల్లుడు, మేనకోడలి హత్య

గొంతు నులిమి హతమార్చి గుట్టు చప్పుడు లేకుండా
వదిలించుకోబోయి పట్టుబడిన మేనమామ
అక్క బరువు తొలగించడానికేనా?
తమ్ముడుతో విభేదాలు లేవని, కేసు పెట్టొద్దని కోరిన సోదరి
హైదరాబాద్ చైతన్యపురిలో దారుణ ఉదంతం

మన తెలంగాణ/ ఎల్‌బినగర్: మానసిక వికలాంగులైన అక్క పిల్లలిద్దరిని మేనమామ అతి దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బి నగర్ ఎసిపి ఫృథ్వీధర్‌రావు, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీ దంపతులకు 12 ఏళ్ల క్రితం కవలలు సృజనారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి జన్మించారు. వీరు పుట్టుకతోనే మానసిక వికలాంగులు. ఇద్దరికీ తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చైతన్యపురిలోని ఠాకూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల కేంద్రంలో చికిత్స చేయిస్తున్నాడు. ఇటీవల సెలవుల్లో ఇరువురూ మిర్యాలగూడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. సృజనారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డిలకు చికిత్స చేయించాలని వారి మేనమామ మల్లిఖార్జున్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం బస్సులో తాను నివాసముంటున్న చైతన్యపురి ఇంటికి తీసుకువచ్చాడు. వేసుకున్న పథకం ప్రకారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తన రూమ్‌మేట్ అయిన వెంకట్‌రామ్‌రెడ్డి సహాయంతో సృజనరెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డిలను గొంతు నులిమి, అతి దారుణంగా హత్య చేశాడు. తన కోడలు, అల్లుడి ఆరోగ్యం బాగోలేదని వారిని ఆసుపత్రికి తీసుకుపోవాలని మల్లిఖార్జున్‌రెడ్డి తనకు తెలిసిన వ్యక్తి (టిఎస్ 08 ఈకె 3410 నెబంబర్ గల) కారును చైతన్యపురిలోని సత్యనారాయణపురంలోని తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ కారులో గుట్టుచప్పుడు కాకుండా సృజనారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డిల మృతదేహలను తరలించేందుకు యత్నించడంతో రాత్రి పూట ఏదో శబ్ధం విన్న ఇంటి యజమాని మహేష్‌రెడ్డి కిందికి వచ్చి స్థానికులను పిలవడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కారును పోలీస్ స్టేషన్ తరలించి, నిందితుడు మల్లిఖార్జున్‌రెడ్డి, అతని రూమ్ మేట్ వెంట్రామిరెడ్డి, కారు డ్రైవర్ వివేక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అక్క కష్టాలు చూడలేకనే హత్య :తన అక్క లక్ష్మి, బావ శ్రీనివాస్‌రెడ్డిలు గత 12 ఏళ్లుగా కవలలైన ఇరువురు మానసిక వికలాంగులతో పడుతున్న కష్టాలు చూడలేకనే వారి హత్య చేసినట్లు తెలుస్తుంది.
శుక్రవారం రాత్రి ఇద్దరు చిన్నారులను హత్య చేసిన వెంటనే పిల్లల్ని చంపివేశానని మల్లిఖార్జున్‌రెడ్డి తన బావకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గురైన చిన్నారుల తల్లి తండ్రులు చైత్యపురి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పిల్లల్ని హత్య చేసే విషయాన్ని మల్లి ఖార్జున్ రెడ్డి అక్కాబావలైన లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డిలతో ముందే చర్చించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో వారి పాత్ర ఉన్నట్లు ఆధారాలు దొరికితే వారి పై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
తమకు ఎలాంటి గొడవలు లేవు :తమ పిల్లల హత్య విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులైన లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డిలు చైతన్యపురి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. తమ పిల్లల హత్య వెనుక ఎలాంటి కుట్ర లేదని, తన బావమరిదితో తమకు ఎలాంటి గొడవలు లేవని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. హత్య చేసిన మల్లిఖార్జున్‌రెడ్డిపై పిల్లల తల్లిదండ్రులు కేసు పెట్టకపోవడం గమనార్హం. పైగా జరిగిందేదో జరిగింది. పోయిన ప్రాణాలు తిరిగిరావని, తన తమ్ముడిని వదిలిపెట్టాల్సిందిగా లక్ష్మి పోలీసులను కోరినట్టు తెలిసింది. లక్ష్మి తీరును గమనిస్తే పిల్లలను హత్యచేసే విషయం ఆమెకు ముందే తెలుసా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్క అనుమతితోనే నిందితుడు మల్లిఖార్జున్‌రెడ్డి పిల్లలను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రుల పాత్రను తెలుసుకునేందుకు వారి ఫోన్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.